‘చేతి’వాటమున్నా రక్షణ బాగే

25 Nov, 2017 02:07 IST|Sakshi

జాతిహితం

మోదీ ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో ముందంజలో ఉంటుందని అంతా ఊహించారు. అయితే ఇంతవరకు ఆయన ప్రభుత్వం దిగుమతి చేసుకోదలిచినవి 36 రాఫెల్స్‌ మాత్రమే. వీటి దిగుమతుల కోసం చర్చలు జరిగినది యూపీఏ హయాంలోనే. రక్షణ పరికరాల సేకరణ, లోపాల సవరణ వరకు మూడున్నరేళ్ల మోదీ బ్యాలెన్స్‌ షీట్‌ ఖాళీగానే ఉంది. మనోహర్‌ పారికర్, అరుణ్‌ జైట్లీ, నిర్మలా సీతారామన్‌ రక్షణమంత్రులుగా వచ్చినప్పటికీ రక్షణ కొనుగోళ్లు చేయడానికి వెనుకాడడం, దృష్టి పెట్టకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.

మరో సాయమేదీ లేకుండా ఎన్నికలలో విజయం సాధించిన ఘనతను చరిత్రలో నమోదు చేసుకున్నది బొఫోర్స్‌ గన్‌ ఒక్కటే. ఈ యంత్రాంగం వెనుక ఎవరో ఒకరు ఉన్నారని అనడం మనకీ ఇష్టమే కాబట్టి, ఆ విషయం పరిగణనలోకి వస్తుంది. ఆ వ్యక్తి వీపీ సింగ్‌. లక్ష్యం గుండా చూస్తే ఆయనే కనిపిస్తారు. 1988లో అలహాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో వీపీ సింగ్‌ గెలుపొందారు. అప్పుడే రాజీవ్‌గాంధీని శంకరగిరి మన్యాలు పట్టిస్తానన్న తన సవాలు అమలుకు శ్రీకారం చుట్టారాయన. అలహాబాద్‌ గ్రామీణ ప్రాంతాలలో మోటార్‌సైకిల్‌ మీద ప్రయాణిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ఆగి సూటిగా మాట్లాడేవారు. ఆయన సందేశం సాధారణమైనదే. మీ ఇళ్లు దోపిడీ అయిపోతున్నాయి! ఎలా అంటారా? మీరు ఓ బీడీ కట్ట లేదా అగ్గిపెట్టె కొంటారు. అందులో కొన్ని అణాలు పన్ను పేరుతో ప్రభుత్వం దగ్గరకు చేరతాయి. ప్రభుత్వం ఆస్పత్రులు నడిపినా, పాఠశాలలు నిర్వహించినా ఆఖరికి మీ సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేసినా ఆ పన్ను ద్వారా వసూలు చేసిన డబ్బుతోనే. కానీ మీరు ప్రభుత్వానికి చెల్లించిన ఆ డబ్బులో కొంత అపహరణకు గురవుతున్నది. దీనిని మీరు ఇల్లును దోచేయడం అనక ఇంకేమంటారు? ఈ మాటలతో పాటు ఆయన జత చేసిన ఇంకో రెండు అంశాలు మినహాయిస్తే అంతవరకు బాగానే ఉంది. ఆ రెండు అంశాలలో మొదటిది– మామూలుగా రాజకీయ పరిధిలో ఉపయోగించే అతిశయోక్తే– బొఫోర్స్‌ చోరుల జాబితా నా కుర్తా జేబులోనే ఉంది. నేను అధికారంలోకి వచ్చేదాకా వేచి చూడండి ఏం జరుగుతుందో! అనేవారు. రెండో అంశం: తమకు ఇచ్చిన తుపాకులు వెనుక నుంచి పేలుతున్నాయని మన సైనికులు అవాక్కయ్యేవారు. శత్రువులకు బదులు తమనే చంపుతున్నాయని బిత్తరపోతున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి మాటలను ఎవరూ నమ్మరు. కానీ ఈ మాటలతో ప్రజలు బాగా వినోదించేవారు.

బొఫోర్స్‌ రగడ
మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. బొఫోర్స్‌ ముడుపుల కేసులో ఎవరినీ పట్టుకోలేదు. ఎవరికీ శిక్ష కూడా పడలేదు. కానీ అప్పుడు దర్యాప్తు పేరుతో బయటకు వచ్చిన కథలన్నీ కాలగర్భంలో కలిశాయి. ఆ గన్‌ మాత్రం చాలా బాగా పనిచేసింది. కార్గిల్‌ ఘర్షణ సమయంలో భారత్‌కు పరువు దక్కిందంటే బొఫోర్స్‌ గన్‌ వెనక్కి పేలడం వల్ల కాదు. ఇప్పటికీ ప్రధానంగా ఉపయోగపడుతున్న ఆయుధం అదే. అయితే, ఈ ముప్పయ్‌ ఏళ్లలో ఒక్క బొఫోర్స్‌ తుపాకీ కొనుగోలు కోసం కూడా మళ్లీ ఆర్డర్‌ వెళ్లలేదు. ఇటీవల కాలంలో ధనుష్‌ వంటి తుపాకుల తయారీకి ప్రయత్నాలు చేసినా, ఒక్క తుపాకీ కూడా తయారుచేసుకోలేదు. బొఫోర్స్‌ సృష్టించిన గలభా అలాంటిది.

అసలు భారతదేశ రక్షణ కొనుగోళ్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఉల్లిపాయలు దొంగతనం చేస్తూ పట్టుబడిన పల్లెటూరి మూఢుడి కథలా ఉంటుంది. ఎలాంటి శిక్ష కావాలో నీవే తేల్చుకొమ్మని పంచాయతీ చెప్పింది. ఆ శిక్షలు– వంద చెప్పుదెబ్బలు తినడం, లేదా వంద ఉల్లిపాయలు తినడం. ఈ మూఢుడు మొదట వంద ఉల్లిపాయలు తిని శిక్షని అనుభవిస్తానని చెప్పాడు. కానీ పది తినేసరికే ఘాటుకు తట్టుకోలేకపోయాడు. మళ్లీ తూనాబోడ్డు, చెప్పుదెబ్బలే తింటానన్నాడు. పది దెబ్బలు పడేసరికి తట్టుకోలేక, లేదు లేదు ఉల్లిపాయలే తింటానన్నాడు. అలా, అవి కాదని ఇవి, ఇవి కాదని అవి – మొత్తానికి రెండు శిక్షలు అనుభవించాడు. 1977 తరువాత రక్షణ పరికరాల సేకరణలో భారత్‌ అనుసరించిన తీరుతెన్నులను చెప్పడానికి ఈ కథ సరిగ్గా సరిపోతుంది. ఆ సంవత్సరాన్ని మైలురాయిగా తీసుకోవడం ఎందుకంటే, దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడినది అప్పుడే. అలాగే భారత్‌ సోవియెట్‌ రష్యా ఆయుధాలే కాకుండా ఇతర దేశాల ఆయుధాలు తీసుకోవడం మొదలుపెట్టినది కూడా అప్పుడే.

జనతా ప్రభుత్వం అన్వేషించిన తొలి ఆయుధ వ్యవస్థ ఆంగ్లో–ఫ్రెంచ్‌ జాగ్వార్‌. కానీ, వైరి సంస్థల ఏజెంట్లు వార్తలు పుట్టించడంతో ముడుపులు చేతులు మారాయంటూ వెంటనే గోల మొదలయింది. అప్పుడే గ్రీన్‌ హౌస్‌ జర్నలిజం పుట్టుకొచ్చింది కూడా. రక్షణ కొనుగోళ్ల గురించి వార్తలు రాయడమే గ్రీన్‌హౌస్‌ జర్నలిజం. జాగ్వార్‌ కూడా వివాదాస్పదంగా మారింది. దాని శక్తి సామర్థ్యాలను గురించి మొదట్లో ఊహించిన స్థాయికి అది ఏనాడూ చేరలేదు. ఇలాంటి వ్యవస్థకు సంబంధించినంత వరకు శక్తిసామర్థ్యాలతో ఉన్న విమానం ఏదీ అని అడిగితే ఐఏఎఫ్‌ 100 – ప్లస్‌ జాగ్వార్‌ అనే సమాధానం. ఈ నాలుగు దశాబ్దాల తరువాత కూడా దీని ఘనతను ఇది నిలుపుకుంటూనే ఉంది.

ఇందిర అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ సోవియెట్‌ రష్యా దగ్గర కొనుగోళ్లు ప్రారంభించారు. మళ్లీ రాజీవ్‌గాంధీ అధికారంలోకి వచ్చి సమీకరణలలో గణనీయంగా మార్పులు తెచ్చే వరకు ఇదే కొనసాగింది. ఈ విషయం ఇప్పుడు ఘనంగా చెప్పవలసినదేమీ కాదు. కానీ బొఫోర్స్‌ తరం ఆగ్రహానికి గురి కావలసి వస్తున్నా, నేను కచ్చితంగా చెప్పే వాస్తవం ఒకటి ఉంది. మన చరిత్రలో త్రివిధ దళాల ఆధునీకరణ ప్రయత్నమంటూ జరిగినది– ఇందిర–రాజీవ్‌ల హయాములలోనే. స్థూల దేశీయోత్పత్తిలో రక్షణ బడ్జెట్‌ కేటాయిం పులు నాలుగు శాతానికి మించినది వారి పాలనా కాలంలోనే. మామూలుగా ఈ కేటాయింపు రెండు శాతం, అంతకంటే తక్కువగా ఉండాలన్నది నియమం. రాజీవ్‌ ఫ్రాన్స్‌ నుంచి మిరాజ్‌ –2000 విమానాలు, స్వీడన్‌ నుంచి బొఫోర్స్‌ శతఘ్నులు, మిలన్, మాట్రా (ఫ్రెంచ్‌)ల నుంచి క్షిపణులు, జర్మనీ నుంచి టైప్‌–209 తరహా జలాంతర్గాములను కొనుగోలు చేశారు. అయితే ప్రతి కొనుగోలు మీద ఏదో రూపంలో కుంభకోణం ఆరోపణ వచ్చింది. దీనితో ప్రతి ఆయుధ వ్యవస్థ కొనుగోలు ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోయింది. వాస్తవానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలీ చేసుకోలేదు. ఇతర దేశాలతో కలసి ఉత్పత్తి సాగించలేదు. సంతృప్తికరమైన స్థాయి రక్షణ సామర్థ్యాన్ని గుర్తించే యత్నమే కనిపించదు. అయితే సోవియెట్‌ రష్యా నుంచి కూడా రాజీవ్‌ పెద్ద ఎత్తున రక్షణ కొనుగోళ్లు చేశారు. బీఎంపీ యుద్ధ వాహనాలు, కొత్త కిలో జలాంతర్గాములు, అణు జలాంతర్గామిని (మొదటి చక్ర) లీజుకు తీసుకున్నారు. వీటన్నిటికీ ఆయన చెల్లించిన మూల్యం, తాను అధికారం కోల్పోవడం. ఈ కొనుగోళ్లలో ముడుపులు చేతులు మారాయని నేను పందెం వేసి మరీ చెబుతాను. కుంభకోణాలున్నాయని కూడా అంటాను. కానీ ఈ చేదు నిజం ఉన్నప్పటికీ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు భారత్‌ కనుక యుద్ధానికి వెళితే, యుద్ధరంగంలో అధికంగా కనిపించే ఆయుధాలు ఇందిర, రాజీవ్‌ పాలనా కాలాలలో దిగుమతి చేసుకున్నవే అయి ఉంటాయి. లేదంటే పీవీ నరసింహారావు కాలంలో దిగుమతి చేసుకున్నవయినా అయి ఉంటాయనడం వాస్తవం.

నిస్తేజంగా బీజేపీ హయాం
ఇదొక నిష్టుర సత్యం. ఇది మనసులను గాయపరుస్తుంది కూడా. రక్షణ పరికరాల సేకరణలో బీజేపీ ప్రభుత్వం రికార్డు అత్యంత నిరాశాజనమైనది. యుద్ధ సమయంలో అత్యవసరంగా చేసినవి తప్ప, శవపేటికల కొనుగోళ్ల కుంభకోణం (ఇది పూర్తిగా ఊహాజనితమైనది) దెబ్బ తగిలిన వాజపేయి చేసిన కొనుగోళ్లు చాలా తక్కువ. మోదీ ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో ముందంజలో ఉంటుందని అంతా ఊహించారు. అయితే ఇంతవరకు ఆయన ప్రభుత్వం దిగుమతి చేసుకోదలిచినవి 36 రాఫెల్స్‌ మాత్రమే. వీటి దిగుమతుల కోసం చర్చలు జరిగినది మాత్రం యూపీఏ హయాంలోనే. రక్షణ పరికరాల సేకరణ, లోపాల సవరణ వరకు పరిశీలిస్తే మూడున్నరేళ్ల మోదీ బ్యాలెన్స్‌ షీట్‌ ఖాళీగానే ఉండిపోయింది. మనోహర్‌ పారికర్, అరుణ్‌ జైట్లీ, నిర్మలా సీతారామన్‌ రక్షణమంత్రులుగా వచ్చినప్పటికీ రక్షణ కొనుగోళ్లు చేయడానికి వెనుకాడడం, దృష్టి పెట్టకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. రాఫెల్‌ దిగుమతికి బీజేపీ ప్రభుత్వం సంతకాలు చేసిన ఒప్పందం కూడా ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. ఇది మోదీని అశాంతికి గురి చేయవచ్చు. నేను గాని, నా ప్రభుత్వం గాని ఎలాంటి తప్పు చేయలేదని (నేనుగాని, నా కుటుంబ సభ్యులు గాని ఎలాంటి తప్పు చేయలేదని రాజీవ్‌ చెప్పినట్టు కాకుండా) మోదీ ధైర్యంగా అనగలరా? సు–30 విమానాలు 20 ఏళ్ల క్రితానివి. అంటే భారత వైమానికి దళం ప్రాధాన్యం లేని శక్తిగా మారుతుంది. మిగిలిన రెండు దళాల విషయంలో కూడా ఆయన శ్రద్ధ చూపాలి. రాఫెల్‌ మీద జరుగుతున్న చర్చ కూడా పాత పంథాలోనే సాగుతోంది. ఇందులో మరీ హాస్యాస్పదమైన అంశం ఏమిటంటే సాంకేతిక పరిజ్ఞానం బదలీ అన్నమాట.

ఆరు దశాబ్దాలుగా, హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, ఇతర రక్షణకు చెందిన ప్రభుత్వరంగ సంస్థలు అనేక సాంకేతిక విజ్ఞాన బదలీలతో దిగుమతి చేసుకున్న వ్యవస్థలను ఒకచోట చేర్చి కూర్చాయి. అయినప్పటికీ ఒక్క హెలి కాప్టర్‌ని మినహాయిస్తే, ఈ సూక్ష్మబుద్ధితో కూడిన సాంకేతిక విజ్ఞాన బద లీలలో ఏ ఒక్కదాన్నయినా ఉపయోగించి మనకు ఉపయోగపడగల ఏ వ్యవస్థనూ ఇవి తయారు చేయలేకపోయాయి. ఉదాహరణకు, ఇన్‌ఫాంట్రీ రైఫిల్స్, భుజాన ఉంచుకుని కాల్పులు జరిపే లేదా మ్యాన్‌–ప్యాడ్‌ క్షిపణులు, పొరలుపొరలుగా ఉండే జాకెట్లు, ఇతర ప్రాధమిక సామగ్రి కొనుగోలు కోసం కోసం మనం ఇప్పటికీ ఆర్డర్‌ చేస్తున్నాం, రద్దు చేస్తున్నాం. బహుశా రాజీవ్‌ గాంధీ చేపట్టిన సాహసంతో కూడిన నిర్ణయాలను మోదీ చేపట్టి, 1980ల నాటి స్పర్థ కోసం రక్షణరంగ ఆధునీకరణను ప్రారంభించవచ్చు. లేదా బల గాల స్థాయి క్షీణిస్తున్న నేపథ్యంలో, జీ జిన్‌పింగ్, జనరల్‌ క్వామర్‌ బజ్వాలను పిలిపించి, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌ సమస్యను పరిష్కరించుకుని, మిగిలిన భారత్‌ రక్షణకోసం, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ లాగా, అమెరికన్‌/ నాటోతో ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆవిధంగా జీడీపీలో 1 శాతానికి భారత రక్షణ రంగ బడ్జెట్‌ను పరిమితం చేయవలసి ఉంటుంది.

అలాంటి పరిస్థితుల్లో ఆ ఒక్క శాతం కూడా ఎందుకు? ఎందుకంటే దేశం లోపలి మావోయిస్టులతో మీరు పోరాడాల్సి రావచ్చు. మరికొంత మొత్తాన్ని రిపబ్లిక్‌ డే పెరేడ్‌ల కోసం, సైనిక స్థావరాల్లో మంత్రులు తమ వారాంతపు ఫొటోలు దిగడానికి ఖర్చుపెట్టవలసి ఉండవచ్చు.


- శేఖర్‌ గుప్తా

వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

మరిన్ని వార్తలు