జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు

18 Nov, 2023 01:58 IST|Sakshi
మాట్లాడుతున్న ఐ అండ్‌ పీఆర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌

ఏఎన్‌యూ: జర్నలిజంలో గడిచిన మూడు దశాబ్ధాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఐ అండ్‌ పీఆర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అన్నారు. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఎవల్యూషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ ఇన్‌ లాస్ట్‌ ఫ్యూ డికెట్స్‌ అనే అంశంపై కిరణ్‌ కుమార్‌ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో న్యూస్‌కు బదులుగా వ్యూస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇది జర్నలిజానికి సరితూగదని కేవలం న్యూస్‌కి జర్నలిజం, పత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జర్నలిజం అభివృద్ధిలో ఎంతో ప్రాముఖ్యత నెలకొందని, సాంకేతికత పరమైన అంశాలలో దినదినాభివృద్ధి జరుగుతుందని వివరించారు. పత్రికలు, పాత్రికేయుల్లో కూడా అభివృద్ధిని అందిపుచ్చుకొని విస్తృత కృషి చేయాలని సూచించారు. గతంలో ఏదైనా వార్తలు రావాలంటే కేవలం పత్రికల్లో మాత్రమే వచ్చేవని నేడు అది రూపాంతరం చెంది సోషల్‌ మీడియా పేరిట తన స్వరూపాన్ని మార్చుకుందని చెప్పారు. దీంతో ప్రతి ఒక్కరూ జర్నలిజం చేసే వీలును ఈ సాంకేతికత మార్పు కల్పించిందని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజమని నమ్మవద్దని వాటిని పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రతి చర్య ఉండాలని సూచించారు. కొన్ని సందర్భాలలో చాలా సున్నిత అంశాలు కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా సోషల్‌ మీడియా ఉంటుందని దానిని గమనించాల్సిన అవసరం ఉన్న పాత్రికేయులకు, రాబోవు తరానికి ఎంతో అవసరం అన్నారు. డెవలప్‌మెంట్‌ జర్నలిజంలో ఎక్కువ స్కోపు ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజా సంబంధాలు సమాచార సేకరణ విషయాలలో సంస్థల్లో పని చేసే ప్రజా సంబంధాల అధికారులు ప్రభు త్వ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కేవలం సంస్థ మనుగడకు వారు కృషి చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని వివరించారు. కార్యక్రమానికి జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ జి.అనిత అధ్యక్షత వహించారు. అధ్యాపకులు డాక్టర్‌ జ్యోతిర్మయి, డాక్టర్‌ కె.మధుబాబు, డాక్టర్‌ మాణిక్యరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు