అంతరిక్షాన్ని గెలుద్దాం!

8 Sep, 2019 00:57 IST|Sakshi

‘‘ఇంతింతై, వటుడింతై, మరియు తానింతై/ నభో  వీధిపైనంతై, తోయద మండలాగ్రమునకల్లంతై,/ ప్రభా రాశిపై నంతై, చంద్రునికంతౖయె, / ధృవునిపైనంతై, మహ ర్వాటిపైనంతై, / సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థిౖయె’’... బలిచక్రవర్తి దగ్గరకు వామనుడిగా వచ్చిన శ్రీమహావిష్ణువు మహాకాయుడిగా ఎలా ఎదుగుతు న్నాడో వర్ణిస్తూ శ్రీ మద్భాగవతంలో బమ్మెర పోతన చెప్పిన పద్యం. ఆకాశాన్నీ, అంతరిక్షాన్నీ, చంద్రగోళాన్నీ, నక్షత్ర మండలాన్ని దాటుతూ ఎదుగుతున్నాడు వామను డని చెబుతూ అనంతమైన ఈ విశ్వరూపాన్ని పోతన కవి సాక్షాత్కరింపజేశాడు. వామన మూర్తి పెరుగుతున్న క్రమాన్ని ‘రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రం బై...’ అంటూ మరో పద్యంలో సూర్యుడితో పోలుస్తూ వర్ణిస్తాడు. ఒక దశలో సూర్యుడు వామనమూర్తికి గొడుగులా కనిపించాడట. కొంతసేపటికి శిరోరత్నమై కనిపించాడట. ఆ తరువాత క్రమంగా చెవికున్న ఆ కుండలంలాగా, కంఠహారంలాగా, నడుముకున్న వడ్డాణం గంటలాగా, చివరికి పాదాలకున్న అందెలా, పాదాల కింద వున్న పీటలాగా కనిపించాడట. సూర్య బింబం తన పాదాలకింద ఉందా అన్నంతగా వామనుడి రూపం పెరిగింది అంటే ఈ విశ్వానికి ఎల్లలు ఎక్క డున్నాయో మన ఊహలకు ఎలా అందగలదు?

ఎనిమిది వందల కోట్ల మంది మానవులు, ఆ సంఖ్యకు కొన్ని కోట్ల రెట్లు అధికమైన జీవరాశిని మోస్తున్న మన భూమి లాంటివి కొన్ని కోట్లు కలిస్తే ఒక నక్షత్రమండలమట. దాన్ని గెలాక్సీ అని పిలుస్తారు. అలాంటి గెలాక్సీలు కొన్ని కోట్లున్నాయట ఈ విశ్వంలో. మన నక్షత్ర మండలంలో మనకు అత్యంత సమీపాన వున్న నక్షత్రం దగ్గరకు అత్యంత వేగంగా ప్రయాణించే యుద్ధ విమానంలో బయల్దేరితే పది లక్షల సంవత్స రాలకు గానీ చేరుకోలేము. ఒక సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు ప్రసరించే కాంతివేగంతో వెళితే పాల పుంతగా పిలుచుకునే మన గెలాక్సీని దాటడానికి ఒక లక్ష సంవత్సరాలు పడుతుంది. చిన్నతనంలో రాత్రిపూట ఆరుబయట వెల్లకిలా పడుకొని ఆకాశంలోని చుక్కలను లెక్కించడానికి ప్రయత్నించనివారు బహుశా ఎవరూ వుండరు. ఆకాశం దూరమెంత? అనంతకోటి నక్ష త్రాలకు ఆవలితీరంలో ఏముంటుంది? ఈ భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఏవీ లేకుంటే ఏమ య్యేది? ఏమీ లేని శూన్యస్థితిని మనం ఎలా ఊహిం చాలి? ఇలా బుర్ర బద్దలు చేసుకున్న బుద్ధి జీవులు కూడా ఎంతోమంది వుండి వుంటారు.

ఈ భూమ్మీద వున్న కోట్ల రకాల జీవరాశిలో తెలివైన జీవి మానవుడు. తన తెలివితేటలతో మానవుడు భూగోళాన్ని పాదాక్రాంతం చేసుకున్నాడు. భూగోళం లాంటి గ్రహాలు ఈ సృష్టిలో కోట్ల సంఖ్యలో పరిభ్ర మిస్తున్నపుడు అందులో జీవం మనగలిగే అవకాశాలు న్నవి ఎక్కడున్నాయి? మానవుడి లాంటి జీవి లేదా అంతకంటే తెలివైన జీవి ఎక్కడుంది? ఈ అన్వేషణల ఫలితంగా ఉద్భవించిన అంతరిక్షశాస్త్రం ముందున్న ప్రధమ లక్ష్యం మరికొన్ని మానవ ఆవాస యోగ్యమైన గ్రహాలను కనిపెట్టడం. మానవుని స్వార్థం, దురాశల ఫలితంగా పర్యావరణం ధ్వంసమవుతున్న భూగోళం మరికొన్నాళ్ల తర్వాత జీవరాశికి ఆవాస యోగ్యం కాక పోవచ్చు లేకపోతే ఏ భారీ గ్రహశకలమో, తోకచుక్కనో తగిలి భూమిని ధ్వంసం చేయవచ్చు. ‘భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో...’ అంటాడు దాశరథి ఒక అద్భుతమైన గేయంలో. అనంత విశ్వంలోంచి అలా రాలిపడుతున్న గోళ శకలాల్లో భూమివైపు వచ్చే అవకాశం వున్నవి సుమారు 25 వేల వరకు ఉండొచ్చని ‘నాసా’ అంతరిక్ష పరిశోధనకేంద్రం అంచనా. ఇందులో భూమిని పూర్తిగా గానీ, పాక్షికంగా గాని ధ్వంసం చేయగలిగినవి ఏమైనా వున్నాయా అనే అంశంపై నాసాలో పరిశోధనలు జరుగుతున్నవి.

ఈ రెండు కార ణాలవల్ల భవిష్యత్తులో మానవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే విశ్వంలోని ఆవాస యోగ్య గ్రహాలను కనిపెట్టి క్రమంగా విస్తరించాలని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. గ్రహాల్లో వలస రాజ్యాలను స్థాపించడానికి ముందు సమీప భవిష్యత్తులో భూగోళంలోని దేశాల మధ్య యుద్ధాలు జరిగితే అవి అంతరిక్ష యుద్ధాలుగానే ఉండే అవకాశం ఉంది. యుద్ధట్యాంకులు, వైమానిక దాడులకు ఇక క్రమంగా కాలం చెల్లుతుంది. శత్రుదేశాల కమ్యూని కేషన్‌ ఉపగ్రహాల మీద గురిపెట్టి క్షిపణులతో పేల్చగలి గితే చాలు, ఆ దేశపు నవనాడులు కృంగిపోవడం ఖాయం. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏఎస్‌ఏటి)ని ఇటీవలే భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది. భారత్‌తో పాటు అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ప్రస్తుతానికి ఈ శక్తి వుంది.

అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో సాధించిన విజయాల ప్రాతిపదికపై చూస్తే భారత్‌ ఇప్పుడు నాలుగో స్థానంలో వుంది. పురోగమిస్తున్న వేగాన్ని చూస్తే ఈ స్థానం మరింత మెరుగుపడవచ్చు. గణిత, విజ్ఞాన శాస్త్రాల్లో సహజ ప్రతిభావంతులైన భారతీయ బాలబాలికలకు నాణ్యమైన విద్యను, శిక్షణను ఉచితంగా అందించ  గలిగితే ఎందరో విక్రమ్‌సారా భాయ్‌లు, మరెందరో సునీతా విలియమ్స్‌లు భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్ట వచ్చునేమో! అగ్రస్థానానికి చేరుకున్న భారతదేశం, అటు పిమ్మట అనతికాలంలోనే నివాసయోగ్యమైన గ్రహాలను కనిపెట్టి వలసలుగా మార్చుకోవచ్చునేమో! డెబ్బయ్‌ రెండేళ్ల కిందటి వరకు ఈ భూ ప్రపంచంపై ఒక వలస దేశంగా వున్న భారతదేశం మరో డెబ్బయ్యేళ్లకో, వందేళ్లకో విశ్వవేదికపై అగ్రరాజ్యంగా వలస గ్రహాలను పరిపాలించడం ఎంతటి మధురోహ!

ఏమో... ఆ ఊహ నిజమౌతుందేమో! నిన్నటి చంద్రయాన్‌–2 ప్రయోగం ఔననే సంకేతాలనే పంపిస్తు న్నది. చివరి క్షణంలో సిగ్నల్స్‌ నిలిచిపోయినంత మాత్రాన ఈ ప్రయోగం విఫలమైనట్టుగా భావించడం పొరపాటు. నిర్దేశించిన మార్గంలో రవ్వంత తేడా లేకుండా ప్రయాణించి, ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడివడి వేగాన్ని నియంత్రించుకుంటూ చందమామ బుగ్గను ముద్దాడేంత చేరువగా వెళ్లి సంబంధాలను కోల్పోయింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారితే శనివారమనగా ఒంటి గంటా ముప్ఫైఎని మిది నిమిషాలకు ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. ఆఖరి పదిహేను నిమి షాల ఉత్కంఠ ఘట్టం. అందులో 13 నిమిషాలు విక్రమ్‌ ల్యాండర్‌ సజావుగానే కిందకు జారింది.

స్వీయ మేథ స్సుతో అది క్రమంగా తన వేగాన్ని తగ్గించుకున్నది. ఎందుకో ఆఖరి రెండు నిమిషాల్లోనే దాని వేగం నియం త్రణకు లొంగలేదు. అంటే 3,84,000 కిలోమీటర్ల ప్రయాణంలో 3,83,997.9 కిలోమీటర్లు సజావుగా వెళ్లింది. ఇక కేవలం 2.1 కిలోమీటర్లు కిందకు దిగి చంద్రుని ఉపరితలాన్ని సున్నితంగా తాకవలసి వుంది. ఆ సమయంలో అది అదుపు కోల్పోయినట్టు స్పష్టమ వుతున్నది. ఏం జరిగిందో ఇంకా తెలియవలసి వుంది. అదుపుకాని వేగంతో క్రాష్‌ ల్యాండింగ్‌ జరిగి వుండొచ్చు. క్షేమంగా దిగి కూడా ఉండవచ్చునేమో, కమ్యూనికేషన్ల వ్యవస్థలో లోపం ఏర్పడడం వల్ల సంబంధాలు తెగి  పోయి ఉండవచ్చు కూడా. కానీ ఇందుకు అవకాశాలు స్వల్పమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అంతా సజావుగా జరిగితే ఆర్బిటర్, ల్యాండర్, అందులోంచి బయటకు రావాల్సిన రోవర్‌లు అక్కడ 14 రోజులు పనిచేసి తగిన సమాచారాన్ని పంపించి ఉండేవి. ఇప్పుడు ఆర్బిటర్‌ సవ్యంగానే వుంది. భూ కేంద్రంతో నిరంతర సంబంధంలో వున్నది. ఏడాది పాటు అది సంచరిస్తూ చంద్రుడి ఛాయాచిత్రాలను, విలువైన సమాచారాన్ని పంపిస్తుంది. ఆఖరి క్షణంలో ఎదురైన ఆటంకానికి కారణాలను  ఇస్త్రో విశ్లేషిస్తున్నది. మీరు సాధించిన విజయాలు తక్కువేమీ కాదు, ఈ చివరి నిమిషం అడ్డంకిని చూసి నిరాశపడవలసిన అవ సరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తల వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. దేశమంతా అండగా నిల బడింది.

ఈ ఆత్మీయత చాలు, మన శాస్త్రవేత్తలు ఉరిమే ఉత్సాహంతో అతి త్వరలో చందమామపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయడానికి. అసలు చంద్రయాన్‌–2 ప్రయోగమే ఒక సవాల్‌గా ఇస్రో తీసుకున్నది. ఈ ప్రయాణానికి క్రయోజనిక్‌ ఇంజిన్‌ కీలకం. అప్పటికి దాన్ని తయారుచేసే సాంకేతిక సామర్ధ్యం మనకు లేదు. ఇస్తానన్న రష్యా మొండిచేయి చూపింది. అమెరికా ఒత్తిడి కారణంగానే రష్యా మాట తప్పినట్టు తెలిసింది. ఇస్రో శాస్త్రవేత్తలు పట్టుదలతో స్వయంగా ఇంజిన్‌ను తయారు చేసుకున్నారు. ఇంజిన్‌ ఒక్కటే కాదు, ఈ ప్రయోగానికి వాడిన సాంకేతిక పరిజ్ఞానమంతా నూటికి నూరుపాళ్లు స్వదేశీ. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా, ఇప్పటి వరకూ ఎవరూ సాహసించని చంద్రుని దక్షిణ ధృవ మండలం లక్ష్యంగా ప్రయోగించి నూటికి నూరుపాళ్లు కచ్చితత్వంతో దాదాపుగా గమ్యాన్ని తాకించిన శాస్త్రవేత్త లారా సాహో. ఈ మహాయజ్ఞానికి ఇస్రో చేసిన ఖర్చు 142 మిలియన్‌ డాలర్లు. అంటే మన రూపాయల్లో దాదా పుగా వెయ్యి కోట్లు. తెలుగు తమ్ముళ్లు ఒక్క ఏడాదిలో ఇసుకలో నాకేసినంత విలువ కూడా కాదు. బాహు బలి–2 సినిమా కొచ్చిన కలెక్షన్ల కంటే తక్కువ.

‘‘రాశి చక్రగతులలో రాత్రిందివాల పరిణామాలలో, బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో, కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువు సంకల్పంలో ప్రభవం పొందినవాడా! మానవుడా! మానవుడా!’’ అంటాడు శ్రీశ్రీ. అలా ప్రభవించిన మానవుడు వామన మూర్తి లాగా వ్యాపించి, నిరంతరం విస్తరిస్తున్న విశ్వం రహస్యాలను తరుముకుంటూ దిగంతాల దాకా పరు గులు తీసేందుకు సిద్ధం కావాలని, అందుకు తొలి అడుగు భారతీయుడు వేయాలని ఆకాంక్షిద్దాము.

వ్యాసకర్త: వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు