ఆపద్ధర్మంలోనూ అధర్మపాలనే!

11 Sep, 2018 01:02 IST|Sakshi

రెండో మాట

ప్రజల తీర్పును లెక్కచేయకుండా నిరంకుశంగా వ్యవహరించడంలో ఇద్దరు తెలుగు సీఎంలదీ ఒకే బాట. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఇంకా పది మాసాలుండ గానే 2003 నవంబర్‌లో చంద్రబాబు శాసనసభను రద్దుచేయించారు. చంద్రశేఖర్‌రావు ఎనిమిది మాసాల ముందే తెలంగాణ అసెంబ్లీని రద్దుచేశారు. కాగా, ఇరువురు ‘చంద్రులు’ తమ రాష్ట్రాల గవర్నర్ల ముందు సాగిలపడి ఆపధర్మ ముఖ్యమంత్రులుగా తామే కొనసాగేలా ఏర్పాట్లు చేసుకోవడంలో కూడా ఘనాపాటీలేనని మరువరాదు. నిజానికి ఈ ‘ఆపధర్మం’ అన్న మాట గాని, ‘ఆపధర్మ ప్రభుత్వం’ ఏర్పాటు గానీ పాలకులు తమ అవసరాల కొద్దీ సృష్టించుకున్న పదాలే.
అన్నింటా వేలు పెట్టి అహం బ్రహ్మ కావా లని/ఆశించేవాడు తుదకు యంబ్రహ్మగా మారుతాడు/ ధనస్వామ్యం వర్గాన్నే వెనకేసుకు తిరుగుతాడు!!

రాజ్యాంగ నిర్వహణా పద్ధతుల్ని దీర్ఘకాలం పాటు జల్లెడ పట్టి మరీ పరిశీలించిన అనుభవంతో మహాకవి వెలిబుచ్చిన ఈ అభిప్రాయం నేటి రెండు తెలుగు ప్రభుత్వాల ఆచరణకు అద్దంపడుతోంది. తెలుగు ప్రజ లకు ఇరు ప్రాంతాల గొడుగు పట్టి కడతేర్చుదామని బయల్దేరిన ఇద్దరు చంద్రులు (చంద్రబాబు, కేసీఆర్‌) గురు శిష్యులుగా ఎదిగివచ్చి తెలుగు ప్రజల్ని చీల్చి ముఖ్యమంత్రులయ్యారు. సంతోషం. కానీ పాలనాధికా రాలు, రాజ్య నిర్వహణ వ్యవహారాలను పంచుకోవడంలో కూడా ఒకే పద్ధతి అనుసరిస్తు న్నారు. శాసనసభలను అర్ధంతరంగా రద్దుచేయ డంలో ఇద్దరిదీ ఒకే బాట, అయితే ఒక్క తేడా ఉంది. వైఎస్సార్సీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను, తెలుగుదేశం పార్టీని మింగేయడానికి శరవేగాన దూసుకువస్తున్నాడన్న భీతి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబుని పీడిస్తోంది. అందుకే అసెంబ్లీని రద్దుచేయడానికి సాహసించడం లేదు. అసెంబ్లీ కాలపరిమితి పూర్తయ్యేదాకా ఆయన దింపుడు కళ్లం ఆశతో కాల క్షేపం చేస్తున్నారు.

ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్వేలు జరి పించగా కొన్ని పట్టణ ప్రాంతాలు మినహా జిల్లాల్లో మాత్రం గుండెకు దడ పుట్టించే నివేదికలు వచ్చాయి. దీంతో కేంద్రంలో నిలకడలేని ప్రధాని నరేంద్రమోదీ అండ చూసుకుని అసెంబ్లీని ఆకస్మికంగా రద్దు చేయించారు. ఐదేళ్లూ పరిపాలించి ‘మాకు మంచి చేయండి’ అని ఓట్లు వేసి ఆశీర్వదించిన ప్రజల ఆంకాంక్షలకు భిన్నంగా వ్యవహరించారు. ప్రజల తీర్పును లెక్కజేయకుండా నిరంకుశంగా వ్యవహరించడంలో ఇద్దరు తెలుగు సీఎంలదీ ఒకే బాట. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ఇంకా పది మాసాలుండగానే 2003 నవంబర్‌లో చంద్రబాబు శాసన సభను రద్దుచేయించారు. చంద్రశేఖర్‌ రావు 8 మాసాల ముందే తెలం గాణ అసెంబ్లీని రద్దుచేశారు. కాగా, ఇరువురు ‘చంద్రులు’ తమ రాష్ట్రాల గవర్నర్ల ముందు సాగిలపడి ఆపద్ధర్మ ముఖ్యమంత్రులుగా తామే కొన సాగేలా ఏర్పాట్లు చేసుకోవడంలో కూడా ఘనాపాటీలేనని మరువరాదు. నిజానికి ఈ ‘ఆపద్ధర్మం’ అన్న మాట గానీ, ‘ఆపద్ధర్మ ప్రభుత్వం’ ఏర్పాటు గానీ పాలకులు తమ అవసరాల కొద్దీ  సృష్టించుకున్న పదాలే.

సంప్రదాయంగా వచ్చిన దురలవాటు!
ఇది ఒక ‘సంప్రదాయం’గా మారిన దురలవాటేగాని రాజ్యాంగం అను మతించిన శాసనం కాదని గుర్తించాల్సిన సమయం వచ్చింది. అలాగే, ఆర్డినెన్స్‌ ద్వారా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రజల నెత్తిన రుద్దడాన్నీ రాజ్యాంగం అనుమతించదు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ రద్దుకు చంద్రబాబు చూపిన సాకు–‘శాంతి భద్రతల యంత్రాంగం వైఫల్యం, ఆర్థిక పరిస్థితుల అస్తవ్యస్త స్థితి’. నేడు తెలం గాణ సీఎం కేసీఆర్‌ చూపుతున్న కారణాలు దాదాపు అలాంటివే. కానీ, నిర్దిష్టమైన, సమర్ధనీయమైన నిర్ణయం మాత్రం కాదు. ఈ నిష్కారణ మైన తొందరపాటుతో అసెంబ్లీని రద్దుచేస్తే ఆరు నెలల్లోగా శాసన సభకు ఎన్నికలు జరిపించాల్సిన రాజ్యాంగ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. అయితే, తెలంగాణ ఎన్నికలను ఏ పరిణామంతో ముడిపెట్టి 9 మాసాల ముందే శాసనసభను రద్దుచేశారు? ఎందుకు డిసెంబర్‌లోనే తిరిగి ఎన్నికలు జరపాలని హడావుడిగా ప్రకటించారు? మూడు ఉత్త రాది రాష్ట్రాల అసెంబ్లీల గడువు తీరేలోగా వచ్చే డిసెంబర్‌ లోగా ఎన్ని కలు జరిగే పరిస్థితులుండడం, వాటితోపాటే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే తమకు మంచిదనే అభిప్రాయం సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి కారణం.

అసెంబ్లీ రద్దు కారణంగా సాధారణ గడువుకు ముందే ముందస్తుగా ఎన్నికలు పూర్తి హడావుడిగా జరపడానికి కొన్ని సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేయాలి. వాటిలో ప్రధానమైనది ఓటర్ల జాబితా తుది సవరణ. 2003 నవంబర్‌లో అప్పటి ఏపీ అసెంబ్లీని అక స్మాత్తుగా రద్దు చేయడం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో అప్పటికి నమోదైన లక్షలాది బోగస్‌ ఓటర్ల పేర్లు తొలగించి తుది జాబితా ప్రకటించారు. తెలంగాణలో కూడా బోగస్‌ ఓటర్లు ఉన్నారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆప ద్ధర్మ ప్రభుత్వాల అధినేతలకు సైతం అనేక ఎత్తుగడలు వేయడానికి ఆస్కారం ఉంది. శాసనసభను రద్దు చేయడం వల్ల ఏ కొత్త బిల్లు రూప కల్పనకు, ప్రవేశ పెట్టడానికి అవకాశం లేదు. కాని అనుకూలంగా వ్యవ హరించే గవర్నర్ల ద్వారా ఆర్డినెన్సులు జారీ చేయించుకుని తమ పనులు పూర్తిచేసుకోవచ్చని ఉమ్మడి శాసనసభ రద్దు తర్వాత అప్పటి ఆపద్ధర్మ సీఎం చంద్రబాబు భావించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఓటర్లను ప్రభా వితం చేసే నిర్ణయాలు తీసుకోరాదు. రోజూవారీ వ్యవహారాలకు సంబం ధించి మాత్రమే నిర్ణయాలు చేయాలి. బడ్జెట్‌ తయారీ, భారీ ప్రాజె క్టులపై ప్రకటనలు, నామినేటెడ్‌ పదవుల పంపిణీ, ఉన్నతాధికారుల బదిలీలు వంటి నిర్ణయాలు ఆపద్ధర్మ సర్కార్లు తీసుకోవడం నిషిద్ధం. ఇలాంటి ఆంక్షలను తొలిసారిగా నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి హోదాలో ప్రవేశపెట్టారు. కానీ, రాజ్యాంగంలో ఇలాంటి నిషేధం ఏదీ లేదన్న సాకుతో నాటి ఆపద్ధర్మ ప్రధాని చరణ్‌సింగ్‌ దాన్ని వ్యతిరేకించారు.

‘ఆపద్ధర్మ’ నిర్ణయాలను తోసిపుచ్చిన రాష్ట్రపతులు!
గతంలో వాజ్‌పేయి నాయకత్వంలోని ఆపద్ధర్మ సర్కారు, గుజరాత్, పంజాబ్‌ అసెంబ్లీలు రద్దయ్యాక అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా భావించి కొందరు రాష్ట్రపతులు తిరస్కరించారు. శాసనసభలను సమావేశపరచి, చర్చించిన తర్వాత అసెంబ్లీ రద్దు ప్రకటించాలన్న కనీస ఇంగితం కూడా నేటి పాలకులకు కొరవడింది. అసలు ఆపద్ధర్మం అనే పదాన్నే రాజ్యాంగంలో చేర్చన ప్పుడు మరి ఏ చట్టం చాటు నుంచి నర్మగర్భంగా ఆచరణలోకి తెచ్చి పాలకులు ఇలా లబ్ధి పొందుతున్నారు? విధాన నిర్ణయాలకు వీల్లేకున్నా కార్గిల్‌ యుద్ధ సమయంలో ఆపద్ధర్మ ప్రధానిగా వాజ్‌పేయి ఈ దిశగా పావులు కదిపారు. ఆపద్ధర్మంపై ప్రసిద్ధ న్యాయ కోవిదుడు ఎంపీ పాయ్‌ ‘చేతలుడిగిన ప్రభుత్వం అసెంబ్లీని రద్దుచేసుకుని 6 నెలలు నిద్రాణావస్థ లోకి జారుకోవడం అనేది చట్టబద్ధత కన్నా సామాజికంగా, నైతికంగా ఎంతవరకు ఆమోద యోగ్యమన్నదే అసలు ప్రశ్న’ అని వ్యాఖ్యానిం చారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి కూడా అన్ని నియమాలు ఉల్లంఘించే నేర్పు ఉంటుంది.

ఆ పనిని ఒకటో చంద్రుడు చేయగా లేనిది రెండో చంద్రుడికి మాత్రం ఎందుకు అడ్డు ఉంటుంది? అసెంబ్లీతో సంబంధం లేకుండా నిమిషాల్లో కేబినెట్‌ సమావేశం జరిపించి తెలంగాణ చంద్రుడు గడువుకు ముందే శాసనసభ ఎన్నికలకు తెరతీశారు. మళ్లీ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ రద్దు విషయానికి వస్తే, అలిపిరిలో నక్సలైట్ల దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన చంద్రబాబు సానుభూతితో గెలవవచ్చనే అంచనాతో ఈ పనిచేశారని ప్రపంచబ్యాంక్‌ సైతం నాడు వ్యాఖ్యానిం చింది. అందువల్ల అనేక రంగాలలో విషమ ఫలితాలను ప్రజలు అను భవించాల్సి వచ్చింది. ఆపద్ధర్మ ప్రభుత్వాలు మధ్యంతర దశలో ఎలాంటి కొత్త పథకాలను ప్రవేశ పెట్టడానికి వీల్లేదని మరో రాజ్యాంగ చట్ట నిపుణుడు డాక్టర్‌ దుర్గాదాస్‌ బసు ‘కాన్సిస్టిట్యూషనల్‌ లా ఆఫ్‌ ఇండియా’లో పేర్కొన్నారు.

ఇంతకూ మన పాలనా వ్యవస్థలు ఇంతటి ప్రజా వ్యతిరేక చర్యలు, ఎత్తుగడల ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోడా నికి ఎలా సాహసిస్తున్నాయి? ఆడింది ఆటగా, తాము పాడింది పాటగా రాజకీయ పక్షాలు యథేచ్చగా సామాన్య ప్రజా బాహుళ్యంపై ఇలా ఎలా స్వారీ చేయగల్గుతున్నాయి? ఈ ప్రశ్నకు చింతనను రేకెత్తించగల సమా ధానాన్ని రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ ముసాయిదా రచనకు ముందే  ఆసక్తికరంగా ఇలా ప్రకటించారు: ‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ‘స్వేచ్ఛ’ అనే పదంపై మితిమీరిన ఆశను రేకెత్తించింది. అది మానవుల మధ్య సమా నత్వాన్ని పాదుకొల్పడానికి ఏనాడూ సాను కూల తనూ ప్రదర్శించలేదు. సమానత్వం ప్రాధాన్యతను గుర్తించడంలో అది విఫలమయింది. కనీసం స్వేచ్ఛకు, సమానత్వానికి మధ్య ఉండవల సిన సమ తుల్యతనూ అది పాటించలేదు. దాని పర్యవసానంగానే అసమానతల పరంపర జడలు విప్పుకుంది. అన్ని రాజకీయ సమా జాలు రెండువర్గాలుగా–పాలకులు, పాలితులుగా విడిపోతూ వచ్చాయి. ఇది సంఘానికి చెరుపే. అంతటి దాకా ఈ చెడు ఆగి పోయినా కొంత మేలు. కానీ పాలకులు ఎప్పుడూ పాలక వర్గాల నుంచే వస్తున్నారు గానీ, పాలిత వర్గాలు ఎన్నడూ పాలక వర్గంగా రూపొందడం లేదు.

అందుకనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎన్నడూ నిజమైన ప్రజా ప్రభుత్వంగా గానీ లేదా ప్రజల ప్రభుత్వంగా గానీ రూపొందలేక పోయింది. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఎంతగా ప్రజా ప్రభుత్వ మనే డాబూ దర్పాల కవచం తొడుక్కున్నా ఆచరణలో వాస్తవానికి అది వారసత్వ కుటుంబ పాలక వర్గంగానే ఉండిపోయింది. రాజకీయ జీవి తంలో విష వలయంలో చిక్కుబడిపోయినందున పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమై పోతోంది. అందుకే తనకు ఇంత స్వేచ్ఛనూ, ఇంత సంతోషాన్నీ, ఆశాభావాన్నీ కల్పించగలదన్న ఆశతో ఉన్న సామాన్యుడి కనీస కోర్కెను కూడా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తీర్చడంలో విఫలమవుతోంది’’ (డాక్టర్‌ అంబేడ్కర్‌ స్పీక్స్‌: వాల్యూం 1). అందాకా ఏదో రూపంలో సంపన్నవర్గ పాలకుల నాలుకలు సాగుతూనే ఉంటాయి. అందాకా దగాపడిన ప్రజలంతా నిత్య సమరంలోనే ఉంటారు.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@ahoo.co.in

మరిన్ని వార్తలు