అది కోర్టు ధిక్కారమే

9 May, 2018 01:46 IST|Sakshi

న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపకం ప్రణాళికను కేంద్రం ఇప్పటికీ రూపొందించకపోవడం పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 16న తాము తీర్పు ఇస్తే ఇప్పటివరకు నీటి పంపకాల ప్రణాళిక సిద్ధం కాలేదని సీజేఐ దీపక్‌ మిశ్రా నేతృత్వంలో జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగా గల ధర్మాసనం మండిపడింది.

కోర్టు తీర్పును అనుసరించి నీటి పంపకాలపై ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈ నెల 14న తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శిని న్యాయమూర్తులు ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు 2007లో చేసిన కావేరి నీటి కేటాయింపులను మారుస్తూ సుప్రీం ఫిబ్రవరి 16న తీర్పునివ్వడం తెలిసిందే. కేంద్రం వ్యవ హారం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందనీ, ఎవరో ఒకరిని జైలుకు పంపాలని తమిళనాడు తరఫున మంగళవారం వాదనలు వినిపించిన న్యాయవాది శేఖర్‌ నఫాడే కోర్టును కోరారు. తదుపరి విచారణ మే 14కు వాయిదా పడింది.

మరిన్ని వార్తలు