ఉభయతారకం, శుభదాయకం

30 Jun, 2019 03:29 IST|Sakshi

త్రికాలమ్‌

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పక్కపక్కన కూర్చొని వివాదాలను  సామరస్య ధోరణిలో, ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పరిష్కరించుకుందామని సంకల్పం చెప్పుకోవడం చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత అయిదేళ్ళు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల పాలకుల మధ్య సుహృద్భావం కరువై సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. నదీజలాల వివాదాల సంగతి సరేసరి. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పున ర్మిర్మాణ చట్టం అమలులోకి వచ్చి అదే సంవత్సరం జూన్‌ 2న రెండు రాష్ట్రాలూ ఏర్పడిన తర్వాత విభజన తాలూకు గాయాలు మానడానికి కొంత సమయం అవసరమనే సంగతి ఊహించిందే. కానీ రాజకీయ నాయకత్వాల మధ్య అవగాహన లేక, సంఘర్షణాత్మక వైఖరినే ప్రజలు మెచ్చుతారనే ఆలోచనతో కలహానికి కాలు దువ్వారే కానీ సఖ్యతకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఓటుకు కోట్ల కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘మీకు పోలీసు ఉంది, మాకూ పోలీసు ఉంది. మీకు ఏసీబీ ఉంది మాకూ ఏసీబీ ఉంది,’ అంటూ విజయవాడ వెళ్ళి కృష్ణానదీ గర్భంలో అక్రమ కట్టడంలో నివాసం కుదుర్చుకున్నప్పటి నుంచీ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పెరిగాయే కానీ తరగలేదు.

విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉండగా నదీజలాల వివాదాలలో పీటముళ్ళు పడి దాయాదుల పోరును తలపిం చడం విషాదం. విడిపోయి కలిసి ఉందామనే నినాదం అర్థరహితంగా మారిన పరిస్థితులు తెలుగువారికి బాధ కలిగించాయి. అవిభక్త రాష్ట్రానికి కృష్ణా జలాల కేటాయింపులో బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యూనల్‌ 2013 నవంబర్‌ 29న  ఇచ్చిన అంతిమ తీర్పుపైన సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలూ అదే ట్రిబ్యూనల్‌ ఎదుట  తమతమ వాటాల విషయంలో వాదులాడు కున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమకు నీరు తరలిం చరాదనీ, చెన్నైకి తెలుగుగంగ ద్వారా పంపేందుకు 1,500 క్యూసెక్కులు మాత్రమే వినియోగించుకోవాలనీ తెలంగాణ వాదించింది. కానీ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి మిగులు జలాలను వినియోగించే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించింది.  పోలవరం నిర్మాణానికి తెలంగాణ అభ్యంతరం చెబితే కాళేశ్వరంను ఆంధ్రప్రదేశ్‌ తప్పుపట్టింది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణాబేసిన్‌లోకి ఎత్తిపోసే 45 టీఎంసీల గోదావరి నీటిలో తెలంగాణ వాటా ఇవ్వాలని కోరింది. అట్లా అడిగే పక్షంలో తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే 214 టీఎంసీల గోదావరి నీటిలో తమకూ వాటా ఉంటుందంటూ ఆంధ్రప్రదేశ్‌ ఎదురు వాదించింది. ఎంత నీరు కేటాయించినా వినియోగించుకునే వ్యవస్థ లేనప్పుడు కీచులాడుకొని ఏమి ఫలితం? 

ఖడ్గచాలనం కాదు, కరచాలనం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మే 30న ప్రమాణం చేసిన సభలో అతిథిగా పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కీసీఆర్‌) రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా ‘ఖడ్గచాలనం కాదు, కరచాలనం’ జరగాలంటూ హితవాక్యం పకలడంతో వాతావరణం మారి పోయింది. కృష్ణా, గోదావరీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలకు తరలించేందుకు ఎటువంటి పథకాలు రచించాలో సమాలోచన చేయాలన్న సద్భావన ఫలితంగానే శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, మంత్రులూ, ఉన్నతాధికారులూ చర్చలు ప్రారంభించారు. ఘర్షణ వల్ల ప్రయోజనం లేదు. 1996లో కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టును అడ్డుకునేందును అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్ళి హడావిడి చేయడం, ప్రాజెక్టు ఆపకపోతే ఢిల్లీలోదేవెగౌడ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామంటూ బెదిరించడం వల్ల ఫలితం లేకపోయింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన మహారాష్ట్ర వెళ్ళి, ధర్నా చేసి, అరెస్టు తర్వాత ఔరంగాబాద్‌ జైలులో కొన్ని గంటలు గడిపినా ప్రయోజనం శూన్యం. ఇటువంటి చర్యలు రాజకీయ ప్రచారానికీ, ఏదో చేస్తున్నామని ప్రజలను నమ్మించేందుకూ ఉపయోగపడతాయి కానీ సమస్యను పరిష్కరించజాలవు. 1996 తర్వాత అధికారంలో 2004 వరకూ ఉన్నప్పటికీ ఆల్మట్టిని ఆపేందుకు చంద్రబాబు చేసిన గట్టిప్రయత్నం ఏమీలేదు.

 ఆ ఎనిమిదేళ్ళూ ఢిల్లీలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభు త్వాలు ఉన్నా, బీజేపీ నాయకత్వంలోని  నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌ డీఏ) సర్కార్‌ ఉన్నా, చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారంటూ తెలుగువారు చంకలు గుద్దుకున్నా ఒరిగింది ఏమీ లేదు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సైతం ఆ ఒక్క నిరసన ప్రదర్శన తర్వాత కొనసాగింపు చర్యలు లేవు. ఎగువ రాష్ట్రాలలో జరిగే నిర్మాణాలను ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా అడ్డుకోవడం ముఖ్యమంత్రులకైనా, ప్రతిపక్ష నాయకులకైనా సాధ్యం కాదనే విషయం స్పష్టంగా తెలిసివచ్చింది. నదీజలాల వివాదాలపై న్యాయస్థానాలలో, ట్రిబ్యూనళ్ళలో మొత్తం 350 పిటిషన్లు ఈ రోజుకూ అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో కొన్ని మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ట్రిబ్యూనళ్ళ చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ, కేంద్ర జలవనరుల మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ  పరిష్కారాలు ప్రసాదించమంటూ ప్రాధేయపడటం కంటే ఇరుగుపొరుగు ముఖ్యమంత్రులు స్నేహపూరిత వాతావరణంలో కలుసుకొని జనహితమే పరమావధిగా సమాలోచనల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవడం శ్రేయ స్కరమని కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనను బేషరతుగా ఆమోదించవలసిందే. జగన్‌ చేసిన పని అదే. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలను వారు పరిరక్షించుకుంటూనే ప్రజలకు మేలు జరిగే విధంగా నదీ జలాలను సద్వినియోగం చేసుకొని భూములను సస్యశ్యామలం చేయగలిగితే అంతకంటే కావలసినది ఏమున్నది? 

కృష్ణాకటాక్షం లేదు
కృష్ణానదిపైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు బరాజులు నిర్మించిన కారణంగా దిగువన ఉన్న  తెలుగు రాష్ట్రాలకు వచ్చే నీటి పరిణామం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ప్రతి సంవత్సరం గోదావరి (దక్షిణగంగ) నదికి వరదలు వచ్చి వెయ్యి నుంచి మూడువేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నది. కొన్నేళ్ళుగా కృష్ణానదికి వరద రానే లేదు. మిగులు నీరు లేదు. ప్రకాశం బరాజ్‌ నుంచి కిందికి వదలి సముద్రంలోకి పంపవలసిన 16 టీఎంసీల నీరు  కూడా అందుబాటులో ఉండటం లేదు. కృష్ణాకటాక్షం లేకుండా పోతున్నది కనుకనే వృధాగా సముద్రంలోకి పోతున్న సుమారు 3,000 టీఎంసీల గోదావరి నీటినీ ఒడిసిపట్టుకొని పంటపొలాలకు మళ్ళించాలన్న మహాసంకల్పం ఉభయ తారకమైనది. అవశ్యం ఆచరణయోగ్యమైనది.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం క్రమంలో కేసీఆర్‌ ముంబైకి వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సంప్ర తింపులు జరిపి ఉభయులకూ సంతృప్తికరమైన పరిష్కారం కుదుర్చుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌తో పాటు ఫడ్నవీస్‌ కూడా హాజరు కావడం మూడు రాష్ట్రాల మధ్య బలపడుతున్న మైత్రికి నిదర్శనంగా చెప్పు కోవచ్చు. కాళేశ్వరం వల్ల మహారాష్ట్రకు కూడా ప్రయోజనమేనంటూ ఫడ్నవీస్‌ హర్షం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గట్టిగా కోరుకుంటున్న ప్రత్యేక హోదాకు తాను అభ్యంతరం చెప్పబోననీ, తమ ఎంపీలు ఆ డిమాండ్‌ను పార్ల మెంటులో బలపర్చుతారనీ కేసీఆర్‌ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును ప్రశ్నించబోమని స్పష్టం చేశారు. దీనికి అభ్యంతరం చెబుతూ తెలంగాణ ఇదివరకు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించు కుంటామనీ, అవసరమైతే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు జరిపి ఆయనను కూడా పోలవరం ప్రాజెక్టుకు ఒప్పిస్తాననీ కేసీఆర్‌ చెప్పడం విశేషం. ప్రాంతీయ సహకార స్ఫూర్తితో వాస్తవాల ప్రాతిపదికగా సమాలోచనలు జరిపినప్పుడు న్యాయమైన ప్రతిపాదనలను ఏ ముఖ్యమంత్రి అయినా అంగీ కరించే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్ర ప్రజలకు మేలు జరగరాదని ఏ ముఖ్య మంత్రికీ ఉండదు. అవగాహన లేక, సంయమనం లేక, నేర్పులేక ఘర్షణ వాతా వరణం కల్పించుకోవడం,  కేసులు పెట్టుకోవడం ఉత్తమమైన రాజకీయం కాదని రాష్ట్రాధినేతలు గ్రహించడం మంచి పరిణామం.

కాళేశ్వరం, పోలవరం భారీ ప్రాజెక్టులు. వేలకోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న ఈ రెండు ప్రాజెక్టులూ తెలంగాణ, ఆంధ్రప్రజలకు ప్రాణాధారాలు. రెండు ప్రాజెక్టులకూ కేంద్రం అవసరమైన అను మతులన్నిటినీ మంజూరు చేసింది. ట్రిబ్యూనళ్ళూ, న్యాయస్థానాల ప్రమేయం లేకుండా, కేంద్ర నాయకుల మధ్యవర్తిత్వం లేకుండా ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయగలిగితే ఇద్దరు ముఖ్యమంత్రులూ చరితార్థులు అవుతారు. సమావేశంలో ప్రతిపాదించినట్టు గోదావరినీటిని శ్రీశైలం జలాశయానికీ, నాగార్జునసాగర్‌ జలాÔ¶ యానికీ రోజుకు చెరి రెండు టీఎంసీల వంతున నీరు చేర్చగలిగితే కృష్ణానది కరుణించకపోయినా, గోదావరి జలాలతో తెలుగు ప్రజల హృదయాలు పులకిస్తాయి. నదీ జలాలను సాధ్యమైనంత తక్కువ వ్యయంతో గరిష్ఠంగా వినియోగించుకునే మార్గాలను అన్వేషించవలసిందిగా ఉభయ రాష్ట్రాల అధికారులను ముఖ్యమంత్రులు ఆదేశించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్‌ శాఖలకు చెందిన ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు వెంకటేశ్వరరావు, మురళీధర్‌లు ఇతర అధికారులతో సమాలోచన జరిపి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. 

5 ప్రత్యామ్నాయాలు 
మొత్తం అయిదు ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయి. 1. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టుకు రీఇంజనీరింగ్‌ చేయడం. గోదావరి జలాలను టెయిల్‌పాండ్‌లోకి కాకుండా నేరుగా నాగార్జునసాగర్‌కు తరలించి, అందులో సగం ఉపకాలువ ద్వారా శ్రీశైలం జలాశయానికి తరలించడం. 2. అకినేపల్లి నుంచి శ్రీశైలంకూ, దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌కూ శ్రీశైలానికీ గోదావరి నీరు మళ్ళించడం. 3. రాంపూర్‌ నుంచి గోదావరి జలాలను నేరుగా నాగార్జునసాగర్‌లోకీ, అక్కడి నుంచి ఉపకాలువ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకూ తరలించడం. 4. ఇంద్రావతి కలిసిన తర్వాత మేడిగడ్డకు దిగువన,  తుపాకుల గూడెం ఎగువున ఉన్న ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించి సగం నీటిని సాగర్‌లోకీ, మిగిలిన సగం నీటిని ఉపకాలువ ద్వారా శ్రీశైలంలోకీ మరలించడం. 5.  పోలవరం నుంచి మున్నేరు మీదుగా పులిచింతలకూ, నాగా ర్జునసాగర్‌కూ ఎత్తిపోయడం. అభయారణ్యాలను కాపాడుతూ, పర్యావరణాన్ని రక్షిస్తూ కాలువలు నిర్మించాలని కూడా ముఖ్యమంత్రులు సూచించారు. నీటి వినియోగం ఆధారంగా దామాషా పద్ధతిలో ఖర్చు భరించాలనే ప్రతిపాదన ఉంది. కృష్ణా–గోదావరి అనుసంధానం రెండేళ్ళలోగా పూర్తి కావాలని ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆకాంక్షించారు. కృష్ణా, గోదావరి జలాలలో నాలుగు వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేయాలన్న ఆకాంక్ష నెరవేరితే తెలుగు రాష్ట్రా లలో ప్రతి అంగుళంలోనూ కోనసీమ ప్రతిఫలిస్తుంది.  జులై 15 కల్లా ప్రాథమిక నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రులు ఆదేశించారు. ఆ నివేదికను పరిశీలించి కార్యాచరణకు పూనుకునేందుకు ఆం్ర«దప్రదేశ్‌లో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులూ సమావేశం కావాలని నిర్ణయించారు. 

విభజన తర్వాత తలెత్తిన విభజన అంశాలలో అత్యంత ముఖ్యమైనవి నదీజలాల వివాదాలు. ఆ తర్వాత విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్‌ కింద 89 సంస్థలనూ, పదో షెడ్యూల్‌ కింద 107 సంస్థలనూ విభజించవలసి ఉంది. మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అటు తెలంగాణ సర్కార్‌తోనూ, కేంద్రంతోనూ సత్సంబంధాలు లేవు కనుక ఈ కసరత్తు ప్రారంభం కాలేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణం చేసిన తర్వాత ఆయన కోరిన విధంగా ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్రను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పైకి పంపేందుకు కేసీఆర్‌ అంగీకరించారు. అదే విధంగా హైదరాబాద్‌ సచివాలయంలో నిరుపయోగంగా పడి ఉన్న గదులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు జగన్‌ సమ్మతించారు. ఎవ్వరికీ నష్టం లేని విషయాలలో అనవరమైన పట్టింపులకు పోయి రాద్ధాంతం చేయకుండా చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం అభినందనీయమైనది. ఇలాగే సహకరించుకుంటూ ప్రగతిబాటలో కలసికట్టుగా సాగితే తెలుగువారి భవిష్యత్తు దేదీప్యమానంగా ఉంటుంది. ఇదే సుహృద్భావం అవిచ్ఛిన్నంగా కొనసాగేందుకు తెలుగువారు అందరూ శక్తివంచనలేకుండా పాటుపడాలి.

కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు