అడుగడుగునా అడ్డంకుల్లో బ్రెగ్జిట్‌

12 Sep, 2019 01:29 IST|Sakshi

సందర్భం

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ఏ క్షణంలో బ్రిటన్‌ వైదొలగాలని నిర్ణయించుకుందో అప్పటినుంచి ఆ నిర్ణయానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దాని దెబ్బకు ఒక ప్రధాని ఇప్పటికే పదవి నుంచి దిగిపోగా ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఈ సమస్యను పరిష్కరించలేక బ్రిటన్‌ చరిత్రలోనే అత్యంత స్వల్పకాలంలో ప్రధాని పదవిలో ఉన్న బలహీనుడిగా చరిత్రకెక్కనున్నారని సంకేతాలు వెలువడుతున్నాయి. ఎలాంటి ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగడంపై జాన్సన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ఈ మంగళవారమే అడ్డుకట్టవేసింది.  

ప్రతినిధుల సభలో చుక్కెదురు కావడంతో జాన్సన్‌ మెజారిటీ కోల్పోయినప్పటికీ అధికారంలో ఉంటున్న వ్యక్తిగా మిగిలిపోయారు. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ పార్లమెంట్‌ యాక్ట్‌ను పక్కనపెట్టడానికి పార్లమెంటు అనుమతి తీసుకుని, అక్టోబర్‌ 15లోగా బ్రిటన్‌లో ఎన్నికలు జరిపించాలని జాన్సన్‌ ప్రయత్నించారు. దానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. కానీ ప్రభుత్వ గెలుపునకు 133 ఓట్లు తక్కువయ్యాయి. బ్రెగ్జిట్‌ నుంచి తప్పుకోవడానికి అక్టోబర్‌ 31ని తుది గడువుగా నిర్దేశించారు. ఈలోగా బ్రిటన్‌లో ఎన్నికలు జరపకుండా చేయాలని లేబర్‌ పార్టీ, స్కాటిష్‌ నేషనలిస్టులు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేశారు. 

జాన్సన్‌ మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో ప్రతిపక్షాల కలయికతో తాను బ్రిటన్‌ ప్రధాని కావాలని లేబర్‌ పార్టీ నేత జెరెమి కోర్బిన్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఎవరూ అండగా నిలబడటం లేదు. అక్టోబర్‌ 31లోగా బ్రిటన్‌లో ఎన్నికలు జరపడానికి ప్రతిపక్ష లేబర్‌ పార్టీతో పాటు స్కాటిష్‌ నేషనలిస్టులు, లిబరల్స్‌ వంటి ఇతర చిన్నా చితకా పార్టీలు కూడా తమ ఆమోదం తెలుపటం లేదు. అక్టోబర్‌ 31లోగా యూరోపియన్‌ యూని యన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగేలా చేయాలన్న తన నిర్ణయం కూడా అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. పైగా, ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగడానికి పెట్టిన అక్టోబర్‌ 31 గడువు ముగిశాక పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే బ్రెగ్జిట్‌పై తాను చేసిన ప్రతిజ్ఞ విషయంలో విఫలమయ్యాడనే కారణంతో బ్రిటన్‌ ఓటర్ల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

జాన్సన్‌ స్వచర్మ సంరక్షణకోసం రెండు ఎత్తులు వేయవచ్చు. అక్టోబర్‌ 31లోగా బ్రిటన్‌ ఈయూని వదిలి వెళ్లడానికి నేరుగా బ్రస్సెల్స్‌ తోనే కొత్తగా ఒప్పందానికి ప్రయత్నించవచ్చు. తనకున్న ఆకర్షణ శక్తితో దీన్ని సాధిస్తానని ఆయన చెబుతున్నప్పటికీ తనపై పెద్దగా నమ్మకాల్లేవు. బ్రిటన్‌ ప్రధానిపై ఈయూకి కూడా నమ్మ కం లేకుండా పోవడం గమనార్హం. ఇక రెండోది ఏమిటంటే, బ్రిటన్‌ పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని పక్కనబెట్టి ఈయూతో ఎలాంటి ఒప్పం దమూ లేకుండానే బ్రెగ్జిట్‌ నుంచి బయటపడటం. ఇది శాసనోల్ఘంఘనే అవుతుంది. పైగా ఈయూనుంచి వైదొలిగేందుకు ఎలాంటి శాసనపరమైన అనుమతుల జోలికి తాను వెళ్లనని, ఈ విషయంలో ఆలస్యాన్ని తాను ఏమాత్రం కోరుకోవడం లేదని జాన్సన్‌ తేల్చి చెప్పారు కూడా. 

మూడో అవకాశం కూడా ఉంది. బ్రెగ్జిట్‌ నుంచి వైదొలగడాన్ని వాయిదా వేయాలని, గడువును మరింతగా విస్తరించాలని ఈయూను కోరడానికి బదులుగా జాన్సన్‌ తన ప్రధానపదవికి రాజీనామా చేయడం. ఇది వ్యక్తిగతంగా తన ప్రతిష్టను పెంచుతుందేమో కానీ రాజకీయ భవి ష్యత్తు ముగిసిపోతుంది. పైగా బ్రెగ్జిట్‌ గడువును పెంచాలంటున్న ప్రతిపక్షంతో కలిసి తనకు వ్యతి రేకంగా ఓటేసిన 21 మంది టోరీ ఎంపీలపై జాన్సన్‌ కఠిన చర్యతీసుకున్నారు. వీరిలో విన్‌స్టన్‌ చర్చిల్‌ మనవడు నికోలస్‌ సోమ్స్‌ కూడా ఉన్నారు. మరోవైపున నూరుమందికిపైగా కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు ఈ బహిష్కరణ వేటును తీవ్రంగా అభిశంసిస్తూ ఉత్తరం రాశారు. 

ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం బ్రిటన్‌ రాజకీయాలకు సంబంధించి గడ్డుదినంగా మారనుంది. అసాధారణ ఘటనల కారణంగా రాజ కీయ పరిస్థితి ఆకస్మిక మార్పులకు గురికావచ్చు. జాన్సన్‌ ఆశ మొత్తంగా ఇదేమరి. కానీ అలా జరగకపోతే, బ్రేకులు పనిచేయని కారు స్లోమోషన్‌లో గోడకు గుద్దుకున్న పరిస్థితిలో జాన్సన్‌ ఇరుక్కుపోవచ్చు కూడా.


వ్యాసకర్త: కరణ్‌ థాపర్‌, సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా