ఇలాంటి చదువులు మారాలి

2 Mar, 2018 01:00 IST|Sakshi

మన రుగ్మత పట్ల, మన ఇక్కట్లు, సమస్యల పట్ల విశ్వవిద్యాలయాలు స్పందించాలి. మన అవరోధాలను గమనిస్తూనే మన సమస్యలను పరిష్కరించడానికి అవి ఉపకరించాలి. మన విద్యా ప్రావీణ్యాన్ని విదేశీ సంస్థలు అంచనా వేయడం కాదు. దానికి ఆ సంస్థలు కితాబులు ఇవ్వడం కాదు. మన సామాజిక అవసరాల పట్ల, ప్రజలు ఉన్న పరిస్థితులకు ఎలా స్పందించాయి అన్న అంశమే ఆ పరిశోధనలకు గీటురాయి కావాలి. మనవైన పద్ధతులను అవగతం చేసుకోవడానికి ఆ పరిశోధనలు ఎలా సహకరిస్తున్నాయన్నదే ప్రమాణం కావాలి.

విద్యను భారతీయం చేయడమనే విషయం గురించి నాలుగేళ్లలో మనం చాలా చర్చలు జరిపాం. కానీ బధిరుల సంభాషణ మాదిరిగా ఒకరి మాటతో ఒకరికి సంబంధం లేని విధంగా ఆ చర్చలు సాగాయి. ప్రభుత్వంలో ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు విద్యను భారతీయం చేయడం గురించే అడపాదడపా ఏదో ఒక ప్రతిపాదన ముందుకు తెస్తూ ఉంటారు. ఆ ప్రతిపాదన తెలిసీ తెలియని వారు చేసినట్టు, తెలివితక్కువగా ఇంకా చెప్పాలంటే వినాశకరంగా కూడా ఉంటుంది.

అలాంటి ప్రతిపాదనలను విద్యావేత్తలు, మేధావులు, విధాన రూపకర్తలు సహజంగానే అవహేళన చేస్తూ ఉంటారు. దీనితో ప్రభుత్వం ఏవో పైపై మెరుగులు దిద్ది ఊరుకుంటుంది. అక్కడితో ఆ సంగతి అంతా మరచిపోతారు కూడా. ఆఖరికి విమర్శకులు కూడా అలా మరచిపోయినవారిలో ఉంటారు. చివరికి తేలేదేమిటంటే ఎలాంటి అర్థవంతమైన చర్చకు చోటు ఉండదు.

పడిపోతున్న ప్రమాణాలు
విద్యావంతుడని చెప్పే ఒక వ్యక్తిని కలుసుకుంటే చాలు, విద్యను భారతీయం చేయడం గురించి చర్చించడం ఎంత అవసరమో మనం వెంటనే గ్రహించగలుగుతాం. దేశంలో ఉత్తమ విశ్వవిద్యాలయాలని పేర్గాంచిన వాటి నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్క గ్రాడ్యుయేట్‌ అయినా కూడా ఏ భారతీయ భాషనూ చదవలేడు. ఆ భాషలో రాయలేడు. మన భాషలలో వచ్చిన అపార ఆధునిక సాహిత్యం గురించి వారికి చాలా తక్కువ మాత్రమే తెలుసు.

ఇంగ్లిష్‌ కాకుండా, భారతీయ భాషలలో ఒక పుస్తకం చదవడం, లేదా ఒక వ్యాసం రాయడం ఆఖరిసారిగా ఎప్పుడు జరిగిందని బాగా పేరున్న ఓ మేధావిని అడగండి! అటు నుంచి వచ్చే సమాధానం చాలా ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. సంస్కృత భాషకు చెందిన ప్రముఖ అధ్యయన కేంద్రాలన్నీ భారతదేశానికి వెలుపలే ఉన్నాయి. ఒక్క భాషల విషయమే కాదు. విద్యావంతుడైన ఆధునిక భారతీయుడు మన పురాణాల మీద చాలా తక్కువ పరిజ్ఞానం మాత్రమే కలిగి ఉంటున్నాడు. ఆయుర్వేదం, యునానీ వైద్య విధానాలు నిరర్థకమని తర్ఫీదు పొందిన ఒక అల్లోపతి వైద్యుడు భావిస్తూ ఉంటాడు.

రంగుల అద్దకంలో, నేత కళలో మనకున్న ఘనత గురించి వస్త్ర పరిశ్రమకు చెందిన ఇంజనీర్‌కు కూడా పరిజ్ఞానం ఉండదు. మంచి విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలని మనమంతా చెప్పుకుంటున్న చోట బోధిస్తున్న పాఠ్య ప్రణాళిక ఏది? అదంతా కొన్నేళ్ల క్రితం అమెరికా, యూరప్‌లో ఉపయోగించి వదిలేసిన పనికిమాలిన పాఠాల అనుకరణే. సాంస్కృతికంగా ఉండవలసిన ఆత్మ విశ్వాసం లోపిస్తున్నది. మన విద్యా విధానం సాంస్కృతిక నిరక్షరాస్యులను తయారుచేస్తున్నది. వారి సొంత గడ్డ మీద వారే అపరిచితులు.

కాబట్టి అసలైన చర్చ మనం నిజంగా వాంఛించవలసినది విద్యను భారతీయం చేయడం అనే అంశం గురించి కాదు. మన విద్యా విధానాన్ని ఎలా భారతీయం చేయడం అనేదే అసలు చర్చనీయాంశం కావాలి. కానీ సమస్య ఏమిటంటే, విద్యను భారతీయం చేయాలంటూ ఊరూవాడా ఏకం చేస్తున్నవారు ఎవరూ కూడా ఆ అంశం గురించి మాట్లాడడానికి కనీసం అర్హత ఉన్నవారు కాదు.

అటు విద్య గురించి, ఇటు భారతీయ సంస్కృతి గురించి మాట్లాడడానికి కూడా వారు అర్హత ఉన్నవారు కారు. ఇంకా, బోధన విషయంలో వారు మరీ నిరక్షరాస్యులు. మన సంస్కృతి, మేధోపరమైన మన సంప్రదాయాల గురించి కూడా వారికి పైపైన మాత్రమే అవగాహన ఉంది. విద్యను ఎలా భారతీయం చేయకూడదో వారిని చూసి నేర్చుకోవచ్చు.

నిజానికి విద్యను భారతీయం చేయడమంటే అర్థం, భారతీయమైనదని చెప్పుకునే ప్రతి అంశాన్ని ఆకాశానికి ఎత్తడం మాత్రం కాదన్నది సుస్పష్టం. భారతీయం అంటే సాధారణంగా భావించే సంప్రదాయాల గురించి, మరీ ముఖ్యంగా గ్రంథస్థమైనదీ, బ్రాహ్మణవాద సంప్రదాయాన్ని చెప్పేదీ మాత్రమే కాకూడదు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చేరిన జ్ఞానం గురించి పట్టించుకోకుండా మనకి మనం దూరంగా ఉండిపోవడం కాదు. మన సంప్రదాయంలో ఒక శాఖలా ఉన్న శ్రుత పాండిత్యంతోనే అంతా చెప్పడమూ కాకూడదు.

మన భాషల పట్ల శ్రద్ధ అవసరం
విద్యను భారతీయం చేయడమనే ఎజెండా పట్ల దీక్షతో ఉంటే అందులో మొదట ఉండవలసినది– ప్రాంతీయ భాషల పట్ల శ్రద్ధ. అలా అని ప్రపంచ స్థాయి అవకాశాలకు దగ్గర చేసే ఇంగ్లిష్‌ భాష నుంచి పిల్లలను దూరం చేయనక్కరలేదు. కానీ మన చిన్నారులకు ఇంగ్లిష్‌ మాధ్యమంతో విషయాన్ని బోధించే పద్ధతి మాత్రం అశాస్త్రీయం, అవాంఛనీయం.

మాతృభాషలో బోధన జరగడమనే మంచి సూత్రాన్నీ, బహు భాషలు నేర్చుకునే అవకాశం కల్పించే త్రిభాషా బోధన సూత్రాన్నీ పునరుద్ధరించాలి. దీనితో పాటు సంస్కృతం, తమిళం, పర్షియన్‌ వంటి పురాతన హోదా కలిగిన భాషల బోధనకీ, నేర్చుకోవడానికీ జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కల్పించాలి. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాలను మన భాషలలోకి అనువదించుకునే కృషిలో మనం వెనకబడిపోకూడదు. ప్రతి భారతీయుడు ఒక భారతీయ భాషలో అనర్గళంగా మాట్లాడేటట్టు, తడబాటు లేకుండా రాయగలిగేటట్టు చేయగలగాలి.

భారతీయ మేధా సంప్రదాయాలను వివరించగలిగే సామర్ధ్యాన్ని సాధించుకోవడం కూడా విద్యను భారతీయం చేయడమనే ప్రక్రియలో తప్పనిసరిగా ఉండాలి. దేశంలోని ప్రతి విద్యార్థి అన్ని ప్రాంతాలకూ అన్ని మతాలకూ చెందిన పురాతన గ్రంథాల నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి. గణతంత్ర భారతానికి పునాదిగా ఉన్న గడచిన రెండు శతాబ్దాల నాటి భారతీయ చింతనను కూడా అధ్యయనం చేయాలి. ఈ సాంస్కృతిక, సాహిత్య అంశాలే కాకుండా, ప్రతి శాఖకు చెందిన పరిజ్ఞానం ద్వారా మన మౌఖిక, గ్రాంథిక సంప్రదాయాల నుంచి మనం ఏమి గ్రహించామో ఎవరికి వారు తెలుసుకునేటట్టు ఉండాలి.

అంటే తరగతి గదిలో చెప్పే పాఠాలకే పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయిలో అనుభవజ్ఞుల ద్వారా కూడా వాస్తవిక అంశాలను తెలుసుకోవడమే దీని వెనుక ఉన్న పరమార్థం. ఇంజనీర్లు కుమ్మరులతో మాటామంతీ జరపాలి. శిల్పులు, బావులూ చెరువులూ తవ్వేవారు, చేనేత పనివారిని కూడా ఇంజనీర్లు కలుసుకోవాలి. ఔషధి గుణాలు కలిగిన మొక్కలను సేకరించేవారితో వైద్యులు ముచ్చటించాలి. సంప్రదాయకంగా ఉండే రోగ నివారణ పద్ధతులను గురించి తెలుసుకోవాలి. దేశవాళీ విత్తనాలను సేకరించేవారి, దేశీయమైన విధానాలను ఆవిష్కరించేవారి అనుభవాల నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు పాఠాలు నేర్చుకోవాలి.

దేశీయమైన ఆలోచనలకు ప్రాధాన్యం
వీటన్నిటితో పాటు విజ్ఞాన కేంద్రాలలో భారతీయమైన వాతావరణాన్ని నెలకొల్పడం కూడా విద్యను భారతీయం చేయడంలో భాగమవుతుంది. ఈ ఆఖరి సందర్భంలో విషయం భాష కాదు. మన ప్రశ్నలకు సమాధానాలను వెతకడం కోసం మనం ఉపయోగిస్తున్న వనరులు కూడా విషయం కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఎలాంటి ప్రశ్నలను మనం అడగాలి? ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎవరి గురించిన ప్రశ్నలు అడగాలి? ఇప్పుడు మన జ్ఞానకేంద్రాలలో పెద్ద సమస్య ఒకటి ఉంది. అది– ఎవరివో అవసరాలకు స్పందిస్తూ, వేరే ఎవరివో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం.

మన మేధాశక్తి అంతా ఇలాగే కాలం గడుపుతోంది. ఇలాంటి ధోరణిని పూర్తిగా మార్చివేయడం కూడా విద్యను భారతీయం చేయడమనే ప్రక్రియలో ప్రధానంగా ఉండాలి. పరిశోధన, నేర్చుకోవడం, బోధనాంశాల ఎజెండా మార్పులో కూడా ఆ ధోరణి అనివార్యమవుతుంది.ఒక సాధారణ భారతీయుడి అవసరాలు తీర్చడం ఎలాగో నిర్వచించడం గురించే వైద్య, వ్యవసాయ, ఇంజనీరింగ్, లేదా ఐటీ రంగాలలోని సరికొత్త పరిశోధనలన్నీ వాటి ధ్యేయంగా ఎంచుకోవాలి. సామాజిక శాస్త్రాలు, హ్యుమానిటీస్‌ రంగంలో జరిగే పరిశోధన వర్తమానానికి తగినట్టు ఉండాలి.

అమెరికా, యూరప్‌ దేశాల పరిశోధనల నిబంధనలలో కూరుకుపోకుండా చరిత్రాత్మకమైన మన పరిశోధన పంథాను అర్థవంతం చేయాలి. మన రుగ్మత పట్ల, మన ఇక్కట్ల పట్ల, మన సమస్యల పట్ల విశ్వవిద్యాలయాలు స్పందించాలి. మన అవరోధాలను గమనిస్తూనే మన సమస్యలను పరిష్కరించడానికి అవి ఉపకరించాలి. మన విద్యా ప్రావీణ్యాన్ని విదేశీ సంస్థలు అంచనా వేయడం కాదు.

దానికి ఆ సంస్థలు కితాబులు ఇవ్వడం కాదు. మన సామాజిక అవసరాల పట్ల, ప్రజలు ఉన్న పరిస్థితులకు ఎలా స్పందించాయి అన్న అంశమే ఆ పరిశోధనలకు గీటురాయి కావాలి. మనవైన పద్ధతులను అవగతం చేసుకోవడానికి ఆ పరిశోధనలు ఎలా సహకరిస్తున్నాయన్నదే ప్రమాణం కావాలి.
ఇలాంటి వాదన చాలామంది ఆధునిక, బాగా చదువుకున్న భారతీయుల మనసులను అశాంతికి గురి చేయవచ్చు.

ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవలసిందే. ఆధునికత అంటే ఎవరినో అనుకరించడం కాదు. ఎవరున్న సంకట స్థితి నుంచి వారిని తప్పించడానికి కొత్త పరిష్కారాలను అన్వేషించడమే ఆధునికత అంటే. విశ్వవ్యాప్తం కావడం గురించిన తృష్ణ రూపురేఖలు లేని స్థితి నుంచి ఆరంభం కాదు. దీనితో అందరూ ఏకీభవించకపోవచ్చు. అయినా కానీ విద్యను భారతీయం చేయడం గురించి మనం లోతైన చర్చను లేవదీయలేమా?

యోగేంద్ర యాదవ్‌
వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యులు
మొబైల్‌ : 98688 88986 

మరిన్ని వార్తలు