‘ప్యాకేజీ’ పాపాల భైరవుడు బాబే!

14 Jun, 2018 01:26 IST|Sakshi

అవినీతికి తలుపులు మూసి, గొళ్లెం పెట్టి, అన్ని రంగాల్లో అభివృద్ధి, ఉద్యోగ ఉపాథులకు రాచబాట వేసేది హోదా. కాగా, అవినీతికి వాకిలి తెరిచి, అభివృద్ధి కుదింపునకు అవకాశమిచ్చేది ప్యాకేజి. కేంద్రం తొలుత హోదా ఇస్తానన్నా హోదా వద్దని ప్యాకేజీయే కావాలని బాబు ఎందుకు పట్టుబట్టి తెచ్చుకున్నారో, ప్యాకేజీని ఇచ్చిన కేంద్రమే ఆ ప్యాకేజీని పూర్తిగా ఇవ్వకుండా కొద్దికొద్దిగా ఇస్తూ, బిగిస్తూ వస్తోందో కాస్త ఆలోచిస్తే ప్యాకేజీ మతలబు ఏంటో అర్థమవుతుంది.

పోలవరం నిర్మాణానికి రూ, 16 వేల కోట్లు ఖర్చవుతుందని, దాన్ని తామే భరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని విద్యుత్, తాగునీటి కల్పన ఖర్చును మాత్రమే ఏపీ ప్రభుత్వం భరించాలని కేంద్రం అతి స్పష్టంగా చెప్పినప్పటికీ, డబ్బు ఇస్తే తామే నిర్మించుకుంటామని కేంద్రంపై ఒత్తిడి పెట్టి మరీ సాధించుకున్న బాబు తర్వాత ఆ ప్రాజెక్టు అంచనాలను యాభైవేల కోట్లకు పైగా పెంచేసి కేంద్రం ఇస్తే కమీషన్లు గుంజాలని యుక్తి పన్నారు. అశాస్త్రీయ అంచనాల ప్రకారం డబ్బు ఇవ్వడం కుదరదని, అడగకుండా డబ్బు ఇచ్చేస్తూ పోతే జనం దృష్టిలో తాము దోషులమవుతామని కేంద్రం లెక్కలు అడగటంతోనే బాబు యూటర్న్‌ తీసుకుని హోదాయే సంజీవని అనేరీతిలో మళ్లీ డొల్లదీక్షలకు దిగారు. రాజధాని నిర్మాణ ఖర్చు విషయంలోనూ కేంద్రం అంచనాల కన్నా నాలుగైదు రెట్లు పెంచేయడం, తాత్కాలిక భవనాలకు వందల కోట్లు ఖర్చుపెట్టడం, రాజధాని ప్రాంత భూముల్ని సింగపూర్‌కు చెందిన మరో ‘బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ’కి అభివృద్ధి పేరిట అప్పనంగా అప్పగించ డం వంటివి కేంద్రానికి భయం పుట్టించి ఏపీకి నిధుల విడుదలలో ఆచితూచి అడుగులు వేసేటట్టు చేస్తుండటానికి అసలు కారకుడు చంద్రబాబే.

ఇప్పటికైనా రాజధాని పేరుతో త్రీడీ సినిమాలు చూపించడం మాని తొలి నుంచి హోదాకై నిత్యం పోరాడుతున్న వైఎస్‌ జగన్‌లాగా కృషి చేస్తే ముగిసిపోయిన అంశం అన్న ప్రభుత్వం కానీ మరో ప్రభుత్వం కానీ హోదాను ఇచ్చి తీరుతాయి. జన ఆకాం క్షకు, దాని లక్ష్య సాధనకు కృషి చేసే నాయకునికి విజయమే ఫలితంగా ఉంటుంది.
డాక్టర్‌ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, రిటైర్డ్‌ ప్రొఫెసర్, చరిత్రశాఖ, ఎస్వీ యూనివర్సిటీ
మొబైల్‌ : 98495 84324 

మరిన్ని వార్తలు