ఉభయకుశలోపరి

14 Feb, 2019 01:43 IST|Sakshi

జీవన కాలమ్‌

1937లో ఆనాటి ‘నేష నల్‌ హెరాల్డ్‌’ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం ఆనాటి అతి ప్రముఖ కాంగ్రెసు నాయకులు జవహర్‌ లాల్‌ నెహ్రూని దుయ్య బడుతూ– ఆయన ‘అహంకారాన్ని’ విరగ దీస్తూ రాసినది. పార్టీలో, బయటా ఆ వ్యాసం పెద్ద సంచలనాన్ని లేపింది. అందరూ ఆ వ్యాసాన్ని నెహ్రూ సిద్ధాంతాలను వ్యతిరేకించే పట్టాభి సీతారామయ్య రాశారనుకున్నారు. కొంత కాలం తర్వాత నెహ్రూగారే నిజం చెప్పారు. ‘నేషనల్‌ హెరాల్డ్‌’ నెహ్రూ సొంత పత్రిక. తన పత్రికలో తననే ‘కలం పేరు’తో విమర్శించుకు న్నారు. ఆ తరంలో అంత intellectual hone- sty and moral integrity ఉన్న నాయకులు లేరు. నెహ్రూగారి గొప్ప లక్షణాలు తనని చూసి తాను నవ్వుకోవడం, తనని తాను సంస్కరించు కోవడం, తన తప్పిదాన్ని భేషరతుగా ఒప్పుకో వడం. ఇక్కడే మరొక్క మాట చెప్పాలి. ఈ దేశంలో తమని తామే సంస్కరించుకునే సమస్థితి ఉన్న నాయకులు ఎందరో ఉన్నారు. మూడే పేర్లను ఉటంకిస్తాను. నెహ్రూ, గాంధీ, పటేల్‌. ఈ దేశపు సామాజిక వ్యవస్థకి గొప్ప కితాబు– ఒక నాయకురాలు వేసిన తప్పటడుగుని– ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ కల్లోలాన్ని తట్టుకుని వ్యవస్థ సవరించుకుంది. ప్రస్తుతం దేశపు న్యాయ వ్యవస్థలో ఆ అపశృతి వినిపిస్తోంది. ఏనాడయినా తమ వ్యవస్థ లొసుగుల నుంచి సంస్కరణలు జరగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రజల ముందుకు రావడం విన్నామా? ఈ వ్యవస్థ ఆ ‘అపశృతి’నీ సవరించు కుంటుంది.

ఇప్పటి కథ. ఈనాడు నెహ్రూకి నాలుగో తరం కుర్రవాడు– రాహుల్‌ గాంధీ. ప్రతిపక్ష నాయకుడు. ప్రజాస్వామిక వ్యవస్థలో అన్ని పార్టీల ముఖ్య లక్ష్యం ప్రజా సంక్షేమం. ఇందులో నిజానికి ప్రతిపక్షానిది ముఖ్య పాత్ర– అధికారం, అవకాశం ఉన్న పాలక పక్షాన్ని ‘సంస్కరించాలి’ కనుక. తిట్టే నోరు సంస్కరించదు. ఆ వ్యవస్థని తిరగబడేటట్టు చేస్తుందే తప్ప, ఆత్మావలోకనం చేసుకునే అవకాశం ఇవ్వదు. ఇది ప్రజాస్వామ్యా నికి ‘సేవ’ మీద కాక, పదవి మీద, కుర్చీమీద వ్యామోహం పెంచిన అరిష్టం. అందుకే మన పార్ల మెంటులో ఎందరో గూండాలు, రేపిస్టులూ, అవ కాశవాదులు, దుర్వా్యపారులూ చేరారు.

నరేంద్ర మోదీని ఈయన బహిరంగ సభలో ‘దొంగ’ అన్నాడు. ‘చౌకీదార్‌’ అన్నాడు. డోక్లా వ్యవహారంలో మోదీ ఛాతీ 56 అంగుళాల నుంచి నాలుగంగుళాలకు కుంచుకు పోయిందన్నాడు. ఆయన పిరికివాడన్నాడు. పార్లమెంటు నుంచి తప్పించుకు తిరిగే ‘పలాయనవాది’ అన్నారు. దమ్ముంటే నా ముందు 5 నిముషాలు నిలవమని చాలెంజ్‌ చేశారు. ఈ దేశానికి భాక్రానంగల్, నాగార్జున సాగర్, అంతరిక్ష పురోగతికీ పునా దులు వేసిన స్వాప్నికుడు– ఈ కుర్రాడి నాలుగో తరం ముత్తాత ఎక్కడ? ఈ కుర్రాడు ఎక్కడ? ఆనాటి పార్లమెంటులో జయప్రకాష్‌ నారాయణ, కృపలానీ, బెవాన్‌ వంటి నాయకులు ఒక్కసార యినా ప్రధాని మీద మాట తూలలేదు. ఇటు–నరేంద్ర మోదీ విమర్శ–రెండు సందర్భా లను ఉటంకిస్తాను. పార్లమెంటులో ఆయన మాట్లాడుతుండగా రేణుకా చౌదరి హాలు దద్దరిల్లే లాగా నవ్వింది. వెంకయ్యనాయుడు లేచి ‘అది మర్యాద కాదు’ అన్నారు. మోదీ నవ్వి ‘ఫర్వా లేదు నాయుడూజీ. చాలా కాలానికి రామాయ ణంలో వికటాట్టహాసం ఇన్నాళ్లకి విన్నాను’ అన్నారు. శూర్పణఖ పేరెత్తలేదు. కానీ అందరి మనస్సుల్లోనూ ఆ పేరు కదిలింది. ఇది మహిళ లకి అన్యాయమని రేణుక తర్వాత గింజుకున్నారు.

మరోసారి– మన్మోహన్‌ సింగ్‌ పదవిలో చేత కానితనాన్ని విమర్శిస్తూ– వారి పాలనలో 2జీ, కామన్వెల్త్, బొగ్గు, గడ్డి వంటి 42 స్కాములు తోసుకురాగా మన్మోహన్‌ సింగ్‌ స్నానాల గదిలో రెయిన్‌ కోటు వేసుకుని నీళ్లు పోసుకున్నట్టు ప్రవ ర్తించారు– అన్నారు. తెలుగులో ఒక ముతక సామెత ఉంది. ‘దున్నపోతుమీద వర్షం కురిసి నట్టు’ అని. ఏమయినా ఆ ఆలోచనకి సున్నిత మైన ‘ఔచిత్యపు పూత పూసి’ ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర వేత్త, తనకంటే వయస్సులో పెద్ద, ఒక దేశాన్ని 10 సంవత్సరాలు పాలించిన సీనియర్‌ నాయ కుని మీద విమర్శ ఎంత ఉదా త్తంగా, ఔచిత్యం చెడకుండా ఉంది?

విమర్శ– ఎదుటి వ్యక్తిని సంస్కరించాలి. తన ఉద్దేశానికి ‘పదును’ని ఇవ్వాలి. దురుద్దేశంతో ‘ఎదురుదెబ్బ’ తీయాలని పురికొల్పకూడదు. ఎంత కిందకి దిగి దుయ్యబట్టినా ప్రజలు ‘దొంగ’, ‘దగాకోరు’ అనే విమర్శని గుర్తుంచుకోరు. అతని desperationని గుర్తుంచుకుంటారు. మోదీ సర ళమైన, సరసమైన హాస్యం– తగలవలసిన చోట గుచ్చుకుంటూనే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కితకి తలు పెడుతూంటుంది. మన ప్రజాస్వామిక వ్యవ స్థలో– రాజకీయ రంగంలో ఔచిత్యానికి పెద్ద పీట వేసి– వ్యవస్థలో ఉదాత్తతని నేలమట్టం చేయని ఎందరో పదవిలో ఉన్న, ప్రత్యర్థులుగా ఉన్న నాయకుల ఒరవడి ఇది.

-గొల్లపూడి మారుతీరావు 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు