బెడిసికొడుతున్న మన దౌత్యం

16 Mar, 2019 00:47 IST|Sakshi

జాతిహితం 

జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ యూఎన్‌ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. చైనా ప్రభుత్వ నియంత్రణలోని మీడియా భారత్‌ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్‌ ఆ దేశం పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. భవిష్యత్తు పరిణామాలను ముందే అంచనా వేసి వ్యవహరించడంలో చైనా ముందంజలో ఉండగా, వరుస తప్పిదాలతో మోదీ ప్రభుత్వం వెనుకబడిపోయింది. మోదీ విదేశీ విధానంలో కొనసాగుతున్న అయిదు తప్పులు భారత్‌కు సరైన దౌత్య ఫలితాలను అందకుండా చేస్తున్నాయి.

ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ఉండేదీ, ప్రబలమైనదీ ఏమిటి? భయమా లేక ప్రేమా? ఈ ప్రశ్నకు మీరు మనస్తత్వ నిపుణుడిని సమాధానం అడగాల్సి ఉంది. మరోవైపున రాజకీయ కాలమిస్టు ఏం చేయగలడు కఠిన వాస్తవాలను సేకరించడం తప్ప, కల్పన నుంచి, ప్రచారార్భాటం నుంచి వాటిని వేరుచేయడం తప్ప. వాటి ఆధారంగా ముఖ్యమైన వాదనను ప్రేరేపించడం తప్ప.

ఈ వారం ప్రారంభంలో, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకోవడం ద్వారా భారత్‌ను తీవ్రంగా చికాకుపెట్టింది. ఐరాస ప్రయత్నాన్ని చైనా నాలుగోసారి అడ్డుకోవడమే కాదు. చైనా ప్రభుత్వ, కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్‌ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. కమ్యూనిస్టు పార్టీ యాజమాన్యంలోని ‘గ్లోబల్‌ టైమ్స్‌’ వ్యాఖ్యాత మరీ మోటుగా భారత్‌ గురించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహావేశంతో ఉన్న చిత్రాలను చూపిస్తూ నరేంద్రమోదీ ప్రస్తుత పరిస్థితిని తన రాజకీయ ప్రచారానికి వాడుకుం టున్నారని ఆరోపిస్తూ చివరగా ఘోరంగా అవమానిస్తూ ఆ వ్యాఖ్యాత తన వ్యాఖ్యానాన్ని ముగించారు. అదేమిటంటే.. చైనా భారత్‌ మిత్రురాలే తప్ప దాని జాతీయవాదానికి బందీ కాదు. 

చైనా ప్రభుత్వం దాని అధికార పార్టీ వాణి ద్వారా తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటింపజేస్తూ, తన దృష్టిలో భారత్‌కి, ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న స్థానమేంటో చూపించిందనడంలో సందేహమే లేదు. ఈ వ్యాఖ్యానం ద్వారా చైనా తన ఊహాన్‌ భేటీ స్ఫూర్తిని పునర్నిర్వచించింది. మీ దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మీ భూభాగంలో నా సైనిక దళాలు బైఠాయించనట్లయితే, మన మధ్య ఒప్పందాన్ని నేను గౌరవిస్తాను. ఇతరత్రా సందర్భాల్లో మాత్రం పాత నిబంధనలు వర్తిస్తాయి అన్నదే దీనర్థం. చైనా దురహంకార వైఖరిలో కొట్టొచ్చినట్లుగా రెండు స్పందనలు కనబడుతున్నాయి. అవేమిటంటే వాటి స్వరం, వక్కాణింపులే. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్‌ ‘ఒక దేశం’ పట్ల తన అసంతృప్తిని అలా వ్యక్తపరిచింది. కానీ అమెరికాకు అలాంటి తటాపటాయింపులు ఏమీ లేవు. భారత్‌ పిరికి ప్రకటన కంటే ఎంతో నిష్కర్షగా, తీవ్రంగా అమెరికన్లు చైనాను పేరెత్తి మరీ విమర్శించారు. 

భారత్‌ తన కండపుష్టిని ఇప్పటికీ కోల్పోలేదు. కానీ, ఇప్పుడు అది మరింత జాగ్రత్తగా తన మాటలను, చేతలను ఎంపిక చేసుకుంటోంది. 2019 మార్చి నెలలో అంటే ఎన్నికలకు 2 నెలల ముందు భారత్‌ తన పట్ల శత్రుపూరితంగా వ్యవహరిస్తున్న చైనా పట్ల అధైర్యంతో వ్యవహరిస్తోంది. అదే సమయంలో ట్రంప్‌ పాలనలోని స్నేహపూర్వకమైన అమెరికాతో మాత్రం పూర్తి స్వదేశీ వాణిజ్య యుద్ధాన్ని భారత్‌ ప్రారంభి స్తోంది. మనం చైనా అంటే భయపడుతున్నాం. అదే సమయంలో మన తరఫున మాట్లాడుతున్న దేశంతో పోట్లాడుతున్నాం. మోదీ విదేశీ విధాన సూత్రంలో కొనసాగుతున్న అయిదు తప్పులను మనం ఇక్కడ చూద్దాం.

1. మన వ్యూహాత్మక కూటములను మనం పెద్ద హృదయంతో అభినందించడంలో మన వైఫల్యం: వ్యూహాత్మకంగా ట్రంప్‌ పాలనలోని అమెరికా మనకు ఎంతో బలిష్టమైన పొత్తుదారు, మిత్రురాలు కూడా. కానీ ట్రంప్‌తో మొదలుకుని అమెరికా పాలనా విభాగంలోని ఉన్నత స్థానాల్లో భారత్‌ గురించి ఒక అలక్ష్యంలాంటిది ఏర్పడిపోయింది. ట్రంప్‌ను దూకుడు పిల్లాడిగా తోసిపుచ్చడానికి భారత్‌ తొందరపడుతోంది కానీ అలా ప్రకటించేంత సత్తా మనకుందా? హార్లీ డేవిడ్సన్‌ మోటార్‌ బైక్స్‌పై భారత సుంకాల విషయంలో ట్రంప్‌ దూకుడు చూసి మీరు నవ్వుకోవచ్చు కానీ స్వదేశంలో వాణిజ్యం విషయంలో భారత్‌ అమలుచేస్తున్న స్వీయ రక్షణ వైఖరిని ట్రంప్‌ కూడా తప్పుబడుతున్నారు. దిగుమతి చేసుకుంటున్న ఔషధాలు, వైద్య పరికరాల ధరలను బాగా తగ్గించివేయడం నైతికంగా, రాజకీయపరంగా మంచి నిర్ణయమే. కానీ ఆకస్మికంగా ధరల నియంత్రణ, దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ మీరు ఇలాంటి చర్యలను అమలు చేయగలరా? భారతీయ ఇ–కామర్స్‌లో, డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో చైనా పెట్టుబడులను స్వాగతిస్తూనే తమ అమెజాన్, వాల్‌మార్ట్‌లపై యుద్ధం ప్రకటిస్తున్న భారత్‌.. అమెరికన్లకు ఏ మాత్రం అర్థం కావడం లేదు.

పుల్వామా ఘటన తర్వాత అమెరికా భారత్‌ పక్షాన నిలిచిన తీరు విశ్వసనీయమైనదే కాగా మరోవైపున మోదీ, ట్రంప్‌ మధ్య సంబంధాలు, వ్యక్తిగత బంధం విషయంలో అవరోధాలున్నాయి. 2017 నవంబర్‌ నుంచి వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరగడం లేదు.2018 నవంబర్‌లో బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జీ–20 దేశాల సదస్సు సందర్భంగా ఇరువురి మధ్య భేటీ కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనకు అనుకూలమైన అంశాలను పరిష్కరించకపోతే ట్రంప్‌ కనీసం ఫోటోలకు, గంభీరమైన ఫోజులకు సమయం వెచ్చించడానికి కూడా ట్రంప్‌ ఇష్టపడే రకం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్యపరంగా అమెరికాకు కాస్త అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంవల్ల భారత్‌ కొంపేమీ మునిగిపోదు కదా! అయినా ట్రంప్‌ ఏమంత పెద్దకోరికలు కోరారనీ. ఆప్ఘనిస్తాన్‌లో అమెరికన్‌ సైన్యాలు పడుతున్న పాట్లు పడమని మనల్ని ట్రంప్‌ కోరడం లేదు. అలాగే రష్యన్‌ తయారీ ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలను భారత్‌ కోరవద్దని ట్రంప్‌ ఒత్తిడి చేయడం లేదు. పైగా ఇరాన్‌లో భారత్‌ నిర్మిస్తున్న చాబహార్‌ ఓడరేవును మూసివేయవలసిందిగా కూడా తను కోరడం లేదు. కొన్ని రకాల సుంకాలపై, వాణిజ్యంపై కాస్త మినహాయింపులను తాను కోరుకుంటున్నారు. తెలివైన నాయకులు ప్రత్యేకించి మిత్రులతో జరపాల్సి వచ్చిన ఘర్షణలను తెలివిగా ఎంచుకుని పరిష్కరించుకుంటారు. ట్రంప్‌తో స్వదేశీ వాణిజ్య యుద్ధరంగాన్ని ప్రారంభించడం ద్వారా మోదీ పెద్దతప్పు చేశారు. 

2. అహంకారపూరితమైన అగ్రరాజ్యాలతో ఏకపక్ష బుజ్జగింపు విధానం పనిచేస్తుందన్న తప్పు లెక్క: ఈ అంశాన్ని ఇలా చూద్దాం. అమెరికాతో 60 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్య మిగులును ఆస్వాదిస్తూనే భారత్‌ మరోవైపున అమెరికాతో వాణిజ్య సంబంధాలను ప్రతిష్టంభనలోకి నెట్టివేసింది. కానీ చైనాతో మనకు 60 బిలియన్‌ డాలర్ల లోటు వ్యాపారం ఉంటున్నప్పటికీ ఆ దేశానికి పూర్తిగా అనుమతులు ఇచ్చేస్తున్నాం. చైనా సరకులకు, పెట్టుబడులకు విస్తృతంగా మన మార్కెట్లను తెరవడం వెనుక, భారత్‌ పట్ల చైనా వ్యూహాత్మక విధానాన్ని మెత్తపర్చే ఆలోచన ఉందేమో. కానీ మనమనుకున్నట్లు ఏమీ జరగలేదు. రెండేళ్ల క్రితం చైనీయులు డోక్లామ్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్లు పంపిస్తున్న సందేశం కూడా మోటుగానే ఉంటోంది. మీరు ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంలో మేము డోక్లామ్‌ లేక చుమార్‌ ఘటనలను పునరావృతం కానివ్వకూడదనుంటే థాంక్యూ అనే నోట్‌ను మాకు పంపిం చండి. అమెరికా నుంచి అన్నీ వదులుకోవాలని మోదీ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తూనే, చైనానుంచి అన్నీ తీసుకో అనే విధానాన్ని చేపడుతోంది. ఒక దేశాన్ని తక్కువగా చూడటం మరోదేశం ముందు భయంతో సాగిలబడటం అనే విధానమే ఇది.

3. వ్యక్తిగతీకరించిన విదేశీ విధానం పట్ల వ్యామోహం: మోదీకి ప్రజాకర్షణ మిన్న. కానీ వృత్తినైపుణ్యంతో కూడిన దౌత్యానికి సన్నద్ధమవడానికి, దాన్ని కొనసాగించడానికి ప్రజాకర్షణ మాత్రమే సరిపోదు. దీనికి అంతర్గత చర్చ, సంప్రదింపుల ద్వారా విధానాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర నేతల వ్యక్తిగత శైలి, వైఖరులు కూడా వ్యత్యాసంతో ఉంటాయి. మోదీ మంత్రిమండలి కంటే మరింత ప్రతిభావంతంగా పనిచేసే వ్యవస్థను జిన్‌పింగ్‌ నిర్మించుకున్నారు. మోదీ చైనా అధ్యక్షుడితో తొలిసారి నెరిపిన ప్రేమతో కూడిన భేటీ ప్రయోజనాలు కలిగించలేదని ఇప్పుడు తేలిపోయింది. తర్వాత గ్జియాన్, ఊహాన్‌ ఇతర చోట్ల కూడా ఇదే కొనసాగింది. మన రిపబ్లిక్‌ డేకి ట్రంప్‌ను ఆహ్వానించడంలో, నవాజ్‌ షరీఫ్‌తో విఫల కౌగిలింతలో వేసిన తప్పటడుగులు మనం సరైన హోంవర్క్‌ చేయలేదని తేల్చేసింది.

4. తప్పు అంచనాలతో మూల్యం: రాజకీయాలు, దౌత్యం, యుద్ధం, క్రీడలు, జూదం అన్నింట్లో సరైన అంచనా చాలా విలువైనది. ఇక్కడే మోదీ తప్పు చేశారు. ఎన్నికలకు ముందుగా మోదీ మరొక దాడికి దిగబోతున్నట్లుగా చైనాకు తెలుసు. పాకిస్తాన్‌పై దాడి చేసి వెనువెంటనే విజయం సాధించామని మోర విరుచుకున్నట్లుగా చైనాతో మోదీ వ్యవహరించలేరని చైనా నేతలకు తెలుసు. సరైన అంచనా వేయడమే చైనీ యులు చేసే మొదటిపని.

5. దేశీయ రాజకీయాలతో విదేశీ విధానాన్ని మిళితం చేయడం: మోదీ స్వదేశంలో ప్రతిష్ట పెంచుకోవడం కోసం తరచుగా తన విదేశీ విధానాన్ని, సదస్సులను ఉపయోగించుకుంటూ ఉంటారు. సరిగ్గా దీన్నే చైనీయులు మొదటగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎన్నికల సీజన్‌లో మరొక దాడి జరగొచ్చన్న భారతీయ భయాందోళన చైనాకు తెలుసు. అందుకే ఊహాన్‌లో తమనుంచి భారత్‌కు హామీ ఇచ్చారు కానీ తమ ఆంక్షల ప్రకారమే ఇచ్చారు. చైనా వాణిజ్య ఆధిపత్యం పెరుగుతోంది. అరుణాచల్, పాకిస్తాన్‌ వ్యవహారాల్లో వారి దృక్పథం మరింత కఠినంగా మారింది. కానీ భారత్‌ మాత్రం చైనా పేరు కూడా ఎత్తడానికి సాహసించకుండా మసూద్‌ అజర్‌ విషయంలో నంగినంగిగా నిరసన తెలుపతోంది దీనివల్లే భారత్‌ ఎక్కడుండాలో అక్కడే చైనా ఉంచగలుగుతుంది. మొత్తంమీద చూస్తే ఇది మోదీ అయిదేళ్ల పాలనపై విదేశీ విధాన సమతుల్యతా పత్రం కాదు. ఇది మోదీ తీవ్ర తప్పిదాలు, వాటి పర్యవసానాల చిట్టా మాత్రమే.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు