‘ఏపీ అవతరణ’ తేదీ ఎప్పుడు?

4 Jun, 2019 00:28 IST|Sakshi

రెండో మాట

‘‘తెలుగుజాతి మనది –
నిండుగ వెలుగుజాతి మనది
తెలంగాణ మనది – రాయలసీమ మనది
సర్కారు మనది – నెల్లూరు మనది
అన్నీ కలిసిన తెలుగునాడు –
మనదే, మనదే మనదేరా’’! 

అలాంటి ప్రాచీనతా చరిత్ర గల తెలుగుజాతి పరస్పర పరిపాలనా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా (తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌) విడిపోయి అయిదేళ్ళు నిండి పోయాయి. కాగా  విడిపోయిన సోదర తెలంగాణ రాష్ట్ర పాలకులు ఏటా జూన్‌ 2వ తేదీని తమ రాష్ట్రావతరణ దినోత్సవంగా ప్రకటించుకుని కడచిన అయిదేళ్లుగా వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, ఆగమేఘాల మీద రహస్యంగా ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు అంగీకారం తెల్పుతూ, ముఖ్యమంత్రి పదవి కోసం తహతహలాడుతూ కాంగ్రెస్‌ అధిష్టానం ఎదుట తెల్లకాగితంపై సంతకం చేసి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. దురదృష్టవశాత్తూ అధికారంలో ఉన్న గత అయిదేళ్లుగా ఏ ఒక్కనాడైనా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణోత్సవం జరిపిన పాపాన పోలేదు. యావత్‌ భారతదేశంలో నాటి స్వరాజ్య సమ రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు నాందీ ప్రస్తావన చేసిన త్యాగధనులు ఆంధ్రులేనన్నది చారిత్రక సత్యం. ఆ సత్యానికి నూనె పోసి, వత్తులు వెలిగించి, నిలిపి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అస్వతం త్రులుగా గడుపుతూ, మద్రాసీయులుగా అష్టకష్టాలు సహిస్తూ వచ్చిన ఆంధ్రుల గౌరవ ప్రతిష్టలు కాపాడేందుకు స్వతంత్ర భారత్‌లో తొలి సారిగా ఆమరణ దీక్షకు దిగి, ఆత్మబలిదానం ద్వారా ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగనిరతిని కేంద్ర కాంగ్రెస్‌ నాయకత్వం, నెహ్రూ ప్రభుత్వం  గుర్తించకపోగా, తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోవడానికి అంగీకరిం చక తాత్సారం వహించిన ఫలితమే శ్రీరాములు బలవన్మరణం! 
ఆ అసమాన త్యాగఫలితంగా 1953 అక్టోబర్‌ 1న మద్రాస్‌ నగరం లేని ఆంధ్ర రాష్ట్రావతరణకు 20వ శతాబ్దపు గుంటనక్కగా నాటి రాజకీ   యాల్లో ప్రసిద్ధిపొందిన చక్రవర్తుల రాజగోపాలాచారి ఎత్తుగడలకు నెహ్రూ సై అనడంతో మార్గం ఏర్పడింది. అమరజీవికి సైదోడుగా యావదాంధ్రలోకం ఒక్క గొంతుతో నినదించినదాని ఫలితమే ఇది. పరాయి పాలకుల కుట్రల ఫలితంగా చెల్లాచెదురైపోయిన ఆంధ్ర– తెలంగాణ ప్రాంతాల ఆంధ్రులను విశాలాంధ్రగా ఒక గొడుకు కిందికి చేర్చాలని ఆశించిన వాడు కూడా శ్రీరాములేనని మరవరాదు. యావత్‌ దక్షిణాంధ్రప్రజలకు శతాబ్దాలుగా తమ శ్రమజీవన సౌందర్యంతో తెలు గువారు దారిదీపాలై పెంచి మహానగరంగా రూపురేఖలు దిద్దిన మదరాసుతో కూడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని అమరజీవి కోరుకున్నారు. ఎందుకంటే బళ్లారి నుంచి ఉత్తరాంద్ర సరిహద్దుల దాకా పక్కనున్న పొరుగు ఒడిశా ప్రాంతాల దాకా చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా చెదిరి పోయిన ప్రాంతాలను, ప్రాంతీయ ఆంధ్రులను ఒక్కతాటిపైకి తేవడం ద్వారానే ఆంధ్రత్వానికి వ్యక్తిత్వమూ, పాలనా సౌలభ్యమూ సన్నిహిత మవుతాయని అమరజీవి ఆశించారు. ఆయన అనుపమానమైన త్యాగ ఫలితంగా (1953 అక్టోబర్‌ 1) దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన సుదినం కాబట్టి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అక్టోబర్‌ ఒకటవ తేదీనే రాష్ట్రావతరణ దినోత్సవంగా జరపడం అన్నివిధాలుగా సబబుగా, శ్రేయస్కరంగా ఉంటుంది. పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానా నికి నిండైన, మెండైనా నివాళిగా ఉంటుంది. 

ఇది ఒక్క మద్రాసు నగరానికి సంబంధించిన తెలుగువారి ఆనాటి గోడు మాత్రమే కాదు, చారిత్రకంగా తమిళనాడుతో ఆంధ్రులకు, ఆంధ్ర పాలకులకు ఉన్న అనుబంధాన్ని సమీక్షించుకుంటే.. తమిళ భూభాగం లోని తంజావూరు, మదుర, చెంచి రాజ్యాల్లో తమిళుల ఆదరాభిమా నాలు పొందుతూ తెలుగు పాలకులుగా ఖ్యాతికెక్కినవారు తెలుగు నాయకరాజులేనని మరవరాదు. వీరు తెలుగులో పరిపాలన నిర్వహించ డమే కాకుండా ప్రధానమతాల (హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ) మధ్య సమన్వయాన్ని సమతుల్యంతో కాపాడారు. వీరే గాకుండా మరాఠా రాజులు తంజావూరు ఏలికలైనప్పుడు కూడా తెలుగు కవి త్వాన్ని ఆదరించి, తెలుగు సాహిత్య పోషణకు దోహదం చేశారు, ఆ రోజుల నుంచి పరాయి పాలకుల శకం ముగిసేదాకా తెలుగు ప్రము ఖులలో దక్షిణాంధ్ర దారిదీపాలుగా (నా పాత్రికేయ సహచరులు, ఆకాశ వాణి ప్రయోక్త నాగసూరి వేణుగోపాల్‌కు కృతజ్ఞతతో) ఉన్న మహనీ యులు ఎందరో! అమరజీవి బలిదానానికి, ఆయన పోరాట చరిత్రకు సంబంధించిన ఈతరం వారికి తెలియని పలు అంశాలను తెలియజేస్తూ ‘బలిదానం’ పేరిట వెలువడిన రచన కూడా ఈ తరానికి దారిదీపమే. 

ఈ సందర్భంగా మదరాసు నగరం పూర్తిగా తమిళులకే గానీ ఆంధ్రులకు ఏమాత్రం చెందదని ఆనాడు వాదించి ఆంధ్రనాయకుల వాదనను కొందరు పూర్వపక్షం చేస్తున్న రోజులలోనే సర్‌ శంకరన్‌ నాయర్‌ అనే తమిళ నాయకుడు మద్రాస్‌ శాసనమండలిలో (1936) తమిళులకు సంపూర్ణ స్వపరిపాలనా ప్రభుత్వం కావాలని కోరిన సందర్భంలోనే ఒక విస్పష్ట ప్రకటన చేశాడు. ‘ఏర్పర్చబోయే తమిళ ప్రత్యేక రాష్ట్రం పాలనా పరిధి నుంచి మద్రాసు నగరాన్ని వేరు చేయాలి. ఎందుకంటే, మద్రాసు నగరం పూర్తిగా తమిళనాడులో లేదు గనుక, సగం తమిళభాషీయులదైతే, మిగతా సగం మద్రాసు తెలుగు ప్రాంతీ యులదీ‘ అని నిండు పేరోలగంలో ప్రకటించారాయన. (ఆంధ్రోద్యమ నాయకులలో ఒకరైన గుమ్మడిదల వెంకటసుబ్బారావు రచించిన ‘హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రా మూవ్‌మెంట్‌‘ వాల్యూం–2, పేజీ 505)! ఈ చరిత్ర పూర్తిగా తెలిసి ఉన్న వాడు కాబట్టే అమరజీవి శ్రీరాములు ఆనాడు ఆ సగ భాగంలో భారీ సంఖ్యలో ఉన్న దక్షిణాంధ్రులకు పూర్తి నిలయంగా ఉన్న మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు తపన పడ్డారు. ఆ మాట కొస్తే తమిళనాడు ఏలికలుగా ఉన్న తెలుగువారు ఒకరా, ఇద్దరా, ఎందరో! 1920–2016 మధ్య కాలంలో తమిళనాడుకు 12 మంది తెలుగు ముఖ్యమంత్రులే ఉన్నారు. 

తమిళనాడులో ఉన్న ‘తమిళాంధ్ర పార్టీ’ విడుదల చేసిన సాధికార సమాచారం ప్రకారం ‘క్రీస్తు శకం ఒకటో శతాబ్దికి పూర్వం నుండీ తమిళనాడులోని తెలుగువారు దాదాపు అక్కడి స్థానికులే. అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడి పొలాల్ని దున్ని, వ్యాపారాలు చేసి అక్కడి సంపదను పెంచినవారు, అక్కడి సంస్కృతిని, తమిళాన్ని వికసింపజేసి పలు రకాల కళల్ని అభివృద్ధి పరిచినవారే’’. అంతేగాదు, మరోమాటలో చెప్పాలంటే, తమిళనాడులోని 30 జిల్లాల్లో తెలుగు లేని జిల్లా లేదు, అలాగే మొత్తం 165 తాలూకాల్లో తెలుగు పల్లెలు లేని తాలూకాయే లేదు. చివరికి ‘సంగం’ యుగం గురించి తమిళ సోదరులు ఎంత గొప్పగా చెప్పుకున్నా వారిలో సంగం యుగ కవుల్లో భాగమైన ఆళ్వా రులు వంటి కవుల్లో అత్యధికులు తెలుగువారై ఉండి, తమిళ రచనలూ చేసి ప్రసిద్ధికెక్కినవారే. ఈ సమన్వయ ప్రతిభ గల వారు కాబట్టే జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, జస్టిస్‌ వీఆర్‌ కృష్ణయ్యర్‌ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల దేశ సమైక్యతకు ఆటంకం కాలేదనీ, ప్రాంతీయ దురభిమానాలనూ నిస్సారమైన కేంద్రీకరణ (సెంట్రలైజేషన్‌) వాదాన్నీ కాక, ఆచరణ యోగ్యమైన ఫెడరల్‌ (సమైక్య) రాజ్యాంగ వ్యవస్థ దృఢమైన పునాదులు నిర్మించుకోవాలనీ, అఖండ భారతజాతి ఏకతా భావానికి అదే రక్షణ అనీ స్పష్టం చేయవలసి వచ్చింది. 

1905 నాటి బెంగాల్‌ విభజనకు ముందే, 1904 నాటి గుంటూరు యువజన మహాసభ, ఆ తర్వాత బయ్యా నరసింహశాస్త్రి అధ్యక్షతన బాపట్ల మహాసభ మొదలు అమరజీవి శ్రీరాములు ప్రాణత్యాగం దాకా, ఆంధ్ర రాష్ట్రావతరణకు, స్వపరిపాలనకు ఆంధ్ర దేశమంతటా మహోద్య మాలు ఉవ్వెత్తున కొనసాగుతూనే వచ్చాయి. వాటి ఫలితమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరణ. ఈ మహోద్యమాలలో అంతర్భాగంగానే మద రాసులోని ‘ఆంధ్ర పత్రిక’ స్థాపకులు పండిత కాశీనాథుని నాగేశ్వర్రావు బస చేసిన ‘శ్రీబాగ్‌’ (నివాసం పేరు)లో ఆనాటి కోస్తా, రాయల సీమాంధ్ర నేతల మధ్య రాయలసీమ వెనుకబాటు తనానికి పరిష్కారం ప్రాతిపదికపైన ప్రత్యేక ఒడంబడిక కుదిరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ ఒప్పందంలోని అంశాలు సంపూర్ణమైన పరిష్కారం కోసం ఈ రోజుకీ ఉభయ ప్రాంతాల నాయకుల మధ్య సంప్రతింపుల పర్వం నడుస్తూనే ఉంది. పెక్కుమంది రాష్ట్ర నాయకులు తమ వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాటకు ప్రాధాన్యమిచ్చి, ఒప్పం దంలోని ప్రధానాంశాల అమలుపై కేంద్రీకరించి ఆయా ప్రాంతాల కరువు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి సమన్వయపూర్వక వైఖరిని ప్రదర్శించక పోవడంవల్లనే ప్రజలు ఆందోళన చెందవలసి వస్తోంది. కనుకనే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ ప్రాంత సమస్యలు ఉన్నాయి. 

రాయలసీమ కరువు ప్రాంతానికి ఆర్థిక రాజధాని అవసరమని, దర్శి, కనిగిరి, పొదిలి, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల మధ్య అతి తక్కువ సమయంలోనే ఆర్థిక–వాణిజ్య రాజధాని (ఫైనాన్షియల్‌ కాపిటల్‌) అభివృద్ధి కాగలదని పలువురు ప్రజా ప్రతిని ధులు భావిస్తున్నారు. తద్వారా ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే అవకాశమూ దొరుకుతుందన్నది వారి విశ్వాసం. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ రకరకాల సమస్యలను ప్రజలు ఎదు ర్కొంటున్నారు. అన్ని ప్రాంతాలలోనూ పూర్తయిన ప్రాజెక్టులకన్నా, పూర్తి కాని లేదా పదే పదే శంకుస్థాపన దశలు దాటని ప్రాజెక్టుల సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి పరిస్థితులలోనే ప్రాంతీయవాదాలూ, ఆందో ళనలూ పెరుగుతుంటాయి. కనుకనే నదీ జల వివాదాలు, పంపిణీ విధానాలూ కొన్ని జల వివాద ట్రిబ్యునళ్ల వివాదాస్పద తీర్పులవల్ల కూడా ప్రాంతీయ తగాదాలు పెచ్చరిల్లుతున్నాయి. వీటన్నిటినీ ఏపీ నూతన మంత్రివర్గం, సీఎంగా జగన్‌ చైతన్యవంతమైన సారథ్యంలో సామరస్యంగా పరిష్కరించడం సాధ్యమనే విశ్వాసం ప్రజలకు ఉంది. ఈ పురోగమనంలో అంతర్భాగంగానే అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కొనసాగింపుగా విశాలాంధ్ర విభజనానంతరం ఏర్పడిన ఏపీకి ఏటా అక్టోబర్‌ ఒకటవ తేదీని రాష్ట్రా వతరణ దినోత్సవంగా జరుపు కోవడం సకల విధాలా శ్రేయస్కరమని ప్రతిపాదన. పైగా రాయలసీమకు ముఖ ద్వారమైన కడప కేంద్రంగా అనేక ప్రత్యేకాంధ్ర మహాసభలూ జరిగాయని మరవరాదు. ప్రతి పాలకుడూ ’కర్పూర వసంతరాయలు’ కాకపోవచ్చు! కానీ పాలకుడు ప్రజాహితుడైతే మాత్రం కర్పూర ఘుమఘుమలు నలుదిక్కులా వ్యాపించి, సంక్షేమ కార్యాచరణతో నిత్యవసంతాన్నే ప్రజలకు పంచగలుగుతాడు.

ఏబీకే ప్రసాద్‌,సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

 

మరిన్ని వార్తలు