నిజాయితీకి నిదర్శనాలు

27 Feb, 2018 00:47 IST|Sakshi

విశ్లేషణ
దమ్ముంటే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బదిలీ చేయాలంటూ థానే మునిసిపల్‌ కమిషనర్‌ చేసిన సవాలు నేతలకు షాక్‌ కలిగించింది. నిబంధనలకు కట్టుబడే అధికారుల ధోరణి పెరుగుతుండటం అభినందనీయం.

మహారాష్ట్రలో ఐఏఎస్‌ అధికారుల్లో బలపడుతున్న ఒక ధోరణి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరముంది. వారు నియమ నిబంధనలకు కట్టుబడటానికి ప్రయత్నిస్తూ, తమకు అప్పగించిన విధుల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నారు. జనం దృష్టికి వచ్చిన తాజా ఉదంతం ఏమిటంటే, థానె మునిసిపల్‌ కమిషనర్‌ ఇటీవలే కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో.. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, దమ్ముంటే తనను బదిలీ చేయాలంటూ సవాలు చేశారు.

ఇది తొలిసారి జరిగిన విషయం ఏమీ కాదు. కొన్ని నెలల క్రితం కూడా ఆ అధికారి తాను ముఖ్యమంత్రిని కలిసి బదిలీ చేయించుకుంటానని సర్వ సభ్య సంఘానికి తెలియజేశారు. కాని అతడి ప్రతిపాదనను అప్పట్లో అంగీకరించలేదు. ఇప్పుడు తనపై అవిశ్వాస ప్రకటన చేయాలన్న అతడి డిమాండ్‌ పట్ల కూడా రాజకీయ నేతలు కలవరపడలేదు. సంజయ్‌ జైస్వాల్‌ అనే ఆ అధికారి మరికొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఇలాంటి అదికారి విషయంలోనూ వారు నిలకడతనాన్ని పాటించలేదు. పైగా వారు అతడిని అప్రతిష్టపాలు చేయడానికి కూడా ప్రయత్నించారు.

ఎదుగుతున్న లేక ముంబైలాగా కిక్కిరిసిపోయి, జనసమ్మర్థంగా ఉంటున్న థానే నగరం రాజకీయ నేతలకు, మధ్య దళారీలకు అద్భుతమైన అవకాశాలను ఇస్తోంది. నిర్మాణ రంగం ఇక్కడ అతి పెద్ద పరిశ్రమగా మారడంతో రాజకీయ నేతలే దళారీలుగా మారుతున్నారు. నగరం ఎదుగుతున్నట్లయితే, నూతన గృహాల నిర్మాణం వేగం పుంజుకుంటుంది. నగరం ఇప్పటికే ఇరుగ్గా మారి ఉన్నట్లయితే చట్టాలను అతిక్రమించాల్సి ఉంటుంది. అనేక పెద్ద నగరాల్లో నిర్మాణరంగ వాణిజ్యంలో రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాని వాటా కలిగి ఉంటున్నారని చెబుతున్నారు.

థానేలో దాదాపు 20 లక్షల మంది జనాభాతో మహారాష్ట్రలో గుర్తించదగిన నగరంగా విస్తరిస్తోంది. కానీ ఇరుగ్గా మారుతుండటంతో నగర పాలనను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరమెంతైనా ఉంది. ఇప్పుడు సుపరిపాలన కావాలి. కానీ తమ వ్యక్తిగత అభివృద్ధి పైనే దృష్టి పెట్టిన రాజకీయనేతలు పురపాలక సంస సమర్థ నిర్వహణపై ఆసక్తి చూపడం లేదు.

తనకంటే ముందు పనిచేసిన ఐఏఎస్‌ అధికారి టి. చంద్రశేఖర్‌ లాగే జైస్వాల్‌ కూడా ప్రజానుకూల అధికారి. 2000ల మొదట్లో ఐఏఎస్‌ అధికారి టి. చంద్రశేఖర్‌ రాజ కీయ నేతల అడ్డంకులను ఎదుర్కొని థానే నగరంలో మెరుగైన మౌలిక వసతులను కల్పించారు. ప్రజాపక్షపాతిగా, నగరాభివృద్దే లక్ష్యంగా కార్యాచరణకు పూనుకున్నారు. అందుకే జైస్వాల్‌ నేతల దారిలో ముల్లు అయి కూర్చున్నారు. నగర ఆదాయ మార్గాలను పెంచారు.

వీటన్నింటితో ప్రజలు అతడి వెన్నంటే నిలిచారు. పైగా నగరంలోని స్వార్థ ప్రయోజన శక్తులను అడ్డుకుంటూ బహిరంగ ప్రకటనలు పంపిణీ చేశారు కూడా. రక్షణ కోసం పురపాలక సంస్థ ఖర్చుతో ప్రైవేట్‌ బౌన్సర్లను నియమించుకున్న ఏకైక పురపాలక సంస్థ అధినేత బహుశా ఆయనే కావచ్చు. అక్రమ నివాసాలను తొలగిస్తున్నప్పుడు లేక కూల్చివేస్తున్నప్పుడు అతడిని దూషిం చడమే కాకుండా తన డిప్యూటీపై దాడి చేశారు కూడా.

జైస్వాల్‌ ఒంటరి కాదు. నవీ ముంబై కార్పొరేషన్‌ అధిపతి తుకారాం ముండే కూడా రాజకీయ నేతలకు తలవంచని పాపానికి కొద్దికాలంలోనే బదిలీకి గురయ్యారు. పింప్రి నుంచి చించ్‌వాద్‌కు అక్కడి నుంచి నాసిక్‌కి తరచుగా తన విషయంలో జరిగిన బదిలీలను ఆయన కిమ్మనకుండా, సాహసోపేతంగా స్వీకరించారు కానీ ప్రజాస్వామ్యంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని రాజకీయ నేతలు తోసిపుచ్చరాదని ఈ ఉదంతాలు తెలుపుతున్నాయి. వ్యక్తుల కంటే సంస్థలు చాలా ముఖ్యమైనవి.

ఇకపోతే మహేష్‌ జగాడే ఉదంతాన్ని తీసుకోండి. రాజకీయ నేతలకు వంగి నమస్కారాలు పెట్టకపోవడంతో ఈ అధికారిని కూడా చాలాసార్లు బదిలీలపై పంపారు. ఆహారం, మందుల సంస్థ కమిషనర్‌ స్థాయిలో ఉన్న తనను జిల్లా స్థాయికి కుదించివేశారు. కానీ ఏ పదవిని అలంకరించినా, స్వార్థ ప్రయోజన శక్తులకు లొంగకుండా తన పని విషయంలో ఆయన రాజీలేకుండా వ్యవహరించారు.

మహారాష్ట్రలో పలువురు నిజాయితీ పరులైన అధికారులున్నారు. అవినీతిమయమైన వ్యవస్థ లొసుగులను చక్కదిద్దారు. ఉదాహరణకు దేశంలోనే అతిపెద్దదైన నగరాల్లో ఒకటైన ముంబై పురపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన డిఎమ్‌ శుక్తాంకర్, చాలాకాలం తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన ఎస్‌ఎస్‌. టినైకర్‌ ఇద్దరూ పురపాలన అనేది పౌరుడి కేంద్రకంగానే ఉండాలని రాజకీయనేతలు, కాంట్రాక్టర్లు తెలుసుకునేలా చేశారు.

చంద్రశేఖర్, జైస్వాల్, ముండే వంటివారు ఉత్తమ అధికారులుగా మహారాష్ట్ర నగర పాలనపై తమ ముద్ర వేశారు. మహారాష్ట్రకే కాదు దేశంలోని ప్రతి స్థాయిలోనూ ఇలాంటి మంచి అధికారులు తప్పక పనిచేయాలి. అధికారులు నిబంధనలకు పూర్తిగా కట్టుబడి పనిచేసే ఈ ధోరణి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నట్లుంది. మొదటిగా నగర పాలనకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే నగరాలు పౌర జీవితాల సమ్మేళనం.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
మహేశ్‌ విజాపుర్కర్‌
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు