కోహ్లి మారలేదు... | Sakshi
Sakshi News home page

అహంకారమే అలంకారమై...

Published Tue, Feb 27 2018 12:48 AM

special story to virat kohli Captaincy - Sakshi

ఒకప్పుడు వారంతా అతడిని ‘దారి తప్పిన పిల్లాడు’గా అభివర్ణించారు. ఇప్పుడు అతడిని పొగడటంలో వారంతా పోటీ పడుతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే అతను అంతగా మారిపోయాడా! లేదు... కోహ్లి తనలాగే ఉన్నాడు. ఏడాది క్రితం కోహ్లితో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డవాడు ఇప్పుడు అతడిని చూసి తాను కూడా కొత్త విషయాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. కోహ్లి ఒక్కసారిగా మంచి బాలుడైపోయాడా! కాదు... కోహ్లిని చూసే ధోరణిలో వచ్చిన మార్పు ఇది. కోహ్లి ఆటను కాకుండా అతని ప్రవర్తనను ఈతరం కుర్రాళ్లు అనుకరిస్తారేమోనని భయపడుతున్నట్లు సాక్షాత్తూ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. కానీ అలాంటి దుందుడుకు స్వభావమే కోహ్లిని ప్రత్యేకంగా నిలబెట్టిందని స్వయంగా అతనే అంగీకరించిన సత్యం.  విరాట్‌ కోహ్లిది అహంకారం అన్నారు కొందరు... కానీ అది ఆత్మవిశ్వాసం మాత్రమే అని అతను చేసి చూపించాడు. ఒకనాడు అతని ప్రవర్తన చూసి కోహ్లి ఇలా ఎందుకు ఉంటాడు అనేవాళ్లతో కూడా కోహ్లి ఇలా ఉంటేనే బాగుంటాడు అనిపించగలిగాడు.

సాక్షి క్రీడా విభాగం :టన్నుల కొద్దీ పరుగులు చేయడం, సెంచరీల మీద సెంచరీలు సాధించడం, రికార్డులు బద్దలు కొట్టడం విరాట్‌ కోహ్లికి కొత్త కాదు. అది అతని దినచర్యలో భాగంగా మారిపోయింది. ఇప్పటికే అతను ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా కూడా అతను అసమాన ఘనతలు సాధిస్తూ పోతున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే, టి20 సిరీస్‌లు గెలుచుకొని టీమిండియా సత్తా చాటింది. టెస్టు సిరీస్‌ ఓడినా జొహన్నెస్‌బర్గ్‌లో ఘన విజయంతో పాటు తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా మన ప్రదర్శన గర్వపడేలా చేసింది. కోహ్లి ముందుండి నడిపించిన తీరుకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి.

మరోసారి తనదైన శైలిలో దూకుడుతోనే ప్రత్యర్థిని పడగొట్టిన అతనిపై ఏ వ్యాఖ్యాత గానీ, మాజీ ఆటగాడు కానీ పొరపాటున కూడా విమర్శకు దిగే సాహసం చేయలేకపోయాడు. వికెట్‌ తీసినప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఉద్వేగాలు ప్రదర్శించడం, సహచరులలో స్ఫూర్తి నింపే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గని తత్వం ఒరిజినల్‌ కోహ్లిని మళ్లీ చూపించాయి. అయితే అది ఈసారి విరాట్‌కు నెగెటివ్‌గా మారలేదు. సరిగ్గా చెప్పాలంటే అతని అద్భుతమైన ఆట అనవసరపు అంశాలపై ఎవరి దృష్టీ పడకుండా చేసింది.  

విమర్శల నుంచి ప్రశంసలు... 
2012లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు అసభ్యకర సంజ్ఞల వివాదంతో కోహ్లి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మరో రెండేళ్ల తర్వాత అదే గడ్డపై ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎలా జవాబివ్వాలో అతను ప్రపంచానికి చూపించాడు. వాళ్లు తనను దారి తప్పిన పిల్లాడు అన్నారని... అయితే అలా రెచ్చగొట్టడం వల్లే పరుగులు చేశాను కాబట్టి అదీ మంచిదేనంటూ కోహ్లి అప్పట్లో దాని గురించి చెప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా కోహ్లి వ్యవహారశైలిని విమర్శించే వారి జాబితా పెరిగిందే తప్ప తగ్గలేదు. కోహ్లికి ఎవరైనా మార్గనిర్దేశనం చేయాలంటూ ఒకరు సూచిస్తే... అతని దూకుడు జట్టుకు చేటు చేస్తుందని చెప్పేవారొకరు. అయితే అతను ఒక్కో సిరీస్‌తో వీటన్నింటికి సరైన రీతిలో సమాధానం ఇస్తూ పోయాడు.

తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌ సమయంలో దూకుడైన రీతిలో కాకుండా మంచి ఆలోచనాత్మకంగా కెప్టెన్సీ వ్యూహాల గురించి కోహ్లి తెలుసుకోవాలని చెప్పిన దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్‌... పర్యటన ముగిశాక కోహ్లి ది బెస్ట్‌ అనకుండా ఉండలేకపోయాడు. సెంచూరియన్‌ టెస్టులో బంతిని మార్చమంటూ అంపైర్లతో వాగ్వాదం చేసిన సమయంలో, మూడో టెస్టులో పిచ్‌ సమస్య వచ్చినప్పుడు ఆట కొనసాగించాలని కోరిన సమయంలో కోహ్లిలోని రౌద్ర రూపం కనిపించినా... దానిని ఎవరూ తప్పు పట్టలేదు. ఆవేశం, ఆటపై వెర్రి ప్రేమ, పిచ్చి... మీరు ఏ మాటైనా వాడండి. దాని వల్లే కోహ్లి వరల్డ్‌ క్రికెట్‌లో సూపర్‌ స్టార్‌గా ఎదిగాడనేది అంగీకరించాల్సిన విషయం. తన మాటల్లో కూడా అప్పుడప్పుడు కనిపించే అహాన్ని ధరించి మైదానంలో దిగే విరాట్‌ను మారమని ఎవరైనా చెప్పగలరా? 

మారాల్సిన అవసరం లేదు! 
ధోనితో పోలిస్తే కోహ్లి కెప్టెన్సీలో కూడా అతని తత్వమే కనిపిస్తుంది. ధోని అయితే భగవద్గీతలోని కర్మణ్యే వాధికారస్తే.... తరహాలో పదే పదే ప్రక్రియ గురించే తప్ప ఫలితాల గురించి ఆలోచించనని చెప్పేవాడు. కానీ ఫలితం లేని ప్రక్రియ వృథా అనేది కోహ్లి గట్టి నమ్మకం. అందుకే అతను మ్యాచ్‌ ఆడేది గెలిచేందుకే అనే బలమైన సందేశాన్ని జట్టు సభ్యులకు ఇవ్వగలిగాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయకుండా పోరాడమంటూ తాను ముందుండి చూపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆటగాళ్ల ఆట అనూహ్యం. సఫారీ గడ్డకు వెళ్లే ముందు వారి నుంచి ఎవరూ ఊహించనిది ఇది. దీనికి కర్త, కర్మగా తానే వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించడం కోహ్లి కెరీర్‌ స్థాయిని మరింతగా పెంచింది. కొన్నాళ్ల క్రితం కోచ్‌ అనిల్‌ కుంబ్లేతో విభేదాలు, ఆ తర్వాత కోచ్‌ను తప్పించిన అంశంలో కోహ్లిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మొత్తం వ్యవస్థ గుప్పిట్లో పెట్టుకున్నాడని, వ్యక్తి పూజ పెరిగిపోయిందంటూ కూడా కథనాలు కనిపించాయి.

అయితే తనపై ఉన్న ఆత్మవిశ్వాసమే అతడు ఈ తరహాలో వ్యవహరించేందుకు కారణమైంది. ఇప్పుడు కోహ్లి నామజపం మారుమోగిపోతోంది తప్ప కోహ్లి ఇలా వ్యవహరించకుండా ఉండాల్సింది అని ఎవరైనా అంటున్నారా! మరి కొన్ని నెలల్లో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టి దశాబ్ద కాలం పూర్తవుతుంది. అత్యద్భుత ఆట ఉన్నా అనవసరపు అంశాలతో కూడా అతను ఇన్నేళ్లు సహవాసం చేశాడు. అయితే తాను మాత్రం ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉన్నాడు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా తగ్గలేదు. నిజంగానే కోహ్లి ఎందుకు మారాలి? అతను ఒక్కసారిగా మారిపోయి ప్రశాంతంగా ఆడుతూ ఉంటే ఆట ఎంత నిస్సారంగా, బోర్‌గా ఉంటుందో ఊహించుకోండి! 

Advertisement
Advertisement