ప్రజాధనం కాదు ప్రజలపై భారం..!

16 May, 2018 02:35 IST|Sakshi

ప్రజాధనంతో ప్రజా రాజధాని అనే పేరిట 3.5. 2018 నాడు నేను రాసిన వ్యాసానికి 8.5.2018 నాడు సాక్షి దినపత్రికలో సీఆర్‌డీఏ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీని వాస్‌ వివరణ ఇచ్చారు. దానిపైన నాస్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను.

గ్రీన్‌ ఫీల్డ్‌ మహా నగర నిర్మాణం వ్యాపారపరంగా లాభసాటికరమైన కార్యక్రమం కాదని అందుచేత దీనికోసం అప్పులు చేస్తే అప్పులను తీర్చే భారం ప్రజల మీద పడుతుందనేది నా వ్యాసంలోని ప్రధాన అంశం. సీఆర్‌డీఏ వారు పేర్కొన్న ఉదాహరణలు పూర్తిగా పోల్చడానికి వీలులేనివి. ఈ సందర్భంగా బొంబాయి నగరానికి దగ్గరగా ఉన్న బాంద్రా కుర్ల కాంప్లెక్స్‌ నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల రూపంలో వనరులు సేకరించడాన్ని ఉదాహరిం చారు. ముంబై చాలా అభివృద్ధి చెందిన నగరం. దాని పరిసర ప్రాంతాలైన బాంద్రా కుర్ల ప్రాంతాల్లోని భూమి ధరలు సహజంగానే ఎక్కువ ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు టౌన్‌షిప్‌లు నిర్మించటానికి బాండ్ల  రూపంలో ధనాన్ని సేకరిస్తే దానిని తిరిగి అక్కడ జరిగే వాణిజ్య కార్యక్రమాల ద్వారా తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ అమరావతి ఒక గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టుగా మనం రూపొందిస్తున్నాం. కృత్రిమంగా ఈనాడు నెలకొన్న భూమి ధరలు శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. అటువంటి ధరలను ఆధారం చేసుకుని ప్రణాళిక రూపొందించుకోవడం భవిష్యత్తులో సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఆ చుట్టుపక్కల జరిగే వాణిజ్య కార్యక్రమాలను అనుసరించి కానీ అమరావతిలో ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని కానీ అటువంటి ధరలు దీర్ఘకాలంలో కొనసాగే అవకాశాలు కనిపిం చటం లేదు. ఈ స్థితిలో ఈ ప్రణాళిక లాభసాటిగా లేనప్పుడు దీని ద్వారా వచ్చే లాభాలతో అప్పులు అవకాశం చాలా తక్కువ. అప్పుడు ఈ భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడే పడుతుంది.

ఈ విధంగా గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టులుగా మహానగర నిర్మాణాలు చేసిన దేశాలలో ఆర్థికపరమైన ఒడుదుడుకులు సంభవించాయి. ఉదాహరణకు బ్రెజిల్‌ దేశంలోని రాజధాని నిర్మాణ కార్యక్రమం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలాకు కారణమైంది. ఆ దేశంలో సైనిక పరిపాలనకు దారి తీసింది. ఊహించని ఆర్థిక వనరులు ఉన్న ఉన్న నైజీరియా, మలేషియా లాంటి దేశాలు మాత్రమే పెట్రోల్‌  ఆదాయాన్ని మహా నగర నిర్మాణానికి  ఉపయోగించి ఆర్థిక ఒడుదుడుకులను తట్టుకోగలిగాయి. కాబట్టి బాంద్రా కుర్ల కాంప్లెక్స్‌ ఉదాహరణలు చూపించి అమరావతి నగర నిర్మాణానికి ప్రజల నుంచి బాండ్ల ద్వారా వనరుల సేకరణను సమర్థించుకోవటం పొరపాటు.

ఇక రెండో ఉదాహరణ ఎన్టీపీసీ లాంటి వాణిజ్య సంస్థలు. ఈ వాణిజ్య సంస్థలలో వాణిజ్య పరమైన లావాదేవీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అటువంటి కార్యక్రమాలకు వారు వనరుల సేకరణ బ్యాంకుల ద్వారా సేకరించవచ్చు బాండ్ల రూపంలో ప్రజల నుంచి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రుణాలను వాణిజ్యపరమైన కార్యక్రమాల ద్వారా వచ్చే లాభాల నుంచి మాత్రమే తిరిగి చెల్లిస్తారు. రుణాల సేకరణకు వెళ్ళకుండా ప్రజల ద్వారా బాండ్లను స్వీకరించటంలో ఆర్థిక సంస్థలకు కొంత వెసులుబాటు ఉన్నది అనేది వాస్తవం. కేంద్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని పన్ను రాయితీలు ప్రకటించటం ద్వారా మౌలిక సదుపాయాల బాండ్ల ద్వారా వనరులు సేకరించవచ్చు. కానీ ఏదైనా వాణిజ్యపరంగా లాభసాటి అయిన కార్యక్రమానికి మాత్రమే ఈ వనరుల సేకరణ జరిగినప్పుడు తిరిగి చెల్లించే బాధ్యత కూడా ఆ సంస్థ పైనే ఉంటుంది. వాణిజ్యపరంగా లాభసాటి కానప్పుడు తప్పకుండా ఈ భారం పన్నుల రూపంలో ప్రజల మీద పడుతుంది. అమరావతి నిర్మాణానికి ఇటువంటి బాండ్ల రూపంలో ప్రజల నుంచి వనరులు సేకరించిన తిరిగి వాటిని తీర్చే బాధ్యత  పన్నుల రూపంలో ప్రజల మీద పడే అవకాశం ఉన్నది. ఒక గ్రీన్‌ఫీల్డ్‌ నగరం వాణిజ్యపరంగా లాభదాయకంగా నిర్మించిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటి ప్రయత్నాలు జరిగిన చోట అనూహ్యమైన వనరులు ఉంటే తప్పితే ఆర్థిక సంక్షోభాలు చోటుచేసుకున్న దాఖలాలే కనిపిస్తాయి.

ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి 
iyrk45@gmail.com

మరిన్ని వార్తలు