వ్యవసాయంపై మరో గుదిబండ

7 Dec, 2018 01:17 IST|Sakshi

ఆహార ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు, పళ్లు, కాయగూరలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ దిగుమతులు వరదలా వచ్చిపడటంతో ఇప్పటికే కునారిల్లుతున్న భారత వ్యవసాయ రంగం మరింత అధ్వాన్నంగా మారింది. కాబట్టి, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక (ఆర్‌సీఈపీ)లో మనం ఎందుకు చేరాలి? చివరికి అమెరికాలో ఉద్యోగావకాశాలను కాపాడటానికి డొనాల్డ్‌ ట్రంప్‌ 12 దేశాల ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్షిప్‌ ఒప్పందం నుంచి బయటకు రావాలనుకుంటున్నప్పుడు, దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆహార భద్రతను రక్షించుకోవాల్సిన అవసరం భారత్‌కు ఉంది. ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నామంటే నిరుద్యోగాన్ని కొనితెచ్చుకోవడమే.

ప్రపంచీకరణకు వ్యతిరేక వాతావరణం పుంజుకుంటూ, స్వీయ సంరక్షణతత్వం పెరుగుతున్న వాతావరణంలో ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో వాణిజ్యరంగంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి క్షీణిం చింది. ఇలాంటి నేపథ్యంలో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని 16 దేశాల మధ్య కుదిరిన భారీ వాణిజ్య ఒడంబడిక ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక (ఆర్‌సీఈపీ)లో భారత్‌ చేరుతుండటమనేది రిస్క్‌తో కూడుకున్న సాహసమేనని చెప్పాలి. పైగా దేశీయ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం గుండా పయనిస్తున్నప్పుడు, వస్తూత్పత్తి రంగం నిత్యం దిగజారిపోతున్న సమయంలో భారత్‌ పయనం వాంఛనీయం కాదనే చెప్పాలి.

నవంబర్‌ మధ్యలో సింగపూర్‌లో జరిగిన తాజా సంప్రదింపుల్లో ఈ సంవత్సరం చివరినాటికి కూటమి దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనను వదిలివేశారు. 2019 చివరి నాటికి అంతిమ అవగాహనకు వద్దామంటూ కొత్త లక్ష్యం విధించుకున్నారు. ఎందుకంటే భారత్, థాయ్‌లాండ్, ఇండోనేషియాలు వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి ముందుగా రిస్క్‌ తీసుకోవడానికి ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కటీ సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఈ విషయమై భారతీయ దౌత్యప్రతినిధి అభిప్రాయాన్ని న్యూస్‌ ఏజెన్సీ నిక్కీ వెల్లడించింది.

’’పన్నులు తగ్గించడంపై ఆర్‌సీఈపీ ప్రాథమిక ఒప్పందాన్ని ప్రకటించిన మరుక్షణం న్యూఢిల్లీలో కేంద్రప్రభుత్వం కుప్పకూలడం ఖాయం’’వాణిజ్యాన్ని మరింత సరళీకరించాలని భావిస్తూ, 10 ఆసియా దేశాలు వాటి భాగస్వామ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇండియా మధ్య కుదిరిన భారీ వాణిజ్య ఒప్పందమే ఆర్‌సీఈపీ (ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక). ఈ ఒప్పందం అమల్లోకి రాగానే ఈ వాణిజ్యమండలి ప్రపంచ జనాభాలో 45 శాతానికి, ప్రపంచ జీజడీపీలో 25 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ప్రపంచ వాణిజ్యంలో దీని వాటా 40 శాతం అన్నమాట. ఈ ఒడంబడిక గత ఆరేళ్లుగా చర్చలు సాగిస్తూ సరకులు, సేవలు, మదుపు అనే మూడు కీలకాంశాలపై దృష్టి సారించింది. ఒప్పందంపై సంతకాలు చేశాక ఆర్‌సీఈపీ ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య మండలిగా అవతరించనుంది.

దిగుమతి సుంకాల భారీ తగ్గింపు విధ్వంసకరమే!
ఆర్‌సీఈపీ దేశాలతో భారత వాణిజ్యలోటు 100 బిలియన్‌ డాలర్లను అధిగమించింది. అంటే భారతీయ మొత్తం వాణిజ్య లోటులో ఇది 64 శాతం అన్నమాట. అందుకే ఈ భారీ వాణిజ్య లోటు అంతరాన్ని రాబోయే సంవత్సరాల్లో పూడ్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. అయితే చైనా, కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలతో భారత్‌కు భారీస్థాయిలో వాణిజ్య లోటు ఉండటమే కాకుండా, దిగుమతి సుంకాలను జీరోకి తొలగించి అతిపెద్ద దేశీయ మార్కెట్‌ తలుపులు తెరిచేస్తే పరస్పర వాణిజ్యం జరగాల్సిన సరకుల స్థానంలో చౌక ధరలతో కూడిన దిగుమతులు దేశంలోకి వెల్లువెత్తుతాయి. ఇప్పటికే ఈ విషయంలో పలు శాఖల కేంద్రమంత్రులు ప్రమాద హెచ్చరికలు చేసేశారు. ఇక ఉక్కు, లోహాలు, ఫార్మాసూటికల్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, పాలపరిశ్రమ వంటి దేశీయ పరిశ్రమలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక కార్యచట్రం పరస్పర వాణిజ్యం జరగాల్సిన 92 శాతం సరకులపై జీరో శాతం సుంకాలను విధిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో మరొక 5 శాతం దీనికి తోడవుతుంది. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న ఆసియన్‌ దేశాలు, జపాన్‌ ఈ విషయంలో బలంగా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. శాశ్వత భాగస్వామ్యం లేని మూడు ప్రముఖ దేశాలు కూడా 80 శాతం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పూర్తిగా తొలగించాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే అందుతున్న నివేదికల ప్రకారం భారత్‌ 72 నుంచి 74 శాతం సరకులపై చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ దేశాలకు దిగుమతి సుంకాలను తొలగించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సుంకాలను తొలగించడానికి 20 సంవత్సరాల సమయం కావాలని భారత్‌ కోరుకుంటోంది. కానీ చైనా మాత్రం సుంకాలను పూర్తిగా తొలగించడానికి తనకు మరింత సమయం కావాలని కోరుతోంది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

ఈ గోప్యత ఎవరి ప్రయోజనాల కోసం?
గత కొన్ని దశాబ్దాల్లో, ప్రత్యేకించి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ సబ్సిడీలను బాగా తగ్గించాలని, మార్కెట్‌కు మరింతగా అవకాశం కల్పించాలని సంపన్న దేశాలు ప్రయత్నిస్తూ వచ్చాయి. ఈ విషయమై ప్రపంచ వాణిజ్య సంస్థ చేసిన ప్రారంభ ప్రయత్నాలను తదనంతరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, పలు ద్వైపాక్షిక ఒప్పందాలు మరింత దూకుడుగా ముందుకు నెట్టాయి. దిగుమతి సుంకాలను తగ్గించిన తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలావరకు ఆహార దిగుమతి దేశాలుగా దిగజారిపోయిన వైనాన్ని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో లక్షలాది వ్యవసాయ కుటుం బాలు ధ్వంసమైపోయాయి. భారతీయ ఆహార భద్రతపై ప్రతిపాదిత ఆర్‌సీఈపీ ఒడంబడిక ప్రభావాల గురించి అంతగా అధ్యయనం చేసినట్లు లేదు. పైగా ఈ ట్రీటీలో భాగంగా జరుగుతున్న సంప్రదింపులు అత్యంత రహస్యాన్ని పాటిస్తుండటంతో జరగబోయే పరిణామాలు కలవరం కలిగిస్తున్నాయి. పైగా పరిశ్రమలు, ఎన్జీవోలలో ఏ ఒక్కరికీ ఈ చర్చల్లో భాగస్వామ్యం కల్పించలేదు.

ఆర్సీఈపీ సంప్రదింపులు ప్రారంభమైన ఆరేళ్ల తర్వాత ప్రతిపాదిత ఒప్పందం వలన ఏర్పడే లాభనష్టాలపై అధ్యయనం ప్రారంభించడం విచిత్రంగా లేదూ? న్యూఢిల్లీలోని ప్రాంతీయ అధ్యయన కేంద్రం, బెంగళూర్‌ లోని ఐఐఎంలను ఈ అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం చాలా ఆలస్యంగా కోరింది. ఇదిలావుంటే, స్టీల్, ఫార్మా రంగాలకు చెందిన ప్రతినిధులు, పలువురు నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్సీఈపీ ఒప్పందం వలన పాల ఉత్పత్తులపై ఆధారపడిన 15కోట్లమంది తీవ్రంగా నష్టపోతారని అముల్‌ డైరీ కోపరేటివ్‌ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ జయన్‌ మెహతా చెబుతున్నారు.

దీనివల్ల ఇబ్బందులేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ఏడాది 176 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని దాటితే భారత దేశం ప్రపంచంలోనే పెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలుస్తుంది. ప్రస్తుతం, 40 నుంచి 60 శాతం సుంకంతో పాలు, పాల ఉత్పత్తుల దిగుమతిని అనుమతిస్తున్నారు. దీంతో స్థానిక డైరీలో తమ స్థాయిలో పోటీపడటానికి ఇది దోహదపడుతోంది. అమెరికా, యూరప్‌ డైరీ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నుంచి చౌకపాలకు భారత్‌ గేట్లు బార్లా తెరిచింది. ఆస్ట్రేలియా లోని 6,300మంది పాలఉత్పత్తిదార్లు, న్యూజిలాండ్‌ లోని 12వేలమంది పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా స్పందించి చిన్నదైన తమ పాల ఉత్పత్తి వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే, భారత్‌ మాత్రం తమ పాల ఉత్పత్తిని తగ్గించుకోడానికి సిద్ధపడిందని మనం మరిచిపోకూడదు.

ఆహార ఉత్పత్తులలో భారత్‌ కోలుకోలేని దెబ్బ
అదే సమయంలో దిగుమతి సుంకాలు తగ్గించడంతో దేశంలోకి వంట నూనెలు విపరీతంగా వచ్చిపడ్డాయి. భారత్‌ను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దిగుమతిదారుగా నిలబెట్టాయి. గత మూడేళ్లుగా పప్పుధాన్యాలపై దిగుమతి సుంకం కూడా లేకపోవడంతో పాల ఉత్పత్తిదారుల ధరలు స్వల్పంగా పడిపోయాయి. ఎన్నో ఏళ్లుగా భారత్‌ దిగుమతి సుంకం తగ్గించాలని కోరుతున్న ఆస్ట్రేలియా నుంచి గోధుమలు దిగుమతి చేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. పబ్లిక్‌ వాటాదారులకు కనీస మద్దతుధర చెల్లించాలన్న ప్రపంచ వాణిజ్య కేంద్రం ఒత్తిడితో ఆహార ఉత్పత్తుల విషయంలో భారత్‌ కోలుకోలేని దెబ్బతింది.

వ్యవసాయదారుల జీవితాలు రోడ్డున పడ్డాయి. 
ఆహార ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు, పళ్లు, కాయగూరలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ దిగుమతులు వరదలా వచ్చిపడటంతో ఇప్పటికే కునారిల్లుతున్న భారత వ్యవసాయ రంగం మరింత అధ్వాన్నంగా మారింది. మరోవైపు సభ్య దేశాలు ఇప్పటికే విస్తృతమైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. తమ దేశం నుంచి బాదంపప్పును ఎగుమతి చేయడం ద్వారా గత దశాబ్దంలో ఐదింతలు లాభం చేకూరిందని గతవారం ఢిల్లీ వచ్చిన ఆస్ట్రేలియా వాణిజ్యమంత్రి సిమాన్‌ బిర్మింగ్హమ్‌ చెప్పారు.

కాబట్టి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక (ఆర్‌సీఈపీ)లో మనం ఎందుకు చేరాలి? చివరికి అమెరికాలో ఉద్యోగావకాశాలను కాపాడటానికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 12దేశాల ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్షిప్‌ ఒప్పందం నుంచి బయటకు రావాలనుకుంటున్నప్పుడు, దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆహార భద్రతను రక్షించుకోవాల్సిన అవసరం భారత్‌కు కూడా ఉంది. ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నామంటే నిరుద్యోగాన్ని కొనితెచ్చుకోవడమేనని మనం మరిచిపోకూడదు. బహుముఖమైన వ్యవసాయరంగమే నిరుద్యోగం లేని దేశప్రగతికి దోహదం చేస్తుంది.

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

మరిన్ని వార్తలు