పిట్ట కొంచెం పేరు ఘనం!

1 Mar, 2015 00:03 IST|Sakshi
పిట్ట కొంచెం పేరు ఘనం!

ప్లే టైమ్
చూడటానికి మన ఇళ్లల్లో కనిపించే పిచ్చుకలా కనిపిస్తున్నా పేరుకైతే ఇది ‘కింగ్‌బర్డ్’. ప్రధానంగా ఉత్తర అమెరికాలో కనిపిస్తూ ఉంటుంది. ఇది వలస పక్షి. సీజన్లను బట్టి సుదూర ప్రాంతం ప్రయాణించి జీవిస్తుంటుంది. మధ్య అమెరికాను మంచు దుప్పటి కప్పేసిన సమయాల్లో ఈ పక్షి జాతి పసిఫిక్ సముద్రంవైపు వెళ్లిపోతుంది. తీర ప్రాంతాల్లో వేసవి వేడి తగలగానే ఉత్తర అమెరికా మధ్యప్రాంతంలోకి వచ్చేస్తుంది. కొన్ని వేలమైళ్ల దూరం ప్రయాణించే శక్తిసామర్థ్యాలుంటాయి కింగ్‌బర్డ్‌కి.

సాధారణంగా చిన్నచిన్న పక్షి జాతులకు రాబందుల నుంచి, గద్దల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే కింగ్‌బర్డ్ మాత్రం అలాంటి వాటి చేతచిక్కదు. ఈ బుల్లి పక్షికి అడవి పిల్లుల, కుక్కల, నక్కల నుంచి ఎదురయ్యే ప్రమాదాలు కూడా తక్కువే. వాటన్నింటి బారి నుంచి తప్పించుకొనే అరుదైన పక్షిజాతి ఇది. 20 రోజుల వయసొచ్చే వరకూ ఈ పిట్టలు గూడుకే పరిమితమై ఉంటాయి. ఆ సమయంలో ఆడ, మగ పక్షులు రెండూ తమ పిల్లల పెంపకాన్ని బాధ్యతగా తీసుకొంటాయి. కీటకాలను, తేనెటీగలను, చిన్నచిన్న పురుగులను, చెట్లకు కాసే చిన్నచిన్న పిందెలను ఆహారంగా తీసుకొంటాయి.

మరిన్ని వార్తలు