అయేషా మీరా హత్య కేసు విచారణకు సిట్‌ ఏర్పాటు

19 Jan, 2018 13:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసు పునర్విచారణకు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ దర్యాప్తు బాధ్యతను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు పర్యవేక్షణలోనే ఈ విచారణ జరగాలని సూచిస్తూ, దర్యాప్తు పూర్తి చేసి ఏప్రిల్‌ 28లోగా తొలి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసును విచారణ చేస్తున్న సిట్‌ అధికారులను న్యాయస్థానం అనుమతి లేకుండా బదిలీ చేయరాదని ఆదేశించింది. విశాఖ డీఐజీ శ్రీకాంత్‌ నేతృత్వంలో ఏర్పడ్డ సిట్‌లో సభ్యులుగా హైమవతి, లక్ష్మీ, షెహెరున్నీసా బేగం కొనసాగనున్నారు.

కాగా కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్‌లో 2007 డిసెంబర్‌లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి.

హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్‌ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించింది. కాగా హైకోర్టు తాజా నిర్ణయంపై అయేషా మీరా తల్లిదండ్రులు, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు