రుణ మాఫియా

22 Dec, 2018 00:55 IST|Sakshi

అక్షర తూణీరం 

మాది చిన్న గ్రామం. అక్షరాలొచ్చిన ప్రతివారూ ప్రామిసరీ నోటు రాయడం నేర్చుకు తీరాలనేవారు మా నాన్న. అది చారిత్రక అవసరమని నొక్కి వక్కాణించేవారు. పదేళ్లు వచ్చేసరికి నాన్న బ్రహ్మోపదేశంతోపాటు ప్రోనోటు బుర్రకి పట్టించారు. మా పల్లెటూళ్లో కలం, తెల్ల కాగితం, నోటు బిళ్ల, కటిక్కాయ అన్నీ సింగిల్‌ విండో పద్ధతిలో మా ఇంట్లో దొరికేవి. రాతగాడు కూడా సమకూరేసరికి, ఇక రుణదాత దొరికితే చాలు లావాదేవీ పూర్తి అయ్యేది. ఆన ఫలానా సంవత్సరం ఫలానా నెల ఫలానా తేది, వారి యొక్క కుమారు ఫలానా వారికి వ్రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోటు. ఈ రోజు నా అక్కర నిమిత్తం అనగా కుటుంబ ఖర్చుల నిమిత్తం మీ వద్ద అప్పుగా తీసుకున్న రొక్కం రూ–లు. దీనికి నెలకి నూటికి వడ్డీ అయిదణాల డబ్బు. తర్వాత ముగింపు వాక్యాలుంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ధర్మవడ్డీ అది. ‘డబ్బు’ అంటే అయిదు దమ్మిడీలు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం అని రాస్తే ఉత్తరోత్తర సమస్య కావచ్చని కుటుంబ ఖర్చులని రాయిస్తారు. పెళ్లి, పేరంటం, అనారోగ్యం, గాలివాన ఏదైనా కావచ్చు. నాన్న చేసిన బ్రహ్మోపదేశం మర్చిపోయాగానీ ప్రోనోటుపదేశం ఇప్పటికీ బుర్రలో ఉండి, నా సొంతానికి ఎంతో ఉపయోగంగా ఉంది. మోదీ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నాకందుకే ఈ శతాబ్దపు దౌర్జన్యం అనిపించింది. ప్రోనోటు మాటలే కరెన్సీ నోటు మీద ఉంటాయి. మూడు సింహాల ముద్ర, రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ సంతకం ఉంటాయి. కోట్లాదిసార్లు మాట తప్పి పాపం మూటకట్టుకుంది మోదీ సర్కార్‌. దక్కిన అసలు ఫాయిదాలు మాత్రం శూన్యం. 

రుణం అంటే పరపతి. రుణం అంటే నమ్మకం. కానీ ఇప్పుడు బ్యాంక్‌ రుణం అంటే స్పష్టంగా చేతికి దక్కిన ఆదాయమే. కాకపోతే లాంఛనంగా, ‘షరతులు వర్తిస్తాయ్‌’ అని ఓ మాట అనుకోవచ్చు. బ్యాంకులు జాతీయమయ్యాక రైతులకు రుణాలివ్వడం మొదలుపెట్టాయి. అప్పటిదాకా చేలగట్లు తప్ప వేరే దారి తెలియని చిన్నాచితకా రైతులు అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. రకరకాల లోన్లు పుట్టే మహదవకాశం వచ్చింది. మొదట్లో కొంచెం భయం ఉండేది. మన రాజకీయ నాయకులు ఎన్నికల వేళ ‘రుణ మాఫీ’ తారకమంత్రాన్ని ప్రప్రథమంగా జపించడం మొదలుపెట్టారు. ఆ మాట రైతాంగానికి కొండంత అండగా మిగిలేది. అసలు అపోజిషన్‌ గొంతులు ఓడిన మర్నాటినుంచీ రుణమాఫీ చెయ్యాలంటూ ఇంటాబయటా నినాదాలు పెట్టడం, మాఫీ జరగ్గానే వాళ్ల అకౌంట్‌లో వేసుకోవడం మామూలైపోయింది. అప్పట్నించి రైతులు రుణాలు చెల్లించక్కర్లేదనే భరోసాతోనే అప్పులు చేస్తున్నారు. ఇది ఎన్నేళ్లుగా, ఎంత ఉదారంగా సాగుతోందో మనకి తెలుసు. కేసీఆర్‌ రైతుబంధు స్కీము పెట్టి డబ్బు పంచేశారు. అది అద్భుతంగా పేలింది. డబ్బున్న బంధువుల్ని నాలుగువేలు అప్పడిగితే, ఓ వెయ్యో, అర వెయ్యో చేతిలోపెట్టి నువ్‌ మళ్లీ ఇవ్వక్కర్లేదని ముందే చెప్పేస్తారు. కేసీఆర్‌ ఇచ్చిన టచ్‌ అదే.

అందరికీ అప్పులిస్తున్నారు. రైతన్నలకి ఎందుకివ్వరాదు. అసలు వాళ్లకి భూములు కొనుక్కోవడానికి కూడా 80 శాతం రుణాలివ్వాలి. వ్యాపారాలకి, పరిశ్రమలకి, ఇళ్లకి, కార్లకి ఇవ్వడం లేదా? ఓ ఇరవై సంవత్సర వాయిదాల మీద బాకీ చెల్లించి భూమికి సొంతదారుడవుతాడు. అప్పు చెల్లించలేకపోతే బ్యాంకులే భూమిని స్వాధీనం చేసుకుని పండించుకుంటాయ్‌.

వ్యవసాయం పుట్టినప్పటినుంచి రైతుకి కన్నీళ్లే మిగులుస్తూ వస్తోంది. అది ఏ రకమైన పంటయినా కావచ్చు. ఏలకులు, లవంగాలు లాంటి ఖరీదైన సుగంధ ద్రవ్యాలు పండించినా, టీ కాఫీ తోటలు వేసినా, ఇతర వాణిజ్య పంటలు పండించినా రైతుకి నిట్టూర్పులే మిగుల్తాయి. రెండేళ్ల దిగుబడి ఒక్కసారిగా రానే రాదు. కారణం– వ్యవసాయ పరిశ్రమలో నేల, రైతు శ్రమతోబాటు ప్రకృతి చెప్పినట్టు వినాలి. వాన ఎండ గాలి పాటు అన్నీ కార్తెలకి తగ్గట్టుండాలి. వీటిని శాసించి నియంత్రించే ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టగలిగితే అప్పుడు రైతే రాజు. అందాకా అత్యధిక ఓటర్లుగా ఉన్న రైతులకు మన నేతలు జోలలు పాడుతూ ఉండాల్సిందే. ఆదాయం రెట్టింపు చేస్తానని ఒకరు, ఎకరాకి కోటి తెప్పించే మార్గం ఉందని ఇంకోరు రైతాంగాన్ని మభ్యపెడుతూనే ఉంటారు. ఈ రుణమాఫియా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది.

   

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు