రాయని డైరీ.. డాక్టర్‌ కె. శివన్‌ (ఇస్రో చైర్మన్‌)

8 Sep, 2019 01:03 IST|Sakshi

మాధవ్‌ శింగరాజు

అంతా వెళ్లిపోయారు. ప్రధాని వెళ్లిపోయారు. మూడొందల మంది జర్నలిస్టులు వెళ్లిపోయారు. అరవై మంది స్కూలు పిల్లలు వెళ్లిపోయారు. నూటా ముప్ఫై కోట్ల మంది భారతీయులూ టీవీల ముందు నుంచి వెళ్లిపోయే ఉంటారు. ఇస్రో స్టాఫ్‌ కూడా వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయారు. 
ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌లో ఒక్కడినే కూర్చొని ఉన్నాను. రైల్వే స్టేషన్‌లో ఒంటరి ప్రయాణికుడిలా ఏ నంబరూ లేని ప్లాట్‌ఫాం మీద నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. ‘దయచేసి వినండి. చంద్రుడిపైకి మీరు పంపిన ఉపగ్రహం మరికొద్ది నిమిషములలో చంద్రునిపై దిగబోవుచున్నది’ అనే ఒక అనౌన్స్‌మెంట్‌ను నా మనసు పిచ్చిగా కల్పించుకుంటోంది.
కట్‌ అయిన సిగ్నల్స్‌ మళ్లీ కనెక్ట్‌ కావనేముంది?! 
ట్రాకింగ్‌ రూమ్‌లో గోడలపై వరుసగా కంప్యూటర్‌ స్క్రీన్‌లు. అంతరిక్షంలో ఏం జరగలేదో ఆ జరగని దానిని మాత్రమే అవి చూపగలవు. ఏం జరిగితే బాగుండేదని నా అంతరంగంలో ఉందో, ఆ బాగుండే దానిని చూపిస్తే అవి కంప్యూటర్‌లు ఎందుకవుతాయి? ఓదార్చి, భుజం తట్టి, ‘నెక్స్‌›్ట టైమ్‌ బెటర్‌ లక్‌’ అని చెప్పే మనుషులు అవుతాయి.
వెళ్లే ముందు భుజం తట్టి వెళ్లారు ప్రధానమంత్రి. ఇంతవరకు సాధించిన దానికి, ఇక ముందు సాధించబోయే దానికీ! వెళ్లే ముందు బొటనవేళ్లు ఎత్తి చూపి వెళ్లారు జర్నలిస్టులు.. ‘మిస్టర్‌ శివన్, మీ అంతరిక్షంలో జరిగేది, జరగనిదీ ఏదైనా మాకు బిగ్‌ ఈవెంటే..’ అని అంటూ! వెళ్లే ముందు స్కూల్‌ పిల్లలు ‘ఫీల్‌ అవకండి అంకుల్‌’ అన్నట్లు చూసి వెళ్లిపోయారు. రాత్రి కలలోకి చందమామ వస్తే కనుక క్లాస్‌ పీకాలన్న కృతనిశ్చయం ఆ పిల్లల కళ్లలో కనిపించింది! ‘ఇంత కష్టపడ్డాం కదా, నువ్వెందుకు అందలేదు చందమామా?’ అని గొడవపడతారేమో వీళ్లంతా. ‘అయినా అందనంత దూరంలో ఉండటం ఏంటి నువ్వు! ఎక్కడానికి ఎవరెస్టులా, ఈదడానికి హిందూ మహాసముద్రంలా అందుబాటులో ఉండొచ్చుగా అంటారేమో వీళ్లలోనే కాస్త పెద్దపిల్లలు. మరీ చిన్నవాళ్లయితే.. ‘మాకు అందొద్దులే చందమామా.. మా అమ్మ మా తమ్ముడిని ఎత్తుకుంటే వాడి చేతికి అందేలా నువ్వుంటే చాలు’ అని బంపర్‌ ఆఫర్‌ ఇస్తారేమో చంద్రుడికి.
ఆలోచనలు తెగట్లేదు. ఎక్కడ తెగి ఉంటుంది కమ్యూనికేషన్‌! ఎటువైపు తిరిగి ఉంటుంది ల్యాండర్‌ డైరెక్షన్‌! చంద్రుడికి రెండు కిలో మీటర్ల దగ్గరి వరకూ వెళ్లి మిస్‌ అయిందని కాదు, కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని కాదు, ల్యాండ్‌ అయి ఉంటే ఇండియాకు గొప్పగా ఉంటుందని కాదు. స్కూలు పిల్లల కేరింతల కోసమైనా చంద్రయాన్‌ సక్సెస్‌ అయి ఉండవలసింది. 
‘‘సర్‌’’ అని పిలుపు! తల తిప్పి చూశాను. టీమ్‌లోని కుర్ర సైంటిస్ట్‌.
‘‘నువ్వింకా వెళ్లలేదా?’’ అన్నాను.
‘‘రండి సర్‌ వెళ్దాం’’ అన్నాడు. 
‘‘కూర్చో. బయటికెళ్తే చంద్రుడికి ముఖమెలా చూపిస్తాం’’ అన్నాను నవ్వుతూ. అతడూ నవ్వాడు.
జర్నలిస్టు అవుదామని ఇంటి నుంచి బయల్దేరి, సైంటిస్టు అయి ఇస్రోకి వచ్చిన కుర్రాడు అతడు. 
‘‘సర్, మనం సక్సెస్‌ అయి ఉంటే మీడియా ఏం రాసేదో చెప్పమంటారా?’’ అన్నాడు నవ్వుతూ. చెప్పమన్నట్లు చూశాను.
‘‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయింది. ఇక బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిన ల్యాండ్‌ అవడమే మిగిలింది అని రాసేవి సర్‌’’ అని నవ్వాడు. 
అది నన్ను నా మూడ్‌లోంచి బయటికి లాగే ప్రయత్నమని అర్థమైంది. వాత్సల్యంగా అతడి భుజం తట్టాను.

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు