ప్రకృతి అనే భూతం

20 Dec, 2018 00:32 IST|Sakshi

జీవన కాలమ్‌ 

ప్రకృతి మనల్ని అక్కున చేర్చుకుని ఆశీర్వదించే కన్నతల్లి. అందుకే ఆ శక్తిని– అర్థం చేసుకోనవసరంలేని సామాన్య ప్రజానీకం ‘దేవత’ అన్నారు. ప్రకృతి సామరస్యం దెబ్బతినకుండా నిరంతరం మన జీవనవిధానాన్ని పూర్వులు నియంత్రించారు. కూల్చిన చెట్టుకి ప్రత్యామ్నాయం ఉండాలి. ఎందుకు కూలుస్తున్నామో, దానికి మారుగా ఏంచేస్తున్నామో చెప్పాలి. దీనికి కర్మకాండ ఉంది. ఉద్దేశం– ప్రకృతిని కదిలించే ఏ పనయినా తెలిసి చేయాలి. కానీ మనం తెలివయినవాళ్లం. ప్రకృతి దేవత ఏమిటి– పిచ్చి వాగుడు కాకపోతే! ఏ ప్రకృతి శక్తినయినా యథేచ్ఛగా, నిరాటంకంగా, నిర్భయంగా వాడుకోగలిగే పద్ధతుల్నీ, ఆలోచనలనీ పెంపొందించుకున్నాం. ఫలితం?

నేను మా అబ్బాయి, మనుమరాళ్లతో– 2013లో ఈ భూగ్రహం కొనవరకూ ప్రయాణం చేశాను. నార్వేలో ట్రోమ్సో అనే ఊరు. ఆ తర్వాత భూమిలేదు. అక్కడి నుంచీ దాదాపు 2,000 మైళ్ల పైచిలుకు ఆర్కిటిక్‌ మహా సముద్రం. ఉత్తర ధృవం. పోనుపోను గడ్డకట్టిన మహా స్వరూపం. ఈ అనూహ్యమయిన మంచు భూతం కింద ఎన్నో సమాధి అయిన– మన గ్రహం వంటి భూభాగాలు, సంస్కృతులూ ఉండి ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నట్లు మొన్న పత్రికల్లో వచ్చింది.

ఇప్పుడు అసలు కథ. 2018లో మానవుడి దురాశ, దురాక్రమణ, నాగరిక వైపరీత్యాల కారణంగా రికార్డు స్థాయిలో భూమి ఉష్ణోగ్రత పెరిగిం దట. పెరిగే అతి చిన్న ఉష్ణోగ్రతకే మన ఆరోగ్యం, ఆహారం, తాగే నీటి వనరులూ దెబ్బతింటాయి. ఈ శతాబ్దపు చివరికి– ఈ లెక్కన 3.5 శాతం ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడేమవుతుంది? చాలా జంతు సంతతి నాశనమవుతుంది. వృక్ష సంపద నశిస్తుంది. సముద్రాల్ని శుభ్రపరిచే నాచు వంటి ‘పెరుగుదలలు’(రీఫ్‌) పోతాయి. ధృవాలలో నీటిమట్టం కరిగి –సముద్రాల నీటి మట్టం పెరిగి–విశాఖపట్నం, భువనేశ్వర్, చెన్నై, కొచ్చి, నాగపట్టణం వంటి ప్రాంతాలలో భూమట్టం బాగా తరిగిపోతుంది. చాలా స్థలాలు మునిగిపోతాయి.

వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదలవల్ల భూమి ఆర్చుకుపోతోంది. చెమ్మతో సమతలంగా ఉండే నేల ఒకప్పుడు వర్షం పడగానే– నీటిని చెరువులకూ, నదులకూ పారించేది. కానీ భూమికే నీటి చెమ్మ అవసరం ఏర్పడింది కదా? 160 దేశాలలో పరిశోధన జరిపిన ఆస్ట్రేలియా న్యూ సౌత్‌ వేల్స్‌ శాస్త్రజ్ఞులు దీనికి రంగుల అన్వయాన్ని ఇచ్చారు. భూమి మీద 100 వర్షపు చుక్కలు పడ్డాయనుకోండి. ప్రస్తుతం 36 చుక్కలే వనర్లకు చేరుతున్నాయి. దీన్ని ‘బ్లూ వాటర్‌’ అన్నారు. మిగతా 64 చుక్కల్ని భూమి ఆర్చుకుపోయిన తన భూభాగాన్ని నింపుకుం టోంది. దీన్ని ‘గ్రీన్‌ వాటర్‌’ అన్నారు.

ఇది ఒక పార్శ్వం. గత 22 సంవత్సరాలలో సముద్రమట్టం సాలీనా 3.2 మిల్లీమీటర్లు పెరుగుతోంది. న్యాయంగా ఏ 80 సంవత్సరాలకో పెరగవలసిన మట్టమిది. ఒక్క కొచ్చీలోనే మిగతా సముద్ర తీరపు పట్టణాలలో కంటే నీటిమట్టం భయంకరంగా చాపకింద నీరులాగ పెరుగుతోందట.

డచ్‌ దేశంలో ఒక సామెత ఉంది. ‘ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించి ఉండవచ్చు. కానీ డచ్‌ వారు జీలెండుని నిర్మించారు’ అని. గత వెయ్యి సంవత్సరాలలో డచ్‌ వారు ‘జీలాండ్‌’ అనే ప్రాంతాన్ని సముద్ర జలాలను తప్పించి నిర్మించారు. ఆ పని జపాన్‌ చేస్తోంది. వేల ఎకరాల స్థలాన్ని సముద్ర ప్రాంతాల నుంచి– నీటిని తప్పించి సాధించింది. విచిత్రం ఏమిటంటే సముద్రాన్నించి భూభాగాన్ని సంపాదించే ఆధునిక విజ్ఞానం ఒక పక్క పురోగమిస్తుం డగా– భూమిని కబళించే సముద్ర ఉష్ణోగ్రతలను పెంచే అనర్థం మరోపక్క జరుగుతోంది.

ఈ భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కాలగమనంలో లక్ష ద్వీపాలు, మాల్దీవ్‌లు, బంగ్లాదేశ్‌లో అధిక భాగం సముద్ర గర్భంలో ఉంటాయట.

జవహర్‌లాల్‌ నెహ్రూ వర్సిటీలో ప్రకృతి విపత్తు పరిశీలనకు ఏర్పాటైన కేంద్ర ప్రొఫెసరు డాక్టర్‌ అమితాసింగ్‌ ఒకమాట అన్నారు. నేడు నానాటికీ పెరుగుతున్న జంతు సంహారానికి కబేళాలు వాతావరణంలో విష వాయువుల వ్యాప్తికి కారణమవుతున్నాయట. శాకాహారంతో కనీసం ప్రకృతిలో నాలుగో భాగాన్ని పరిరక్షించవచ్చు. అయితే ఈ ఒక్క మాట చాలు సమాజంలో పెద్ద అల్లర్లు లేవడానికి. ఇప్పుడు గోసంరక్షణ కథలు వింటున్నాం కదా?

ఏమయినా మానవుడు తెలివైనవాడు. తాను దిగవలసిన గోతిని తానే తెలిసి తెలిసి తవ్వుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చే ప్రళయం నుంచి రక్షించడానికి అలనాడు వచ్చిన నోవా నావ ఉండదు. కారణం– ఇది స్వయంకృతం. మానవుడి పేరాశ, రక్తపాతంతో అతను స్వయంగా తెచ్చిపెట్టుకున్న విపత్తు. ఇది నా మాట కాదు. డాక్టర్‌ అమిత్‌ సింగ్‌ తీర్పు.

కాలగమనాన్ని రుతువులతో పలకరిస్తూ, తరతరాలుగా మానవ కల్యాణానికి మన్నికయిన గొడుగును పట్టిన ప్రకృతి శక్తిని గుర్తించిన వారికి ఆనాడు – తల్లి. ఇప్పుడు నిశ్శబ్దంగా మీద పడి కబళించనున్న పెనుభూతం.

గొల్లపూడి మారుతీరావు
 

మరిన్ని వార్తలు