భద్రతా సవాళ్ల సమీక్ష లేనందునే...

30 Nov, 2023 04:46 IST|Sakshi
ముంబై 26/11 ఉగ్రదాడులకు పదిహేనేళ్లు

సందర్భం

పదిహేనేళ్ల క్రితం, 2008 నవంబరు 26న దేశ ఆర్థిక రాజధానిపై జరిగిన ఉగ్రదాడి తొలిదశలో భారత భద్రతా వ్యవస్థ దాదాపుగా అచేతనమైందంటే అతిశ యోక్తి కాబోదు. నిస్సహాయులైన, నిరాయుధులైన జన సామాన్యంపై పేట్రేగిన ఉగ్రమూక వందల ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటన అది. భారతదేశ సార్వభౌమత్వం, భద్రతపై ఇంత స్థాయిలో ఎన్నడూ దాడి జరగలేదని చెప్పాలి.

ఈ ఘటన జాతీయ భద్రత అంశంలోని సంస్థా గత లోపాలను ఎత్తి చూపింది. దేశం మరోసారి 26/11 లాంటి ఘటనను ఎదుర్కోరాదంటే... అంతర్గత భద్రత సవాళ్లపై సమీక్షించుకోవడం మన తక్షణ అవసరం కావాలి. ముంబై దాడుల్లో ఉగ్రవాదులు అనుసరించిన పద్ధతులు... సరిహద్దులకు అవతలి నుంచి వారికి అందిన సూచనల వంటివన్నీ మనకు అనూహ్యమైనవే. అదే సమ యంలో ఢిల్లీ, ముంబైల్లోని జాతీయ స్థాయి భద్రత వ్యవస్థలు సంపూర్ణంగా విఫలమయ్యాయి.

1999 నాటి కార్గిల్‌ యుద్ధంలోనూ సంస్థాగతమైన నిఘా లోపాలు బయటపడ్డాయి. దివంగత కె. సుబ్రమణ్యం నేతృత్వంలోని కార్గిల్‌ రివ్యూ కమిటీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘‘ఏజెన్సీల మధ్య సమన్వయానికి, నిర్దిష్ట లక్ష్యానికి అనుగుణంగా కలిసి పనిచేసేందుకు తగిన వ్యవస్థ లేకుండా పోయింది. అలాగే ఏజెన్సీ లకు పనులు చెప్పేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు, సామర్థ్యాలను పరీక్షించేందుకు, నాణ్యత ప్రమాణాలను సమీక్షించేందుకు కూడా తగిన వ్యవస్థలు లేవు. అన్ని నిఘా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూసే ఏర్పాట్లు కూడా లేవు’’ అని విస్పష్టంగా పేర్కొందీ కమిటీ. 

ఈ రకమైన లోపాల కారణంగా భారత్‌ నివారించ దగ్గ ఎదురుదెబ్బలు ఎన్నో చవిచూడాల్సి వస్తోంది. గల్వాన్  లోయ సంఘటన ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక అంశం. 2020లో జరిగిన ఈ ఘటనలో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారతీయ సైనికులను ఒకరకంగా ‘ఆశ్చర్యానికి’ గురిచేస్తూ తీవ్రస్థాయి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 

మిలిటరీ సంస్కరణల ఫలితం?
భద్రత వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్‌ కమిటీకి ప్రాతినిధ్యం వహించే ‘ద నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ మిలిటరీ సంస్కరణలను అమలు చేసే విషయంలో దశాబ్దాల సమయం తీసుకుంది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ (సీడీఎస్‌) పోస్ట్‌ను సృష్టించేందుకు 1990లలో పీవీ నర సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు మొదల య్యాయి. ఆఖరికి ఇది 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా సాకారమైంది. ఈ జాప్యం చెప్పే విషయం ఏమిటి? జాతీయ భద్రత అంశాల విషయంలో సంస్క రణలు, సంస్థాగత సమీక్షలకు కొంత నిరోధం ఉందీ అని. అది కూడా స్వప్రయోజనాల కోసం పాకులాడే వారి వల్ల అని అర్థమవుతుంది. 

భారతీయ నిఘా ఏజెన్సీల్లో... ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (ఆర్‌ అండ్‌ ఏడబ్ల్యూ– క్లుప్తంగా ‘రా’), నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్‌ఓ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్  ఏజెన్సీ (ఎన్ ఐఏ)లు ఉన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం,కేంద్ర హోంశాఖల కింద ఈ ఏజెన్సీలన్నీ పనిచేస్తాయి. వీటికి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్రతి సాయుధ దళంలోనూ తమదైన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్లు అదనం.

అంతేకాదు... రెవెన్యూ, ఆర్థిక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు, నిఘా పెట్టేందుకు ప్రత్యే కమైన విభాగాలు కూడా ఉన్నాయి. సమాచార రంగంలో వచ్చిన సరికొత్త మార్పులను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వాలు రోజంతా తమ నిఘా కార్యక్రమాలను కొన సాగించాల్సిందే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రమే లేదు. చాలా ఏజెన్సీలను ఐపీఎస్‌ల నుంచి ఎంపిక చేసిన సీనియర్‌ స్థాయి అధికారులు నడుపుతూంటారు. సంస్కరణలు కష్టం అవుతూండేందుకు ఇది కూడా ఒక కారణం.

పాతికేళ్ల నివేదికలు...
మిలిటరీ సంస్కరణల విషయంలో దాదాపు 24 ఏళ్లుగా చాలా నివేదికలు వెలువడ్డాయి. నిశితంగా శ్రద్ధ పెట్టి సమీక్షిస్తే ఉన్నత స్థాయిలోని పోలీసు వర్గాలు, రాజ కీయ నాయకులు ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలనే స్వార్థంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. 

2024 ఎన్నికల సమయం దగ్గరపడింది. కాబట్టి వ్యవస్థాగతమైన సంస్కరణలకు ఇదేమంత మంచి సమయం కాదు. కానీ వచ్చే ప్రభుత్వం ఏదైనా ఈ విష యాన్ని కచ్చితంగా చేపట్టాల్సిందే. ఇప్పటివరకూ ఈ అంశంపై వెలువడ్డ నివేదికలన్నింటినీ కూలంకుషంగా సమీక్షించి ఒక టాస్క్‌ఫోర్స్‌ ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ధారించుకుని ముందడుగు వేయాలి. ఈ సంస్కరణలకు పునాదులుగా నిలిచే అంశాలు ఇరవై ఏళ్లుగా నిఘా వర్గాల్లో నైపుణ్యం సాధించిన వారి నివేదికల ఆధారంగా ఉంటాయని నమ్ము తున్నాను.

వృత్తిపరమైన నిబద్ధత, వ్యక్తిగతంగా నైతిక నియ మాలున్న వారు నిఘా వ్యవస్థల్లో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ప్రజా పరిశీలనకు దూరంగా, పారదర్శకం కాని తెర వెనకాల ఈ వ్యవస్థలు పనిచేస్తూంటాయి మరి. కాబట్టి వీరి పనితీరును బహిరంగంగా సమీక్షించడం అసాధ్యమే కాదు, వాంఛనీయం కూడా కాదు. కెనడా ఇటీవలే భారతీయ నిఘా వ్యవస్థలపై కొన్ని ఆరోపణలు గుప్పించింది. అమెరికా కూడా ఈ అంశంలో తన ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రకమైన ఆరోపణలు ఏమంత మంచివి కాదు. 

26/11 ఉగ్రదాడి మనలోని లోపాలు ఎన్నింటినో ఎత్తి చూపింది. వాటిని పరిష్కరించే విషయంలో ఇప్పటికే జరిగిన జాప్యం చాలు. ఈ విషయంలో వీలైనంత తొంద రగా సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడం దేశ హితం దృష్ట్యా అవసరం.
సి. ఉదయ్‌ భాస్కర్‌ 
వ్యాసకర్త డైరెక్టర్, సొసైటీ ఫర్‌ పాలసీ స్టడీస్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు