ఈ నివాళి అద్భుతం

1 Sep, 2019 00:56 IST|Sakshi

జనతంత్రం

‘అదొక వైభవోజ్వల మహాయుగం... వల్లకాటి అధ్వాన్న శకం’. తెన్నేటి సూరి రాసిన రెండు మహా నగరాలు నవల ఈ వాక్యంతో ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్‌ విప్లవంపై చార్లెస్‌ డికెన్స్‌ రాసిన ‘ఎ టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌’ ఇంగ్లిష్‌ నవలకు అది తెలుగు అనువాదం.  'It was the best of times, it was the worst of times' అనే వాక్యంతో ఇంగ్లిష్‌ నవల ప్రారంభమవుతుంది. పదిహేను, ఇరవై ఏళ్లకు పూర్వం భారతదేశపు ఆర్థిక పరిస్థితిపై కూడా ఇలాంటి రెండు భిన్నమైన వాదనల మధ్య వాగ్యుద్ధం జరిగింది. పాలకులు ‘షైనింగ్‌ ఇండియా’ అన్నారు. ప్రతిపక్షం ‘ఫేడింగ్‌ ఇండియా’ అని తిప్పికొట్టింది. భారతదేశం వెలిగిపోతున్నదంటూ అందుకు ఉదాహరణలుగా కొత్తగా ఏర్పాటుచేసిన విశాలమైన జాతీయ రహదారులను, కొత్త ఓడరేవులను, మౌలిక రంగంలో ఏర్పాటుచేసిన కొన్ని కొత్త ప్రాజె క్టులను పాలకులు చూపించేవారు. 

నిజంగానే పట్టణ ప్రాంతాల్లో మెల్లమెల్లగా ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృ తమౌతున్నట్టు కనిపించింది. ఐటీ, ఫార్మా రంగాలు బాగా విస్తరించసాగాయి. ఉపాధి అవకాశాలు ఆ రంగాల్లో పెరిగాయి. అమెరికా సేవలకోసం ఇక్కడ కాల్‌సెంటర్లు పనిచేశాయి. ఇంగ్లిష్‌ వస్తే డిగ్రీ చదివిన పిల్లలకు కూడా వీటిలో ఉద్యోగాలు వచ్చాయి. మొబైల్‌ ఫోన్లు విస్తరించాయి. అరచేతిలోకి ప్రపంచం వచ్చి చేరింది. కొత్తకొత్త షాపింగ్‌ మాల్స్‌ దీపకాంతులతో ధగధగలాడడం మొదలైంది. ఆ దీపాల కింద పరు చుకున్న అధోజగత్‌ నిజరూపాన్ని నియాన్‌ లైట్ల మిరు మిట్లలో పాలకులు చూడలేకపోయారు. అక్కడ ‘పల్లే కన్నీరూ పెడుతుందో... కనిపించని కుట్రల...’ అంటూ ప్రజాకవి గోరెటి వెంకన్న పాట ప్రతిధ్వనించసాగింది. ‘కుమ్మరి వాముల తుమ్మలు మొలిచెను/కమ్మరి కొలి మిల దుమ్ము పేరెను / పెద్ద బాడిశా మొద్దుబారినది/ సాలెల మగ్గం సడుగులిరిగినవి’’ నాటి పల్లెల పరిస్థితిని ఆ ఒక్కపాట కళ్లకు కట్టినట్టు చూపెట్టింది. 

వయసులో వున్న వాళ్లంతా వలసలు పోగా మిగిలిపోయిన ముసలీ ముతకా, ఎవరైనా గంజి కేంద్రం పెట్టకపోతారా అని ఆకలితో ఎదురుచూపులు చూసిన గ్రామాలున్న దురదృ ష్టకర రోజులవి. పేగుబంధాన్ని తెంపేసుకుని వందకూ, యాభైకే పసిబిడ్డలను అమ్ముకోవలసిన దుస్థితిలో గిరిజన తల్లులున్న రోజులవి. చెట్టుకు కట్టిన గుడ్డ ఊయ లలో బిడ్డను పడుకోబెట్టి పాలపీక పెట్టిన కల్లుసీసాను బిడ్డ చేతికిచ్చి పనిలోకి దిగేవారు తల్లులు. కల్లు తాగితే బిడ్డ నిద్రపోతది, లేకుంటే పాలకోసం గుక్కపట్టి ఏడు స్తది. తిండి లేని ఆ తల్లులు బిడ్డలకు పాలివ్వలేని దుర్భరమైన రోజులవి. ఇంటి పెద్దకు ఓ పెద్ద రోగమొస్తే వైద్యం కొనలేని స్థితిలో చావు ఘడియకోసం ఇంటిల్లి పాదీ నిస్సహాయంగా ఎదురుచూడవలసిన దారుణమైన రోజులవి. తెలివితేటలున్నా, చదవాలని వున్నా పది దాటి చదివే స్థోమత లేక ముక్కుపచ్చలారని పిల్లలు కూలిపని కోసం పట్టణాల్లోని అడ్డాల మీద నిలబడిన నిర్భాగ్యపు రోజులవి.

భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల దగ్గరకు కాలినడకన వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి కేంద్రంలోనూ, రాష్ట్రా ల్లోనూ రకరకాల సిద్ధాంతాల ప్రాతిపదికపై ఏర్పడిన రాజకీయ పార్టీలు అ«ధికారంలోకి వచ్చాయి. పేదల సంక్షేమం పేరుతో వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేశాయి. మూడు రాష్ట్రాలను కమ్యూనిస్టులు పరిపాలిం చారు. తొలిరోజుల్లో ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సోషలి స్టులు కూడా అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్, జనతా, నేషనల్‌ ఫ్రంట్, యునైటెడ్‌ ఫ్రంట్, బీజేపీలు చక్రం తిప్పాయి. 

ఎన్ని పార్టీలు పరిపాలిం చినా, ఎన్ని కోట్లు ఖర్చుచేసినా, ఈ కన్నీటి వరదలు ఆగలేదెందుకని? పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్య తలు పారిపోలేదెందుకని? రోగాలతో, రొష్టులతో, ఆకలితో–దప్పులతో అలమటించడం ఇంకెన్నాళ్లు? సుదీ ర్ఘమైన పాదయాత్రలో తాను ప్రత్యక్షంగా విన్న లక్షలాది ప్రజల గుండెచప్పుళ్లలోంచి ఒక సందేశం ఏదో డాక్టర్‌ రాజశేఖరరెడ్డి హృదయాన్ని తాకినట్టుంది. అధికారం  లోకి వచ్చిన తర్వాత ప్రజలకు తక్షణ ఉపశమనం, దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ఎన్నో వినూత్నమైన పథకాలను ఆయన రచించగలిగాడు. ఏ ప్రమాదం జరిగినా, ఫోన్‌ కొడితే చాలు ‘కుయ్‌’ మంటూ ఆపద్బాం ధవి ప్రత్యక్షమయ్యేది. ప్రాణాలు కాపాడేది. ఎంత పెద్ద జబ్బుచేసినా, ఎవరూ భయపడలేదు. వైఎస్సార్‌ ఉన్నాడు, నాకేమిటంటూ పేదవాడు కూడా ధీమాగా కార్పొరేట్‌ ఆస్పత్రి బెడ్‌పై పడుకున్నాడు. పేదింటి బిడ్డలు ఆత్మవిశ్వాసంతో కళాశాలల గడప తొక్కారు. ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించాలంటేనే పంచ వర్ష ప్రణాళికలు వేసుకునే రోజులు. 

కొత్తగా ఒక ప్రాజె క్టును ప్రారంభించడానికి కూడా పాలకులకు గుండె ధైర్యం చాలని రోజులు. ఒక్కపెట్టున దాదాపు వంద ప్రాజెక్టులను స్వప్నించడానికీ, ప్రారంభించడానికీ ఎన్ని గుండెలు కావాలి? ఒక్క వైఎస్సార్‌ గుండెకు అది సాధ్య మైంది. మిగిలిన రాజకీయ నాయకులకు, వైఎస్సార్‌కు ఇక్కడే తేడా ఉంది. ‘సోషల్‌ ఇంజనీరింగ్‌’ ద్వారా అధికారంలో కొనసాగే తత్వం ఇతరులది. ఒక డాక్టర్‌గా ‘సోషల్‌ ట్రీట్‌మెంట్‌’పై శ్రద్ధ చూపే స్వభావం వైఎ స్సార్‌ది. సంక్షేమం, అభివృద్ధి రెండూ వేర్వేరు విషయా లుగా ఆయన పరిగణించలేదు. సంక్షేమాన్ని కూడా ఆర్థిక –సామాజికాభివృద్ధిలో భాగంగా చూసే ఒక విశాల దృక్పథంతోనే విద్య, వైద్యం వంటి ప్రధాన రంగాల్లో పెద్దఎత్తున ‘సామాజిక  పెట్టుబడులు’ వైఎస్‌ ప్రభుత్వం పెట్టగలిగింది. ఈ పెట్టుబడులు భవిష్యత్తులో సమాజా భివృద్ధికి భారీఎత్తున డివిడెండ్లను సమకూర్చగలవన్న ఆయన అంచనా గురితప్పలేదు. 2008–10 నాటి ప్రపం చవ్యాప్త ఆర్థిక మందగమనం ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబ ర్స్‌మెంట్, 108, 104 సర్వీసులు, ఇళ్ల నిర్మాణం, జల యజ్ఞం తదితర పథకాలు సత్ఫలితాలు ఇవ్వడంతో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు వీటిని అధ్యయనం చేసి వెళ్లారు.

మార్క్సిజాన్ని సోషల్‌ సైన్స్‌లా కాకుండా మ్యాథ మెటిక్స్‌లా చదువుకున్న కారణంగా కమ్యూనిస్టు ప్రభు త్వాలు కూడా చేయలేని పనులను మానవీయ దృక్ప థంతో సమాజాన్ని∙అర్థం చేసుకున్న వైఎస్‌ చేయగలి గారు. మార్క్సిజానికి లాటిన్‌ అమెరికన్‌ జాతీయతను అద్దుకున్న వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ పరి పాలనా కాలంలోనే వైఎస్‌ ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చావెజ్‌ జనరంజక పరిపాలన మోడల్‌ ఆయన మరణం తర్వాత కుప్పకూలిపోయింది. ఇప్పుడు వెనిజులా ద్రవ్యోల్బణంతో అధఃపాతాళానికి జారి పోయింది. 

కానీ వైఎస్‌ మోడల్‌ ఇప్పటి ప్రభు త్వాలకు కూడా అనుసరణీయ మోడల్‌గా నిలబడి పోయింది. వైఎస్‌కు దక్కాల్సినంత ఖ్యాతి దక్కకపోవడానికి కారణం ఒక జాతీయ పార్టీలో రాష్ట్ర నాయకుడు కావ డమే. నెహ్రూ ప్రధానిగా వున్న సమయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా వున్న నాయకులందరూ జాతీయోద్యమంలో పాల్గొన్నవారు కనుక వారందరికీ స్వతంత్ర ప్రతిపత్తి, గౌరవం వుండేది. ఇందిరాగాంధీ హయాం నుంచి రాష్ట నేతల ప్రాధాన్యత క్షీణించడం మొదలైంది. సోనియాగాంధీ కాలానికి అది మరింత దిగజారింది. ఇందిరాగాంధీ జమానా తర్వాత స్వతంత్ర ఆలోచనలతో, రాష్ట్రంలో తన సొంత మోడ ల్‌ను అమలుచేసి వెన్నెముకపై నిటారుగా నిలబడిన ఏకైక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. 

ఈ వైఖరి అధిష్ఠాన దేవతలకు నచ్చకపోయినా, విస్మరించ వీలుకానంతటి ప్రజాభిమాన బలం కలవాడు కనుక ఒక రకమైన అసూయగ్రస్థతతోనే వైఎస్‌ స్వతంత్ర వైఖరిని అధిష్ఠానం అంగీకరించవలసి వచ్చింది. ఈ అసూయే వైఎస్‌కు జాతీయస్థాయిలో రావాల్సిన పేరు ప్రఖ్యా తులకు అడ్డుగోడగా నిలిచింది. ఇచ్చిన మాటను నిల బెట్టుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ విక్టోరియా మహా రాణిని ఆమె కోటలోనే సవాల్‌ చేసి రాజీనామా లేఖను గిరాటేసిన వైఎస్‌ వారసుడు, ఇప్పుడు వైఎస్‌ చని పోయిన పదేళ్ల తర్వాత ఆయన అభివృద్ధి మోడల్‌ను మరింత విస్తృతపరిచి, మరింత పదునుతో అమలు చేయడానికి శ్రీకారం చుట్టడం పదవ వర్ధంతి సంద ర్భంగా ఆయనకు లభిస్తున్న అద్భుత నివాళి.

ప్రజా సంక్షేమం, బలహీనవర్గాల అభ్యున్నతికోసం నాన్నగారు ఒకడుగు ముందుకు వేస్తే తాను రెండడు గులు ముందుకు వేస్తానని ఎన్నికల ముందు పలు బహిరంగ సభల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టో అమలుకోసం తేదీలతో సహా షెడ్యూ ల్‌ను విడుదల చేశారు. ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందుగానే బలహీనవర్గాలు, మహిళలు, రైతు కూలీల రాజకీయ–ఆర్థిక సాధికారతకు దోహదపడే విధంగా ఉన్న నవరత్న పథకాలను జగన్‌ ప్రకటించారు. 

వాటిని మరింత మెరుగుపరిచి ఇప్పుడు అమలుచేయబోతు న్నారు. కౌలు రైతులతో సహా సాగు చేసే రైతులకు రైతు భరోసా, పుట్టిన ప్రతిబిడ్డా బడికి వెళ్లడానికి దోహదపడే అమ్మ ఒడి, బీసీ –ఎస్‌సీ–ఎస్‌టీ –మహిళలకు నామినే టెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు, 45 సంవ త్సరాలు నిండిన పేద మహిళలకు ఇచ్చే వైఎస్సార్‌ చేయూత, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేద లందరికీ ఇళ్లు, పింఛన్ల పెంపు, వైఎస్సార్‌ ఆసరా వంటి పథకాల ద్వారా రానున్న ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం లక్షల కోట్ల రూపా యలను పేద–మధ్యతరగతి వర్గాల చేతికి అందజేయ నున్నది. మద్యపాన నియంత్రణ ద్వారా ఇన్నాళ్లుగా మద్యంవల్ల దుర్వినియోగమవుతున్న సొమ్మును ఈ కుటుంబాలు ఇతర అవసరాలకోసం వాడుకోబోతు న్నాయి.

ఆర్థిక మందగమనం ప్రారంభమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రజా సాధికారత ఎంతటి ఉప యోగకరమైనదో ఒకసారి చూద్దాం. ఆర్థిక మందగమనా నికి, ప్రధానంగా నాలుగు లక్షణాలను చెబుతారు. ఒకటి: వినిమయంపై ప్రజలు చేసే ఖర్చు తగ్గిపోవడం, రెండు: ప్రభుత్వం చేసే ఖర్చు తగ్గిపోవడం; మూడు: పెట్టుబడులు తగ్గిపోవడం; నాలుగు: నికర ఎగుమతులు (అంటే దిగుమతులు పోను మిగిలిన) తగ్గిపోవడం.  ఇందులో పెద్ద వాటా ప్రజలు చేసే ఖర్చు. ప్రధానంగా దీనిలోనే ఇప్పుడు తరుగుదల కనబడుతున్నది. 

దీనికి విరుగుడు మంత్రం ప్రజల కొనుగోలు శక్తిని పెంపొం దించడమే. ప్రభుత్వం ద్వారా పేదల చేతికి అందిన డబ్బు దాదాపుగా నూటికి నూరుపాళ్లు చలామణిలోకి వస్తుంది. అంతేకాక, ఆ డబ్బు విలువకు దాదాపు పదిం తలకు పైగా విలువను జీడీపీకి జోడిస్తుంది. అమ్మకాలు– కొనుగోళ్ల ద్వారా ఒక పదిసార్లు మారితే, జీడీపీలో వంద రూపాయల విలువ వెయ్యి రూపాయలవుతుంది. పేద– మధ్యతరగతి ప్రజలకు మిగులు ఉండదు కనుక వారి చేతికి వచ్చిన డబ్బు కనీసం పదింతలై ఆర్థిక వ్యవస్థను ఉద్దీపనం చేస్తుంది. 

అక్రమ సంపాదనపరుల సొమ్ములో సింహభాగం ఆఫ్రికా భూముల్లోకి, ఇండోనేషియా గను ల్లోకి, స్విట్జ ర్లాండ్‌ బ్యాంకుల్లోకి పారిపోతుంది. లేదా ఇనప్పెట్టెల్లో దాక్కుంటుంది. స్థానికంగా చలామణి కాని ఆ డబ్బు మార్చురీలోని శవంతో సమానం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పెద్ద కాంట్రాక్టుల రివర్స్‌ టెండరింగ్‌ ఫలితంగా శవాల కంపు కొంత తగ్గవచ్చు. ఆర్థిక మందగమనాలపై, మాంద్యాలపై పోరాడగల బ్రహ్మాస్త్రం మనవూరి ‘సంత రూపాయే’. రూపాయిని జనం చెంతకు చేర్చేటందుకు తొలి అడుగు వేసిన వైఎస్సార్‌కు అంజలి. మలి అడుగు వేస్తున్న వైఎస్‌ జగన్‌కు విజయోస్తు.


వ్యాసకర్త: వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా