నైతిక సందిగ్ధతల అంతస్సంఘర్షణ

17 Oct, 2023 04:39 IST|Sakshi
‘మహారాణి’ వెబ్‌ సిరీస్‌లో హ్యూమా ఖురేషీ: ప్రతీకాత్మక చిత్రం

కామెంట్‌

సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మనం నమ్మిన సిద్ధాంతాలు, మనం పాటించే విలువలు, మనం అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం కూడా గౌరవనీయమే’’ అనే వాదన రాజకీయాలలో ఉంది. ఒక శక్తిమంతమైన నిర్ణయం తీసుకోడానికి ప్రధాని తన కార్యాలయానికి ఉన్న అపారమైన అధికారాలను ఎలాంటి నైతికపరమైన సంకోచాలూ లేకుండా ఉపయోగించడం ఆత్మ సమ్మతం అవుతుందా? కాలమిస్ట్‌ ఆకార్‌ పటేల్‌ తొలి నవల ‘ఆఫ్టర్‌ మెస్సయ’... గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా... రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రాప్తించడంలోని వైరుద్ధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. 


నిజం చెప్పొద్దూ... తనొక నవల రాశానని ఆకార్‌ పటేల్‌ నాతో అన్నప్పుడు నేను ఆశ్చర్యచకితుణ్ణే అయ్యాను. పటేల్‌ను ఒక దృష్టికోణం గల పత్రికా రచయితగా, మోదీ ప్రభుత్వాన్ని తూర్పార పట్టే ఒక గట్టి రాజకీయ వ్యాసకర్తగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు ధీశాలి అయిన ఛైర్మన్‌గానే నేను ఎరుగుదును. అంతే తప్ప, కాల్పనికత అయన అజ్ఞాత బలం అయి ఉంటుందని నేను ఏ కోశానా అనుకోలేదు. 

ఇంతేనా నాకు పటేల్‌ గురించి తెలిసింది! కథనానికి లోతైన నైతిక కోణాన్ని అందించే అంతస్సంఘర్షణతో పాత్రలను సృష్టించగల సామర్థ్యంతో పాటుగా ఆయన ఊహాశక్తిలోని ప్రతిభను, కదలనివ్వని కథన పటిమను ఆయన తాజా రచన ‘ఆఫ్టర్‌ మెస్సయ’ బహిర్గతం చేస్తోంది. గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా ఈ పుస్తకం రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రా ప్తించడంలోని వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. 

ఈ నవలొక వాస్తవ ఘటనల అల్లికగా ప్రారంభం అవుతుంది. నిజమైన వ్యక్తులు ఉంటారు. అయితే వారికి పెట్టుడు పేర్లు ఉంటాయి. ప్రధాన మంత్రిని ‘ది బిగ్‌ మ్యాన్‌’ అంటారు పటేల్‌. పుస్తకంలో ఎక్కడా ప్రధాని పేరు కనిపించదు. కానీ ఆ బిగ్‌ మ్యాన్‌ మాట్లాడే టప్పుడు ‘‘ప్రజాస్వామ్యం యొక్క భాష, చిహ్నాలు... పాలకుడు తన గురించి తను మూడో వ్యక్తిగా వ్యక్తం చేసుకుంటున్న ప్రస్తావనలతో కలిసి ఉంటాయి.’’ అది మొదటి గుర్తు. 

ఆ బిగ్‌ మ్యాన్‌ ప్రారంభోత్సవాలను కూడా ఇష్టపడతారు కనుక, ‘‘బిగ్‌ మ్యాన్‌ అధ్యక్షత వహించేందుకు వీలైనంతగా అత్యుత్తమమైన ఒక కార్యక్రమాన్ని లేదా వేడుకను అందించడంపై మంత్రిత్వశాఖలు దృష్టి పెడతాయి.’’ అది రెండవ గుర్తు. ఇక మూడోది... ‘‘రాజకీయ వ్యతిరేకత. అదేదో అంతర్గత శత్రువైనట్లుగా దానిపై హింసాత్మక దాడులు జరుగుతుంటాయి. ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఆ శత్రువును చావనివ్వని, బతకనివ్వని వాస్తవ రాజకీయా లకు అతీతమైన ఒక నిరంతర స్థితిలో ఉంచడంలో పూర్తిగా నిమగ్నం అయి ఉంటాయి’’. ఇప్పుడీ పుస్తకంలోని అబ్బుర  పరుస్తూ చదివించే సంతోష దాయకమైన సృజనాత్మక ముగింపు గురించి తప్ప మరింకేదీ బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. బదులుగా ఇందులో పటేల్‌ కథనానికి పునాదిగా జరిగిన శక్తిమంతమైన రాజకీయ... నిజానికి నైతికపరమైన చర్చ గురించి మీకు చెబుతాను. 

పటేల్‌ పుస్తకంలో బిగ్‌ మ్యాన్‌ చాలా త్వరగా చనిపోతాడు. ఆయన తర్వాత మీరా అనే మహిళ అధికారంలోకి వస్తారు. ‘లాయర్స్‌ కలెక్టివ్‌’ అనే ఎన్జీవోకు పని చేస్తుంటారు మీరా. ఆమె అవివాహిత.ఒంటరి తల్లి. ఆమె కుమార్తె జైల్లో ఉంటుంది. బిగ్‌ మ్యాన్, ఆయన పార్టీ అనుసరించిన రాజకీయ విధానాలపై మీరాకు తృణీకారభావం ఉంటుంది. అనిష్టంగానే ప్రధాని అవుతారు.

అయ్యాక మాత్రం గతంలోని క్రూరమైన చట్టాలను రద్దు చేయడం కోసం అపారమైన తన కార్యాలయ అధికారాలను ఉపయోగించు కోవాలనుకుంటారు. పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చేయబోతారు. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే ఆమె తన కార్యాలయ అపరిమిత అధికారాలను అభ్యంతరం, అనైతికం అయిన మార్గాలలో ఉపయోగించవలసి రావడం. ఇక్కడ జనించే ప్రశ్న: సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? అన్నది. 

ఆమె ముఖ్య సలహాదారు... ఆ సలహాదారుకు పేరేం ఉండదు... ‘హౌస్‌ మేనేజర్‌’ అంతే. ఆ మేనేజర్‌కు ఇది ఆమోదయోగ్యమే అనిపి స్తుంది. ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీరు పాటించే విలువలు, మీరు అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం గౌరవనీయం,ప్రశంసనీయం అయిన సంగతే’’ అంటారు హౌస్‌ మేనేజర్‌. కానీ అందువల్ల ప్రయోజనం పొందగలిగిన సగటు ప్రజలు దానిని అంగీకరించరు. మీరా వారిని సంప్రదించినప్పుడు ఒక వృద్ధురాలు... తరచు నిరాకరణకు గురవుతుండే, అదే సమయంలో సర్వకాలాలకు అమోదయోగ్యమైనదిగా ఉండే యుగాల వివేకాన్ని వ్యక్తపరుస్తుంది. ‘‘చేయవలసిన సరైనది ఒకే ఒకటి ఉంటుంది. అదే సరైనది’’ అని అంటుంది. 

ఈ విధంగా పటేల్‌ పుస్తకం ముగింపునకు చేరుకుంటున్న కొద్దీ భారత రాజకీయాల స్వభావం గురించి; ఒకవైపు ఎత్తుగడలూ వ్యూహాలకూ, మరోవైపు సిద్ధాంతాలూ నైతికతలకూ మధ్య జరుగు తుండే ఘర్షణలతో ఒక శక్తిమంతమైన కథగా అభివృద్ధి చెందుతుంది. ప్రధాని కార్యాలయానికి ఉండే అపారమైన అధికారాలను నైతిక పరమైన సంకోచాలు లేకుండా, అనుకున్న దానిని సాధించేందుకు మీరా ఏకచిత్తంతో దృష్టి సారించినందున పుస్తకంలోని ఈ భాగం కేవలం చదివించేలా మాత్రమే కాదు, ఒక వెల్లడింపుగానూ ఉంటుంది.

మీరా తనలోని సందేహాలను అణిచివేస్తారు. అయితే ఆశించిన ఫలితాన్ని సాధించడానికి ఇదే ఏకైకమార్గం అని హౌస్‌ మేనేజర్‌ తనకు నచ్చజెప్పేందుకు ఆమె అనుమతిస్తారు. అందువల్లనే ముగింపులో ఫలితం అనేది ఫలితం కోసం అనుసరించిన మార్గాలపై విజయం సాధించడం కనిపిస్తుంది. అయితే చర్చ మాత్రం ముగింపు దశకు చేరకనే ఉండిపోతుంది. అది ఆమె మనస్సాక్షిని కృంగదీస్తూ ఉంటుంది. 

నిజంగా రాజకీయాల్లో తరచు ఇలా జరుగుతుంటుందన్నది వాస్తవం. పటేల్‌ ‘బిగ్‌ మ్యాన్‌’పై ఇదేమీ ప్రభావం చూపకపోవచ్చు కానీ ఇతర రాజకీయ నాయకులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లయితే దానివల్ల నలిగిపోతుంటారు కూడా. భారతదేశంలోనే కాదు, చాలా ప్రజాస్వామ్య దేశాలలో ఇలాగే జరుగుతుంటుంది. అందుకే రాజకీయాల సారాంశం అన్నది రాజకీయపరమైన దాని కన్నా చాలా ఎక్కువైనది. ఎందుకంటే అది నిర్ణయాలకు, ఎంపికలకు, అంతిమంగా సైద్ధాంతికతల్ని మించిన అంశాలకు సైతం సంబంధించినది. అలాగే నైతికపరమైన వాటికి కూడా. పటేల్‌ ఆ సంగతిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు