ఏపీలో పరిహారం ఒక్కరికే

9 May, 2018 01:48 IST|Sakshi

లైంగిక దాడి బాధితులేమో 901 మంది

న్యూఢిల్లీ: లైంగికదాడి బాధితులకు పరిహారం అందించటంలో అనేక రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ(నల్సా) సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017లో ఆంధ్రప్రదేశ్‌లో 901 లైంగికదాడి కేసులు నమోదు కాగా, కేవలం ఒక్క బాధితురాలికే పరిహారం అందిందనీ, 2016లో 850 కేసుల్లో 8మందికి, పోక్సో చట్టం కింద నమోదైన 1,028 కేసుల్లో 11 మంది మాత్రమే పరిహారం పొందారని వెల్లడించింది. నిర్భయ ఘటన అనంతరం మహిళల భద్రత, రక్షణకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.

లైంగికదాడి బాధితులకు పరిహారం విషయమై జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల బెంచ్‌ మంగళవారం వాదనలు వింది. ఈ సందర్భంగా నల్సా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాఠి పలు విషయాలను బెంచ్‌ ముందుంచారు. దేశ వ్యాప్తంగా లైంగిక దాడి బాధితుల్లో కేవలం 5–10 శాతం మందికి మాత్రమే పరిహారం అందుతోందని వివరించారు.

ఇదే సమయంలో రాజస్తాన్‌లో 2017లో 3,305 అత్యాచార కేసులు నమోదు కాగా 140 మంది, బిహార్‌లో 1,199 కేసులకు గాను 82 మంది బాధితులు పరిహారం పొందారని రాఠి తెలిపారు. ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి సమా చారం అందాల్సి ఉందన్నారు. నిర్భయ నిధిని బాధితులకు అందించటంలో రాష్ట్రాల నుంచి సహకారం అందటం లేదని కేంద్రం తరఫు లాయర్‌ తెలిపారు. బాధితులకు పరిహారం పంపిణీకి సంబంధించిన ఆదేశాలను ఈనెల 10న వెలువరిస్తామని బెంచ్‌ తెలిపింది.

>
మరిన్ని వార్తలు