రైతులకు అవసరమైన ఎరువులు అందించాలి | Sakshi
Sakshi News home page

రైతులకు అవసరమైన ఎరువులు అందించాలి

Published Sat, Nov 18 2023 1:58 AM

యడ్లపాడులోని గోదాములో ఉన్న ఎరువుల నిల్వలను తనిఖీ చేస్తున్న అధికారులు  
 - Sakshi

యడ్లపాడు: విత్తనం మొదలు పంట విక్రయం వరకు రైతులకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ సచివాలయం(ఎరువుల విభాగం) డెప్యూటీ డైరెక్టర్‌ జి.వెంకటేశ్వర్లు చెప్పారు. ఎరువులు తనిఖీ రాష్ట్ర అధికారుల బృందం శుక్రవారం యడ్లపాడు గ్రామాన్ని పరిశీలించారు. స్థానిక గ్రామ సచివాలయం– 1 పరిధిలోని ఆర్‌బీకేను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత కియోస్కో ద్వారా నిర్వహించిన ఎరువుల లభ్యత, విక్రయాలు, ప్రస్తుతం అందుబాటులో నిల్వలు, అమ్మకాల రికార్డుల్లో వాటి నమోదు విషయాలను గురించి వీఏఓలను అడిగి తెలుసుకున్నారు. నేరుగా రైతుల ఖాతాలకు సడ్సిడీ వర్తింపజేసే (డీబీటీ) ఆన్‌లైన్‌లోని జాబితాలను పరిశీలించారు. గోదాముల్లోని ప్రస్తుత ఎరువుల నిల్వ సరిచూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల పరిధిలో సీజన్‌ల వారీగా రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలకు అనుగుణంగా ఎరువులు అందించేలా చూడాలన్నారు. నిల్వల్లో వ్యత్యాసాలు లేకుండా ఎప్పటికప్పుడు రికార్డుల సక్రమంగా చూసుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన మేరకు ఎరువులను సకాలంలో తెప్పించి వారికి అందించడంలో సిబ్బంది చొరవ చూపాలన్నారు. ఎరువులకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సచివాలయం(ఫర్టిలైజర్‌ సెక్షన్‌) ఏడీఏ రాజన్‌, ఏఓ జి.సురేష్‌రెడ్డి, పల్నాడు జిల్లా ఏడీఏ సీహెచ్‌ రవికుమార్‌, యడ్లపాడు ఏఓ సీహెచ్‌ సరిత ఉన్నారు.

వ్యవసాయ శాఖ డెప్యూటీ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు యడ్లపాడు ఆర్‌బీకే ఆకస్మిక తనిఖీ

Advertisement
Advertisement