బాబు భజనలో ఏపీ బీజేపీ!

7 Aug, 2019 02:12 IST|Sakshi

విశ్లేషణ

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండునెలలైనా కాకముందే  టీడీపీతోపాటు బీజేపీ రాష్ట్ర నేతలు కూడా నూతన ప్రభుత్వ పాలనపై అవాకులు చవాకులు పేలుతున్నారు. చంద్రబాబుకంటే జగన్‌ పాలన అధ్వానంగా ఉందనీ, 2019 ఎన్నికల తర్వాత ఏపీ ప్రజల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టయిందనీ ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజామోద చర్యలను కూడా వక్రీకరించి విమర్శించడం వీరికీ అంటింది. అవినీతి రహిత పాలన దిశగా అడుగులేస్తున్న జగన్‌ని అభినందించాల్సింది పోయి అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరీ ముఖ్యంగా అమరావతి, పోలవరం వంటి అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వం సాగించిన తప్పులను సరిదిద్దుతాం అన్నా సరే బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించడం దేనికి సంకేతం?

అదేంటోగానీ బీజేపీ వారికి హఠాత్తుగా 105 డిగ్రీల జ్వరం వచ్చినట్లుంది. ఆ తీవ్రతతో మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై ఏవో సంధిప్రేలాపనలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ సొంతంగా లోక్‌సభలో మెజారిటీ సాధించుకోవడం తోటే అలా జ్వరతీవ్రతతో వ్యవహరిస్తున్నట్లున్నది. కేంద్రంలో వారి నిర్వాకం తర్వాత చెప్పుకుందాం! 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో తామే అధికారంలోకి వస్తామని ఊహాగానాలు చేస్తున్నారు. పాపం పగటి కలలు కనే హక్కు కూడా వారికి లేదా అని సరిపెట్టుకుందాం అనుకుంటే, వారినోటి దురుసుతనానికి హద్దులేకుండా ఉన్నది. చంద్రబాబు పాలనకంటే జగన్‌ పాలన అధ్వానంగా ఉందనీ, 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టయిందనీ ఇలా ఆ పార్టీ నేతలు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి గానీ, ఆయన పార్టీ నేతలు గానీ వీరిని కనీస ప్రతిస్పందనగా మాటమాత్రమైనా విమర్శించడం లేదు. చివరకు జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజామోద చర్యలను కూడా వక్రీకరించి విమర్శించడం వీరికీ అంటింది. ఎంతయినా చంద్రబాబు గారి స్నేహ ప్రభావం మరి. 

రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ గత అయిదేళ్ల పాలన ఎంత అవినీతికరంగా మారిందో, ఇప్పుడు వివరించడం వెయ్యితలల ఆదిశేషుడి తరం కూడా కాదు. చంద్రబాబుకు ఒక పీఠిక ఉంది. చంద్రబాబు చేత, చంద్రబాబు కోసం, ఆయన తనయుని కోసం, చంద్రబాబు ఆయన అనుచర గణం యొక్క ప్రభుత్వం అన్నట్లుగా సాగిన విషయం అనుభవంలో ఉన్నదే! పోలవరం ప్రాజెక్టునే తీసుకుందాం! ప్రాజెక్టు నిర్మాణానికి పునాది పడ్డ నాటి నుంచే బాబుగారి హయాంలో ఆమ్యామ్యాల ఇసుకతో, అవకతవకల కాంక్రీటుతో, అగమ్యగోచరమైన పనితీరుతో ప్రారంభమైంది. టెండర్ల విధానం లేదు,  ఉన్నా దానిపై పట్టింపు లేదు. అంతా బాబుగారి కనుసన్నలలో నామినేషన్‌ పద్ధతిలో, తనకు తన అనుంగు తమ్ముళ్లలో ఎవరు ఎక్కువ కమీషన్‌ ఇవ్వగలరు అన్న టెండరింగ్‌ విధానంతో జరిగిందే! అసలు కేంద్రప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టును తానే కట్టుకుంటాను, మీరు డబ్బులివ్వండి అన్నట్లు బాబుగారు ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టి మరీ తీసుకున్నదే అందుకోసం కదా! ప్రభుత్వ డబ్బు అంటే మన ప్రజల డబ్బే. 

అలా అల్లాలు, బెల్లాలుగా, ప్రాజెక్టుకోసం అనే పేరుతో తనకు, తన వెన్నుపోటు పార్టీ నేతల బినామీ అకౌంట్ల జేబులలోకి ఎలా వెళ్లిందో, ఎంత వెళ్లిందో ఒక నిపుణుల కమిటీ ద్వారా నిర్ధారించి ఆ అవినీతి సొమ్మును కక్కించి, ప్రజల సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి అనే సత్‌ సంకల్పంతో వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు అలా ఆమ్యామ్యా కాంట్రాక్టులను రద్దు చేసి ఏ రాష్ట్రంలోనూ జరగని రీతిలో ఒక న్యాయమూర్తి అధీనంలోని కమిటీ ద్వారా, ఎవరూ గత కాంట్రాక్టర్ల మాదిరి తూతూమంత్రంగా కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఎవరు తక్కువ ధరకు కోట్‌ చేస్తే వారికి బహిరంగ వేలం ద్వారా (నామినేటెడ్‌ పద్ధతికి స్వస్తిచెప్పి) కాంట్రాక్టులు అప్పజెప్పేట్లు పారదర్శకంగా విధాన నిర్ణయం తీసుకుంది. 

ఇంకా అక్రమాల లోగుట్టు పూర్తిగా తవ్వకముందే, (ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ అధినేత రాయపాటి సాంబశివరావు నిర్మాణ సంస్థ. ఇప్పుడాయన వెన్నుపోటు పార్టీ నేత మాత్రమే కాదు బాబుగారికి సన్నిహితుడు. ఈ మధ్య ఈయన కూడా శ్రావణ మాసంలో బీజేపీలో చేరతారని అంటున్నారు.) ఇప్పుడు నవయుగ కంపెనీకి అదే నామినేషన్‌ పద్ధతి మీద అప్పచెప్పిన విషయం, నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో కాదనలేని రీతిలో బట్టబయలయింది. ఆ సొమ్మును ఆయా సంస్థల నుంచి వసూలు చేసి, ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తానంటూ వైఎస్‌ జగన్‌ తన ప్రభుత్వ అవినీతి రహిత పాలన ప్రాధాన్యాన్ని ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు. ఇప్పుడు అదే చేస్తున్నారు కూడా. ఇది తవ్విన కొద్దీ ఎన్ని తప్పుడు పనులు, ఎన్ని వందల కోట్ల అవినీతి సొమ్ము బయటపడనుందో  ఆ పరమాత్ముడికే ఎరుక.

నిజానికి అవినీతి రహిత పాలన దిశగా అడుగులేస్తున్న యువనేత జగన్‌ని అభినందించాల్సింది పోయి అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ టెండరింగ్‌ విధానం వల్ల పోలవరం నిర్మాణం ఆలస్యమవుతుంది. పైగా ఖర్చుకూడా పెరుగుతుంది, అంటూ కువిమర్శల గళం విప్పుతున్నారు. కానీ గతంలో 2018 జూన్‌ కల్లా పోలవరం డ్యామును పూర్తి చేసి నీళ్లందిస్తామని బాబుగారి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ అక్కడ వాస్తవంగా సాగుతున్న నత్తనడక పనితీరుపై ఒక్కనాడన్నా బీజేపీ నేతలు ప్రశ్నించారా ? ఏమయింది నీ నిర్వాకం చాల్లే బాబూ.. ఆ ప్రాజెక్టును 2019కైనా పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యతను కేంద్రం  తీసుకుంటుందనైనా హెచ్చరించారా బీజేపీ నేతలు? నాలుగేళ్ల 3 నెలలు త్వమేవాహమ్‌ (నువ్వే నేను) అన్నట్లు చంద్రబాబుతో వ్యవహరించి ధృతరాష్ట్ర కౌగిలి దోస్తానాం అని గ్రహించిన తర్వాత కదా బాబుతో తెగతెంపులు చేసుకున్నది. 

చంద్రబాబుతో మైత్రి కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో ‘నీ మంచి నే చెబితేనే’ అని పాడుకోవల్సి వస్తుందని తెలుసుకున్న తర్వాతనే కదా మీరు బాబు పాలనపై సన్నగానైనా గొణగడం మొదలెట్టింది? 
బీజేపీ నిర్లజ్జగా వెన్నుపోటు పార్టీ నేతలకు గాలం వేస్తోంది. అదీ రిటైల్‌గా కాదు. టోకుగా! ఆరుగురు రాజ్యసభ సభ్యులలో నలుగురిని తమ పార్టీలో చేర్చుకుని రాజ్యాంగబద్ధంగానే వారిని తమ పార్టీలో విలీనం చేసుకున్నామని ప్రకటించి మరీ అక్కున చేర్చుకున్నది. వాళ్లెంత ఉత్తములో అందరికీ తెలిసిందే. వందలకోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి డొల్ల కంపెనీలకు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన సీఎం రమేష్, సుజనాచౌదరి వంటివారు. ఏపీ గత శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ను కూడా చేర్చుకోవాలని బీజేపీ భావించినప్పటికీ పార్టీ పరువు పోతుందని ఊరుకున్నారేమో మరి. తమాషా ఏమిటంటే వెన్నుపోటు పార్టీ గానీ, దాని నేత చంద్రబాబు గానీ సీఎం రమేష్, సుజనా తదితరులను పార్టీ ద్రోహులనే తీవ్ర విమర్శలు ఇంతవరకు చేయనేలేదు. 

కారణం తెలిసిందే. వారు బీజేపీ ముసుగులుగా ఉంటూ చంద్రబాబు తరపున బీజేపీ లాబీయిస్టులుగా ఉండాలన్న పథకంలో భాగంగా పార్టీ మారినవారే కదా. తాను చేసిన అవినీతి నుంచి బయటపడటం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ, షాతో నెయ్యానికి బాబు నెరిపిన చాణక్యం కదా ఇది. ఇప్పటికే సుజనా చౌదరి ఒక మీడియా గోష్టిలో కూడా ’జగన్‌ వ్యక్తిగత ద్వేషంతో చంద్రబాబుపై కేసులు పెడుతున్నారనీ, అవినీతి వంకతో జగన్‌ గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని దీనివల్ల రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులో జాప్యం జరగడమే కాదు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందనీ’ చెప్పారు. పైగా బీజేపీ తరపున ఉంటూ సుజనా చౌదరి చెప్పినట్లుగా చట్టం తన పని తాను చేసుకుపోతే వెన్నుపోటు పార్టీ నేతలు, కోవర్టులు అంతా శిక్షార్హులై, జైళ్లలో మగ్గినా ఆశ్చర్యం లేదు. బాబుగారి బీజేపీ చుట్టరికం ఆ చట్టం తన పని తాను చేయకుండా ఉండటానికే కదా!

బీజేపీ మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కావాలంటే 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి చేరాల్సి ఉంటుంది. అసలే మోదీ, షాలు గుజరాత్‌ వ్యాపారస్తుల లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. నీరవ్‌ మోదీ, అంబానీలు, అదానీలు వీరి మిత్రులే. కనుక అదేమీ పెద్ద కష్టం కాదు. రాజకీయ జిత్తులు, ఎత్తులతోనే కదా బీజేపీ మోదీ మానియాను సృష్టించింది. నిజానికి బీజేపీకి మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 37 శాతం ఓట్లే వచ్చాయి. అంటే 63 శాతం మంది వారిని వ్యతిరేకిస్తున్నట్లే కదా. కానీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షం లేకుండా రోడ్డురోలర్‌ పాలన తామే సాగించాలన్నది మోదీ ఆశయం. ఆయన పాలనలో నల్ల ధనం విదేశీ బ్యాంకుల్లో మగ్గుతూనే ఉంది. అలాంటి నల్లధనంతో మునిగితేలుతున్న సాటి షావుకార్లను మోదీ పాలన ఏమీ చేయలేదు. 

వారి ప్రతాపమంతా ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం గలవారితో. గోరక్షణ పేరుతో, మరో కుంటిసాకుతోనో మూక దాడులు చేయించి, మన దేశంలో దళితులను, మైనారిటీలను భయభ్రాంతులను చేయడం. అవసరమైతే హత్యలు కూడా చేయడం. లౌకిక, పురోగామి దృక్పథం కల మేథావులను అర్బన్‌ నక్సల్స్‌ పేరుతో జైళ్లలో కుక్కడం లేదా మతోన్మాద దృక్పథం కలవారిచే మట్టు బెట్టించడమూ చూస్తున్నాం. బీజేపీ దేశభక్తి (మన గురజాడ అన్నట్లు మన దేశ ప్రజలపై ప్రేమానురాగాలు కాదు) అంటే పాకిస్తాన్, చైనా దేశాల పట్ల వ్యతిరేకత. వారి జాతీయభావం అంటే భారతదేశం విభిన్నజాతుల సముదాయం అనే వాస్తవాన్ని నిరాకరించి, వివిధజాతుల ప్రత్యేకతలను రోడ్డురోలరుతో చదును చేసి ఏకశిలా సదృశమైన ఒకే వ్యక్తి నియంతృత్వం సాగించడం. కశ్మీరులో మోదీపాలనలో రగులుతున్న అగ్నిగుండం చూస్తున్నారు కదా. 

దీనికి భిన్నంగా మన రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజాస్వామ్యయుత చట్టబద్ధ పాలనతో అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, యువకుడైనా చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి తీవ్రకృషి చేస్తున్నారు. ఇల్లు ఖాళీ చేసిన వెన్నుపోటు పార్టీవారు నానా చెత్తాచదారం, మురుగు పోగేసి వెళ్లారు. అదంతా శుభ్రం చేయకుండా ఎలా నివసించగలం? ఖజానా ఖాళీ చేయడమే కాకుండా దాదాపు 3 లక్షల కోట్ల అప్పు మిగిల్చిపోయారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. నవరత్నాలు వైఎస్సార్‌ సీపీకి బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటివి అని ఆ బాట పట్టారు జగన్‌ ఇప్పటికే. 

అంతకంటే దేశానికే ఆదర్శంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు, మహిళలకు పాలనా వ్యవస్థలో, ఉద్యోగ కల్పనలో 50శాతం రిజర్వేషన్‌ కల్పించి ప్రజాభిమానం చూరగొన్నారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని నిలబెడుతూ, ప్రజాభివృద్ధికోసం నిరంతరం ప్రత్యేక హోదా విషయం గానీ, విభజన సందర్భంగా నాటి పార్లమెంటు, ప్రభుత్వం అంగీకరించిన హామీలు కానీ అమలు జరిపే కృషి చేస్తున్నారు. రోమ్‌ నగరం ఒక్కరోజులో నిర్మితం కాలేదన్న నానుడి ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని నిజాయితీగా ఈ జనరంజక పాలనను ప్రజలు సమర్థించాలి. ఏవైనా లోటుపాట్లు ఉంటే పాలకుల దృష్టికి తేగలగాలి. ఆ దిశగా ప్రజా ఉద్యమాలు ఉండాలి. ఏ కుటిల రాజకీయాలకూ తావివ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ముందుకు సాగాలని ఆశిద్దాం.


వ్యాసకర్త: డాక్టర్‌ ఏపీ విఠల్‌; మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98480 69720

>
మరిన్ని వార్తలు