రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ

6 Nov, 2023 02:58 IST|Sakshi

పేదలందరికీ ఇళ్ల స్థలాలు 

ఇళ్ల నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం 

జర్నలిస్టులకు 300 గజాల స్థలం 

సీపీఎం ఎన్నికల మేనిఫెస్టో విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని సీపీఎం హామీనిచ్చింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతూ మేనిఫెస్టోలో పలు అంశాలను జోడించింది.

రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని కోరతామని పేర్కొంది.ధరల నిర్ణాయక కమిషన్‌ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరతామని స్పష్టం చేసింది. కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రు ణాలు, సబ్సిడీలు, పంట బీమా, కౌలు, పోడు  రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తి డి చేస్తామని సీపీఎం పేర్కొంది.

రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో సాగులో వున్న అర్హులైన అందరికీ హక్కు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపింది. 10 ఎకరాల లోపు రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉచితంగా ప్రభుత్వం అందించాలని కోరింది.  

సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
ఇళ్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఆ ఇళ్ల నిర్మాణానికి రు. 10 లక్షల ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం. 
ప్రతి జర్నలిస్టుకు 300 గజాల ఇంటిస్థలం ఉచి తంగా కేటాయించాలి. ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలి. పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు రూ.10 వేల పెన్షన్‌ సౌకర్యం కల్పించాలి. వారి పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి. జర్నలిస్టులు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్‌ స్కీంను అమలు చేయాలి. 
ప్రభుత్వ భూములను ఆర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలని పోరాడుతాం. ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న, సాగుచేస్తున్న పేదలకు పట్టాల కోసం పోరాటం చేస్తాం.  
భూమి లేని వ్యవసాయ కూలీలకు మిగులు భూ మి పంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. 
కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు తగ్గకుండా నిర్ణయించేవరకూ పోరాటం. 
కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ కోసం కృషి చేస్తాం. 
 అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ తదితర స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించేందుకు జరిగే పోరాటాలకు అండగా ఉంటాం.  
 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ అమ లు, హెల్త్‌ స్కీమ్‌ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలి.  
బీసీ కులాలకు జనగణన చేపట్టాలి.  
250 యూనిట్లలోపు కరెంటు వాడకం ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం.  
నిరుద్యోగులకు రూ. 5 వేల భృతి ఇవ్వాలి.  
సింగరేణి కోల్‌ బ్లాకులను ప్రైవేటుపరం చేయకుండా ఒత్తిడి తెస్తాం. 
టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వంపై పోరాడతాం. 
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి. 
కాటికాపరుల వృత్తిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌  ఇవ్వాలి. 

మరిన్ని వార్తలు