మోదీ ఘనం, పార్టీ పతనం

19 May, 2018 01:08 IST|Sakshi

జాతిహితం 

ఆ రెండు రాష్ట్రాలలోను ఆధిక్యం సాధించడానికి అవసరమైనంత ప్రతిష్ట మోదీకి మాత్రం ఉంది. కానీ, ఆ రాష్ట్రాల స్థానిక సారథులు మోదీ పాలిట గుదిబండలే. గుజరాత్‌లో విజయ్‌ రూపానీ– ఈయన ఏ వర్గానికీ చెందినవారు కాదు. నిజానికి అదే ఆయనను ముఖ్యమంత్రి పదవికి దగ్గర చేసింది. కర్ణాటకలో యడ్యూరప్ప– వయసు పైబడినవారు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు కూడా. మౌలిక భేదం ఏమిటంటే– ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలలో మోదీ తన కోసం ఓటు అడిగారు. రాహుల్‌ గాంధీ అయితే గుజరాత్‌లో, ఉత్తరప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయమని కోరారు. కర్ణాటకలో మాత్రం సిద్ధరామయ్యకు ఓటు వేయమని అభ్యర్థించారు.

గడచిన రెండేళ్లలో ఎన్నికలు జరుపుకున్న రాష్ట్రాలలో పర్యటించినప్పుడు కొన్ని విశేషమైన అంశాలు గమనంలోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ నిలకడగా కని పించడం ఒకటి. అలాగే ధరల పెరుగుదల (ప్రధానంగా పెట్రోలు, డీజెల్‌ ధరలు), ఉద్యోగాలు లేకపోవడం, వాణిజ్యం చతికిల పడడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ మొదలైన వాటి పట్ల ప్రజానీకంలో ఆగ్రహం కొట్టొచ్చినట్టు కనిపించడం మరొకటి. ఇలాంటి వాటి మీద ప్రజలు ఆగ్రహించడం సహజం. ఈ ఆగ్రహం బీజేపీ మీదకు, ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాల మీదకు మళ్లుతున్నది కూడా. కానీ ఆయనే ఇప్పుడొక కొండగుర్తు అయినట్టు, ఆస్తిత్వం అయినట్టు, తనకు తానే ఆయనొక బ్రాండ్‌ అయినట్టు వీటిలో ఏవీ కూడా ప్రధాని మీద ప్రతిబింబించడం లేదు. మోదీ రాజ వంశాల బరువుతో వంగిపోయిన, ప్రత్యేక హక్కులు, భారతీయతను తుడిచిపెట్టిన, ‘నేపథ్యం’ఉన్న వ్యవస్థలో తనకు తాను నాయకునిగా అవతరించిన వారు కాదు. ఆయన తనకు తాను అవతరించిన సూపర్‌బ్రాండ్‌. ఆయన రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలను పక్కన పెట్టి ఎక్కువ మంది భారతీయులు ఒక దైవంలా భావిస్తున్న వ్యక్తి. ఇక్కడ కొన్ని అర్హతలు వర్తిస్తాయి. అంటే ఆయనను వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. మైనారిటీలు, నిబద్ధతగల సోషలిస్టులు, ఇప్పుడే బాగా వ్యతిరేకత పెంచుకుంటున్న దళితులు మోదీ అంటే విముఖంగా ఉన్నారు. 

రాజీవ్‌గాంధీ కూడా అపారమైన (మోదీ కంటే ఎక్కువగా) ప్రాచుర్యం కలిగి ఉండేవారు. కానీ అది ఆయన గెలిచిన 1984 డిసెంబర్‌ మొదలు 18 మాసాల వరకే. తరువాత ఆయన ఇక కోలుకోలేనంతగా అప్రతిష్ట పాలయ్యారు. ఇంకొకరకంగా చెప్పాలంటే, ఆ మొదటి 18 మాసాల కాలంలో రాజీవ్‌ ఏం చెప్పినా మన మాతృమూర్తుల కళ్లు తడిసేవి. ఆ తరువాత, 19వ మాసం మొదలుకొని ఆయన ఏం చెప్పినా మన పిల్లలకు కూడా నవ్వొచ్చేది. ఈ పరిణామానికే మనం ప్రభుత్వ వ్యతిరేకత అని పేరు పెట్టుకున్నాం. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంతకాలం గడిచాక ఏ రాజకీయవేత్త మీదనైనా ప్రభావం చూపేదే. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే– ఈ విశ్వజనీన అంశం నుంచే మోదీ శక్తిమంతమవుతున్నారా? 

నా ఆలోచనలను పరీక్షించుకోవలసిన అవసరం ఉందేమోనని ఈ అభిప్రాయాలను చూసి మీరు భావించవచ్చు. ఈ వారం నేను మీ ముందుకు తెస్తున్న వాదనను బట్టి నేను విమర్శను ఎదుర్కొనక తప్పదు. నేను ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నానా అని, రాజ్యసభ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్నానా అన్న ప్రశ్నలు వస్తాయి. మీ పైజమా కింద ఉన్న ఖాకీ చెడ్డీని బహిర్గతం చేస్తారా అని అడగవచ్చు. చివరకు భక్తునిగా మారిపోతున్నారని అనుకోవచ్చు. ఇక్కడే ఒక మీమాంస ఉంది. ప్రతివారు– భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్, జర్నలిస్టులు అంతా ఓటు వేస్తారు. కానీ మీరు మీ నిర్ణయాలను అధిగమించడానికి మీ ఓటు ప్రాధామ్యాలను అనుమతిస్తున్నారా? తరువాత ప్రశ్న–ఈ వాదనను మీ ముందుకు తెస్తున్న సమయం గురించినది. కర్ణాటకలో మోదీ తన పార్టీకి ఆధిక్యం సాధించిపెట్టడంలో విఫలమైన ఈ వారంలోనే ఈ వాదనను మీ ముందుంచగలనా? లేదా అత్తెసరు మెజారిటీతో ప్రధాని సొంత రాష్ట్రంలో కూడా ఆయన పార్టీ గట్టెక్కి కొన్ని నెలలు కూడా గడవని ఈ సమయంలో ఈ వాదనను తేవచ్చునా? ఆయన పార్టీ ప్రతిష్ట దిగజారిందని ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వెల్లడించడం లేదా? ఇతర రాజ కీయ పార్టీల ప్రభుత్వాల మాదిరి గానే ఆయన పార్టీ ప్రభుత్వాల మీద కూడా ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి బింబించలేదా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఔననే. బీజేపీ ఈ మధ్య తన ప్రతిష్టను కోల్పోయినట్టే కనిపిస్తున్నది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత ఉందని కచ్చితంగా నిర్ధారించుకున్న రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. అయితే పార్టీ పరిస్థితే ప్రధానికి ఉన్న ప్రజాకర్షణ విషయంలోను ప్రతిబింబిస్తున్నదని మీరు చెప్పగలరా? 

ఎన్నికలు జరగుతున్న ప్రాంతాలలో ప్రజల నాడిని పట్టుకునే విషయంలో జర్నలిస్టులు, రాజ కీయ పండితులు అంత ఆధారపడదగినవారు కాదు. అయినప్పటికి అప్పుడు గుజరాత్‌లోను, ఇప్పుడు కర్ణాటకలోను కూడా మోదీ రాక తరువాత ఏర్పడిన పరిస్థితి మీద ఏకాభిప్రాయం ఉంది. ఆయన గతంలో ఎవరూ చేయనంత ఉధృతంగా ప్రచారం చేశారు. గుజరాత్‌లో 34 సభలలోను, కర్ణాటకలో 21 సభలలోను ప్రసంగించారు. నిజానికి కర్ణాటకలో మొదట 15 సభలకే ప్రధానిని పరిమితం చేశారు. గుజరాత్‌లో మోదీ పార్టీ కేవలం ఎనిమిది స్థానాల ఆధిక్యం సాధించింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దాదాపు అన్నే స్థానాలను సాధిం చలేకపోయింది. కర్ణాటక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయంటూ వచ్చిన సర్వేలన్నీ మోదీ ప్రచారానికి ముందు జరిపినవే. పోలింగ్‌ సమీపిస్తున్న సమయంలో మోదీ వచ్చి ఉత్సాహం రేకెత్తించకుంటే ఎన్ని స్థానాలు వచ్చి ఉండేవో ఒక్కసారి ఊహించండి! ఆ రెండు రాష్ట్రాలను జార విడుచుకోవడానికి అవసరమైన మేర ఆయన పార్టీ అప్రతిష్ట పాలైంది. అయితే ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఆ రెండు రాష్ట్రాలలోను ఆధిక్యం సాధించడానికి అవసరమైనంత ప్రతిష్ట మోదీకి మాత్రం ఉంది. ఆ రెండు రాష్ట్రాలలోను కూడా స్థానిక సారథులు మోదీ పాలిట గుదిబండలే. గుజరాత్‌లో విజయ్‌ రూపానీ– ఈయన ఏ వర్గానికీ చెందినవారు కాదు. నిజానికి అదే ఆయనను సీఎం పదవికి దగ్గర చేసింది. కర్ణాటకలో యడ్యూరప్ప– వయసు పైబడినవారు. అవి నీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు కూడా. మౌలిక భేదం ఏమిటంటే– ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలలో మోదీ తన కోసం ఓటు అడిగారు. రాహుల్‌ గాంధీ అయితే గుజరాత్‌లో, ఉత్తరప్రదేశ్‌లో మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయమని కోరారు. కర్ణాటకలో సిద్ధరామయ్యకు ఓటు వేయమని అడిగారు. 

తన ప్రజాకర్షణ నుంచి, తన పార్టీ అదృష్టాన్ని బట్టి, తన ప్రభుత్వ పని తీరును బట్టి ఏ వ్యక్తి అయినా శక్తిమంతుడై, అందరికీ అతీతంగా ఉన్నత శిఖరం మీదకు చేరగలడా? దీనికి సమాధానం ఏమిటంటే– వాస్తవాలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఇక్కడ సిద్ధాంతీకరించడానికి ప్రత్యేకమైన అంశమంటూ ఏదీ లేదు కూడా. గడచిన నాలుగేళ్లుగా ఆర్థిక వ్యవస్థ ఈ ప్రధాని నాయకత్వంలో నానా ఇక్కట్లు పడుతున్న సంగతి మనకు తెలుసు. ఉద్యోగావకాశాల లభ్యత దారుణ (క్షమిస్తే ఇవి ప్రభుత్వ గణాంకాలే) స్థితిలో ఉంది. భారత వ్యూహాత్మక స్థానం అధ్వాన స్థితికి చేరింది. గతంలో ఎన్నడూ లేనంతగా మనుషుల మధ్య సామరస్యం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అధికార వ్యవస్థ నుంచి మైనారిటీలు దూరమయ్యారు. చాలామంది క్షోభకు గురవుతున్నారు. అయినా సరే, మోదీ బృందంలోని వారు నిష్ప్రయోజకులైనప్పటికీ ఆయనకు తగిన సంఖ్యలో ఓట్లు పడుతూనే ఉన్నాయి. అయితే వచ్చే సంవత్సరం జరిగే సాధారణ ఎన్నికలలో అలాంటి నిష్ప్రయోజకులనే బరిలోకి దించితే ఓటర్లు ఏం చేస్తారో? ఇక్కడ కూడా మరోసారి అర్హతలు పరిగణనలోనికి వస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ పొత్తు ఇందుకు ఉదాహరణ. కానీ ఇది విస్తృత స్థాయిలో మార్పు తీసుకురాలేదు. 

ఒక వ్యక్తి తన పార్టీనీ, ప్రభుత్వాన్ని మించి ఎదిగిపోవడం ఎలా సాధ్యం? గడగ్‌ జిల్లాలో మేం పర్యటిస్తున్నప్పుడు శిరహట్టి నియోజకవర్గంలో ఒక చోట పొలాల మధ్య ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీ దగ్గర ఆగాం. అక్కడే బస్సు కోసం వేచి ఉన్న తొలి సంవత్సరం ఇంజనీరింగ్‌ విద్యార్థినులతో సంభాషణ ఆరంభించాను. వారంతా దాదాపు 18 ఏళ్లు ఉన్న అమ్మాయిలే. ఆ సంభాషణలో వారందరి దగ్గర నుంచి ఒకటే సమాధానం వచ్చింది. అది– వాళ్లు బీజేపీకే ఓటు వేస్తారట. అందుకు ‘ఒకే ఒక్క కారణం, మోదీ’. స్వచ్ఛ భారత్‌ పిలుపు ప్రభావం వారి మీద చాలా ఉంది. ‘మా గ్రామం 75 శాతం శుభ్రపడింది. మేం డిజిటల్‌ ఇండియాలో నివసించగలుగుతున్నాం. భారత ప్రతిష్టను మోదీ ఇనుమడింప చేశారు. అన్నిటి కంటే ముఖ్యంగా అవినీతిని విచ్ఛిన్నం చేశారు’– ఇంక వాదించడానికేం ఉంది. వీటిని వారు పరమ సత్యంగా విశ్వసిస్తున్నారు. మరి రాహుల్‌ గాంధీ గురించి ఏమంటారంటే, ‘ఆయన మంచి మనిషి కావచ్చు. కానీ మాకు తెలియదు’ ఇదే సమా«ధానం. ఇంకా, ‘ఆ మాటకు అర్థం నేను రాహుల్‌ను వ్యతిరేకిస్తూ మోదీని అభిమానిస్తున్నానని కూడా కాదు. కానీ మోదీ నాకు ఒక నాయకుడిగా తెలుసు. ఆయన సందేశాన్ని నేను నమ్ముతాను.’ ఇలాంటి సందేశమే నేను వాళ్ల నుంచి విన్నాను. ఇలాంటి విశ్వాసమే దేశమంతా ఉంది. వాళ్ల దృష్టిలో మోదీ ఒక్కరే నాయకుడు. వచ్చే సంవత్సరం వీరిలో 14 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో కొన్ని విభేదాలు ఉండవచ్చు. కానీ వారి విధేయత ఏకశిలా సదృశమే. అది– మోదీ– ఇజం. దీనిని మోదీ ఎలా సాధించారు? ఆయన ఒక సరికొత్త సందేశాన్ని నిర్దుష్టంగా అందిస్తున్నారు. అందులో మీ కోసం కొన్ని మంచి విషయాలు చెబుతున్నారు. అవి– పరిశుభ్రత, నిజాయితీ, విద్య, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం. వీటి నిర్వహణ బాధ్యతను కూడా మీకే అప్పగిస్తున్నారు. 

భారత రాజకీయ చరిత్రలో ఓటర్లను కేంద్రీకృతం చేసిన నాయకుడు మోదీ. అయితే ఆయన వ్యతిరేకులు కూడా తక్కువేమీ కాదు. వారు మోదీని తీవ్రంగా ఈసడించుకుంటారు. వీరే ఈ వారం వ్యాసంలో ఇలాంటి వాదన తెచ్చినందుకు నన్ను కూడా ఈసడించుకోవచ్చు. వాస్తవికతను అంగీకరించడమే రాజకీయం. దీనితో మీరు ఏకీభవించకుంటే ఖండించడానికి మార్గాలు వెతకండి.


శేఖర్‌ గుప్తా 

వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు