తెలంగాణ సాయుధపోరుకు మలుపు బి.ఎన్‌.

9 May, 2018 01:47 IST|Sakshi
భీమిరెడ్డి నర్సింహారెడ్డి

తెలంగాణలో భూమి, భుక్తి, విముక్తి కోసం 1947–51 వరకు జరిగిన సాయుధపోరాటం మూడు వేల గ్రామాల్ని ప్రభావితం చేసింది. ఈ పోరాటానికి ముందుగా నిజాం రాష్ట్రంలో ఆర్యసమాజం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. వారి ఉద్యమమే క్రమంగా కమ్యూనిస్టుల పోరాటంగా మారింది. అదే చివరకు సాయుధపోరాటం అయ్యింది. ఆనాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైన జనగామ పిర్కాలో విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ బువ్వగింజల పోరాటం చేసింది.

పండిన పంటను కల్లాల దగ్గర్నుంచి తీసుకుపోవడానికి విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు అడ్డుపడ్డారు. చాకలి ఐలమ్మ ప్రతిఘటించింది. ఇదే చరిత్రకు మలుపు. ఈ మలుపు దగ్గర్నుంచి ఒక సింహంలా దూసుకొచ్చిన యోధుడు విసునూరు రామ చంద్రారెడ్డి గూండాలను పారిపోయేటట్లు చేశాడు. ఆ వడ్ల గింజల బస్తాను భుజం మీద వేసుకుని బండ్ల పైకి ఎక్కించి చాకలి ఐలమ్మ ఇంటికి ఆ బువ్వగింజల్ని పంపించాడు. ఆ యోధుడే భీమిరెడ్డి నర్సింహారెడ్డి. అప్పటికే జనగామ పిర్కాలో ఆనాటి భూస్వాములకు వ్యతిరేకంగా సంఘాలు ఏర్పడ్డాయి. దేవరుప్పలలో తొలిసారిగా దేవులపల్లి వేంకటేశ్వరరావు నాయకత్వంలో గుతపలు తీసుకుని ఎదురుతిరిగారు.

చరిత్రలో దాని పేరు గుతపల సంఘమైంది. ఐలమ్మ బువ్వగింజల పోరాటం నుంచి పిడికిలి బిగించిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి సాయుధపోరాటాన్ని విరమించేంత వరకు వెనుతిరిగి చూడకుండా పోరాడిన యోధుడు. గుతపల సంఘంతో పాటు  గ్రామీణ ప్రాంతంలో రైతులను సమీకరించి వారికి అందుబాటులో ఉన్న వనరులని ఆయుధాలుగా మలిచి భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి భీమిరెడ్డి. కోటపాడు గ్రామంలో గడ్డివాములను తగులబెట్టి పొగబాంబులుగా మార్చి నిజాం పోలీసు, సైనికదళాలని మట్టు పెట్టిన ఘనుడు ఆయన. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో సాయుధపోరాటానికి రూపకల్పన చేసిన మిలిటరీ వ్యూహకర్త.

నాలుగేళ్లు కొనసాగిన సాయుధపోరాటంలో భీమిరెడ్డి ఏనాడు కూడా వెనకకు పోలేదు. చిత్రహింసలను అనుభవించాడు. అయినా ఎత్తిన తుపాకీ దించలేదు. తెలంగాణలో లక్షలాది ఎకరాల భూమిని భూస్వాములనుంచి లాక్కొని పేదలకు పంచటంలో కమ్యూనిస్టులు ప్రజలకు చేరువయ్యారు. ఈ పోరాటంలోనే శత్రువుపై పోరాడుతూ భీమిరెడ్డి తన చేతులో ఉన్న కొడుకును కూడా వదిలేసి వెళ్లిపోయాడు. బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవు కొడుకో నైజాం సర్కరోడా అని పాట కట్టిన బండి యాదగిరికి కొండంత అండగా నిలిచినవాడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి.

తన పోరాటమంతా గిరిజనులు, బహుజనుల చుట్టే తిరిగింది. ప్రధానంగా ఈ పోరాటమంతా భూసమస్య చుట్టూ తిరిగింది. కాబట్టే చదువురాని నిరక్షరాస్యులైన ఆ మూగజీవాలను మహాయోధులుగా మార్చి పోరా టం చేయించిన చరిత్ర తెలంగాణ సాయుధపోరాటానికే దక్కుతుంది. ఆ ఖ్యాతిలో  భీమిరెడ్డి చరిత్ర చెరిగిపోనిది. భీమిరెడ్డి దళ నాయకుడిగా వందల సంఘటనల్లో పాల్గొన్నాడు. శత్రువుతో ముఖాముఖి యుద్ధాలకు తలపడ్డాడు. ఆనాటి సంఘం చెప్పిన మాటను జవదాట కుండా పనిచేశాడు. అందుకే భీమిరెడ్డిని తెలంగాణ క్యాస్ట్రో అంటారు.
(నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నేడు బీఎన్‌ తొలి స్మారక ఉపన్యాసం)
– ప్రొ‘‘ అడపా సత్యనారాయణ (రిటైర్డ్‌), ఉస్మానియా యూనివర్శిటీ 

మరిన్ని వార్తలు