ఎవరు దోషి?

21 Sep, 2014 00:55 IST|Sakshi
ఎవరు దోషి?

నిజాలు దేవుడికెరుక: కళ్లతో చూసేదంతా నిజం కాదు. నిజం అనుకుని పొరబడితే... ఆ పొరపాటు పెద్ద నష్టాన్నే చేస్తుంది. కొన్నిసార్లు జీవితాలనే నాశనం చేస్తుంది. అందుకు ఒకనాటి హాలీవుడ్ నటుడు రాస్కో అర్బకిల్ జీవితమే ఓ ఉదాహరణ.  అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే... రాస్కో జీవిత పుటల్ని ఓసారి తిరగేసి చూడాలి.
 
 సెప్టెంబర్ 8, 1921. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రి. ఓ కారు శరవేగంగా వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు హడావుడిగా దిగారు. ముగ్గురూ కలిసి కారులోంచి ఓ అమ్మాయిని జాగ్రత్తగా దించారు. ఆమె నిలబడే స్థితిలో లేదు. అప్పటికే స్పృహ కోల్పోయినట్టుగా కాళ్లూ చేతులూ వేళ్లాడుతున్నాయి. ఆమెని తమ చేతులతో ఎత్తి పట్టుకుని లోనికి తీసుకొచ్చారు వాళ్లు. అది చూస్తూనే వార్డ్‌బోయ్ పరిగెత్తుకొచ్చాడు.‘‘ఏమైంది?’’ అన్నాడు కంగారుగా.
 ‘‘చెప్తాం. ముందు తనని డాక్టర్‌కి చూపించాలి. అర్జెంట్’’ అంది ఒకామె.
 ‘‘ఏంటి... ఏం జరిగింది’’... అప్పుడే అటుగా వెళ్తున్న డాక్టర్ ఇటు వస్తూ అన్నాడు. వాళ్ల దగ్గరకు వచ్చి ఆ అమ్మాయివైపు చూశాడు.
 ‘‘ఈమెనెక్కడో చూసినట్టుందే’’ అన్నాడు సాలోచనగా.
 ‘‘చూసేవుంటారు. తను నటి... వర్జీనియా ర్యాపే’’... చెప్పాడు తీసుకొచ్చిన అబ్బాయి.
 ‘‘ఎస్... కరెక్ట్. ఏమయ్యింది తనకి?’’
 ముగ్గురూ ముఖాలు చూసుకున్నారు. నేను చెబుతాను అన్నట్టు సైగ చేసిందో అమ్మాయి.
 ‘‘తనని రేప్ చేశారు సర్’’ అంది తల దించుకుని.
 ‘‘వ్వా....ట్?’’
 ‘‘అవును. తను రేప్‌కి గురయ్యింది. అప్పట్నుంచీ స్పృహలో లేదు. వెంటనే ఏదో ఒకటి చేయండి’’
 ‘‘పోలీసులకి ఇన్‌ఫామ్ చేశారా?’’
 ‘‘చేశాం. వచ్చేస్తూ ఉంటారు.’’
 వర్జీనియా నాడి పరిశీలించాడు డాక్టర్. ‘‘నర్స్... థియేటర్ రెడీ చేయండి. బాయ్స్... ఆమెను తీసుకు రండి’’ అంటూ పరుగు తీశాడు. వెంటనే వార్డ్‌బోయ్స్ వచ్చి వర్జీనియాను స్ట్రెచర్ మీద వేసి తీసుకెళ్లారు. రెండు నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు. వాళ్లను చూస్తూనే ఒకమ్మాయి ఎదురెళ్లింది.
 ‘‘నేనే సర్ మీకు ఫోన్ చేసింది. నా పేరు బ్యాంబీనా. వర్జీనియా ఫ్రెండ్‌ని.’’
 ‘‘అసలేం జరిగింది?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘ఈరోజు సెయింట్ ఫ్రాన్సిస్ హోటల్లో పెద్ద పార్టీ జరిగింది సర్. దానికి మేమంతా వెళ్లాం. వర్జీనియా ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అంతా వెతికితే ఒక రూమ్‌లో కనిపించింది. మంచం మీద, రాస్కో చేతుల్లో... అచేతనంగా ఉంది’’... గడగడా చెప్పింది బ్యాంబీనా.
 ‘‘రాస్కోనా?’
 ‘‘అవును సర్... రాస్కో అర్బకిల్. నటుడు, దర్శకుడు.’’
 ఏదో అనబోతున్నవాడల్లా థియేటర్ తలుపులు తెరచుకోవడంతో ఆగిపోయాడు ఇన్‌స్పెక్టర్. డాక్టర్ బయటకు రావడం చూసి అతడి దగ్గరకు వెళ్లాడు.
 ‘‘డాక్టర్.. ఆమె ఎలా ఉంది?’’
 పెదవి విరిచాడు డాక్టర్. ‘‘చాలా సీరియస్... ఇప్పుడే ఏ విషయం చెప్పలేం. బ్లాడర్ బాగా రప్చర్ అయ్యింది. ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంది.’’
 పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమైంది ఇన్‌స్పెక్టర్‌కి. మళ్లీ కలుస్తానని చెప్పి బయలుదేరాడు.
    
 బెల్ పదే పదే మోగడంతో విసుక్కుంటూ లేచాడు రాస్కో. టైమ్ చూసుకున్నాడు. తెల్లవారుజాము మూడవుతోంది.
 ‘‘అబ్బా... ఈ టైమ్‌లో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు’’ అనుకుంటూ మంచం దిగి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా ఉన్న పోలీసులను చూసి ఆశ్చర్యపోయాడు.
 ‘‘ఏంటి? ఏదైనా ప్రాబ్లెమా?’’ అన్నాడు అర్థం కానట్టుగా.
 ‘‘ప్రాబ్లెమే. మాక్కాదు, నీకు’’ అంటూ లోనికి వచ్చి గదంతా పరికించి చూశాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘ఈ టైమ్‌లో వచ్చి నా రూమ్ సోదా చేస్తున్నారేంటి?’’ అన్నాడు రాస్కో అయోమయంగా.
 ‘‘సాక్ష్యాలు కావాలి కదా మిస్టర్ రాస్కో’’... వెటకారంగా అన్నాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘సాక్ష్యాలా... దేనికి?’’
 ‘‘నటి వర్జీనియా ర్యాపేని నువ్వు రేప్ చేశావని నిరూపించడానికి’’.
 ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తనని రేప్ చేయడమేంటి? అది నిజం కాదు’’ అరిచినట్టే అన్నాడు రాస్కో.
 ‘‘అరిస్తే నిజాలు అబద్ధాలైపోవు మిస్టర్... యు ఆర్ అండర్ అరెస్ట్’’ అంటూ రాస్కో చేతులకు బేడీలు వేశాడు ఇన్‌స్పెక్టర్.
   
 మర్నాడు...
 ‘‘నో... వర్జీనియాని నేనేం చేయలేదు’’... రాస్కో అరుపులతో ఇంటరాగేషన్ సెల్ దద్దరిల్లిపోయింది.
 అప్పటికి అరగంట నుంచి అడుగుతున్నారు పోలీసులు. కానీ ఎన్నిసార్లు అడిగినా అతడదే చెబుతున్నాడు. దాంతో ఇన్‌స్పెక్టర్‌కి కబురు చేశారు. అతడు వడివడిగా వచ్చాడు.
 ‘‘టైము, టైమింగ్ విలువ నటుడివి నీకు తెలిసింతగా ఇంకెవరికి తెలుస్తాయి రాస్కో! అనవసరంగా సమయం వృథా చేయకుండా నిజం ఒప్పేసుకో.’’
 అతడంత కఠినంగా మాట్లాడటం చూసి మౌనంగా అయిపోయాడు రాస్కో.
 ‘‘నేను మంచివాణ్ని కాబట్టి ఇంకా చేతికి పని చెప్పలేదు. నన్ను రెచ్చగొట్టొద్దు. ఏ తాగిన మత్తులోనో తప్పు చేసుంటావ్. ఒప్పుకుంటే నీకే మంచిది. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? వర్జీనియా హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడిది రేప్ కేసు కాదు, మర్డర్ కేస్.’’ ఉలిక్కిపడ్డాడు రాస్కో. ‘‘వర్జీనియా చచ్చిపోయిందా?’’ అన్నాడు బెదురుగా చూస్తూ. ఇన్‌స్పెక్టర్ తలాడించాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రాస్కోకి. రెండు క్షణాల తర్వాత అన్నాడు. ‘‘నేను నిర్దోషిని సర్. నన్ను నమ్మండి.’’ ‘‘నేరస్తులను నమ్మడం మొదలుపెడితే మేం యూనిఫాములు తీసేయాల్సి వస్తుంది మిస్టర్ రాస్కో. నీ సంగతి రేపు కోర్టు తేలుస్తుంది’’ అనేసి వెళ్లిపోయాడు ఇన్‌స్పెక్టర్. కటకటాల గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు రాస్కో.
   
 ‘‘ఈ కేసును వచ్చే నెల పన్నెండో తేదీకి వాయిదా వేస్తున్నాను. ముద్దాయి రాస్కో అర్బకిల్‌ని రిమాండ్‌కు తరలించాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తున్నాను.’’జీవితం ఒక్కసారిగా చీకటైపోయినట్టు అనిపించింది రాస్కోకి. ఏం చేయాలో అర్థం కాక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. చూస్తున్నవాళ్లంతా అవాక్కయిపోయారు. అతడికి శిక్ష పడాలి అని కోరుకున్నవాళ్లకు కూడా మనసు చలించింది ఆ ఏడుపు చూసి. అప్పుడైనా అతడి గురించి వేరే కోణంలో ఆలోచించి ఉంటే... రాస్కోకి న్యాయం జరిగివుండేది. కానీ ఎవ్వరూ అలా ఆలోచించలేదు.
 
 రాస్కో అర్బకిల్ మంచి నటుడు. చక్కని రచయిత. వైవిధ్యతను చూపించే దర్శకుడు. ఇండస్ట్రీలో అతడికి మంచి పేరుంది. పెద్ద సర్కిల్ ఉంది. కానీ అవన్నీ ఒక్క కేసుతో దూరమైపోయాయి. ఆరోజు షూటింగ్‌లో గాయపడటంతో విశ్రాంతి తీసుకోవడానికి, సెయింట్ ఫ్రాన్సిస్ హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు రాస్కో. తర్వాతి రోజు రాత్రి ఓ నటుడు ఇచ్చిన పార్టీలో తను కూడా పాల్గొన్నాడు. కాసేపటి తర్వాత తన గదికి వెళ్లాడు. అప్పుడే అనుకోకుండా వర్జీనియా ర్యాపే గదిలోకి దూసుకొచ్చింది. బాగా తాగివుంది.
 
 బాత్రూమ్‌లోకి వెళ్లి వాంతులు చేసుకోసాగింది. దాంతో గబగబా వెళ్లి ఆమెకి సహకరించాడు. తీసుకొచ్చి మంచం మీద కూచోబెట్టాడు. తాగడానికి నీళ్లిచ్చాడు. మత్తులో పిచ్చిపిచ్చిగా ఏడుస్తుంటే ఓదార్చే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అప్పుడే వర్జీనియా ఫ్రెండ్ బ్యాంబినో ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. రాస్కో గదిలో ఆమెను చూసి షాకయ్యింది. బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. బాగా ఏడ్చినట్టుగా చెంపల మీద కన్నీటి చారికలు ఉన్నాయి. దానికి తోడు ఆమె రాస్కో చేతుల్లో ఉంది. దాంతో ఆమె పట్ల ఏం జరిగివుంటుందో ఊహించుకుంది. అంతలో వర్జీనియా స్పృహ కోల్పోవడంతో గబగబా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయింది.
 
 రేప్ జరిగింది అని బ్యాంబినా చెప్పిన ఒక్క మాటతో దర్యాప్తు మొత్తం ఆ దిశలోనే జరిగింది. రాస్కో గదిలో ఉంది కాబట్టి పోలీసులు అతడిని దోషిగా ఎంచారు. డాక్టర్ కూడా బ్లాడర్ గాయపడ డానికి, ఇంటర్నల్ బ్లీడింగ్‌కి దారుణంగా రేప్ చేయడమే కారణమని నిర్ణయించేశాడు. దాంతో కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు రాస్కో. కొన్ని రోజులకు బెయిల్ దొరికినా... కోర్టుల చుట్టూ తిరగడంతోనే జీవితం గడిచిపోయింది. అవకాశాలు తగ్గి పోయాయి. పేరు ప్రఖ్యాతులు మంటగలిసిపోయాయి. సంపాదించినదంతా లాయర్ ఫీజులకు కరిగిపోయింది. కానీ అదృష్టం... నిజం నిలకడ మీద బయటకు వచ్చింది. పార్టీలో పాల్గొన్న కొందరు వర్జీనియా ప్రవర్తన గురించి ఇచ్చిన సాక్ష్యం, రాస్కో నిర్దోషిత్వాన్ని బయటపెట్టింది.
 
 ఎక్కడ పార్టీ జరిగినా విచిత్రమైన వస్త్రధారణలో వచ్చేది వర్జీనియా. పీకల దాకా తాగేది. రచ్చ రచ్చ చేసేది. విపరీతంగా ఏడ్చేది. ఎక్కడ పడితే అక్కడ కక్కుకునేది. ఆమెను కొందరు సంస్కారం లేని మనిషి అంటే, కొందరు అందరి కళ్లలో పడటానికే అలాంటివి చేస్తుందనేవారు. ఈ విషయాలన్నీ కొందరు కోర్టులో చెప్పారు. దానికి తోడు రాస్కో ఎంత నెమ్మదస్తుడో, ఎంత నిజాయతీపరుడో కూడా చెప్పారు. అతడి మీద అంతవరకూ ఒక్క రిమార్కు కూడా లేకపోవడం కూడా కలిసివచ్చింది. దాంతో రీ పోస్ట్‌మార్టమ్‌కి ఆదేశించింది న్యాయస్థానం. అప్పుడు తెలిసి వచ్చింది... వర్జీనియా మీద అసలు అత్యాచారమే జరగలేదని, కొన్ని రోజుల ముందు జరిగిన అబార్షన్ వల్ల బ్లాడర్ దెబ్బతిందని!
 
 ఓ అమాయకుడిని పోలీసులు, వైద్యులు కలిసి ఎలా నేరస్తుణ్ని చేశారో ప్రపంచానికి తెలిసివచ్చింది. న్యాయస్థానం కేసు కొట్టేసింది. జరిగిన తప్పుకి రాస్కోకి క్షమాపణ చెబుతూ ఓ లేఖ కూడా వెలువరించింది. కానీ ఏం లాభం? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డబ్బు లేదు. పేరు లేదు. కెరీర్ లేదు. ఉన్నదల్లా... శూన్యం. ఆ శూన్యం అతడిని చాలా కుంగదీసింది. తన జీవితంపై పడిన నెత్తుటి మరకను తుడిచేసుకోలేక, పన్నెండేళ్లపాటు జీవచ్ఛవంలా బతికాడు. 1933, జూన్ 29న కన్నుమూశాడు. ఈ కేసులో అసలు దోషి ఎవరు? తన ఊహతో కథలు అల్లిన బ్యాంబినోనా? సరైన సాక్ష్యాలు లేకుండానే అతడిని నేరస్తుడిగా పరిగణించిన పోలీసులా? కనీస పరీక్షలు కూడా చేయకుండా అత్యాచారం జరిగిందని నిర్ధారించేసిన వైద్యుడా? ఎవరు?!
 - సమీర నేలపూడి

>
మరిన్ని వార్తలు