మెనూ చార్ట్ ఇదే...అమలు పరచండి

24 Jul, 2015 03:12 IST|Sakshi
మెనూ చార్ట్ ఇదే...అమలు పరచండి

* 2015-16కు సంబంధించి పాటించాలని జిల్లాల్లోని హాస్టళ్లకు ఆదేశం
* మెనూ చార్ట్‌ను సమీక్షించాలని కలెక్టర్లకు సూచన

సాక్షి,హైదరాబాద్ : వెనుకబడిన తరగతులకు చెందిన ప్రీ -మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి (2015-16) సంబంధించి అమలుచేయాల్సిన మెనూచార్ట్‌ను ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ మేరకు సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ సమయాల్లో హాస్టళ్లలో అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆయా ఆహారపదారా్థుల గురించి అందులో వివరించారు.

ఈ మెనూను అమలుచేయాలని అన్ని జిల్లాలకు  ఆ చార్ట్‌ను బీసీసంక్షేమశాఖ పంపించింది. దీన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు జిల్లా బీసీ సంక్షేమాధికారులతో సమీక్షించి, ఆయా జిల్లాల అవసరాలకు అనుగుణంగా  మార్పులు చేసుకోవచ్చునని సూచించింది. కొత్త విధానం ప్రకారం ప్రీమెట్రిక్ హాస్టళ్లకు సంబంధించి రోజుకు ఒక్కో విద్యార్థికి బియ్యం 400 గ్రాముల చొప్పున, పామాయిల్,పప్పులు,ఉప్పు, చింతపండు, కోడిగుడ్లు,పండ్లు,స్వీట్లు ఇతరాలు కలుపుకుని రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.27 వరకు ఖర్చు అవుతుందని లెక్క కట్టారు.

పెద్దక్లాసుల విద్యార్థులకు నెలకు రూ. 850 వంతున, చిన్నక్లాసుల విద్యార్థులకు నెలకు రూ.750 వంతున కలుపుకుని సరాసరి రూ.810 వరకు అంచనావేశారు. ఇక పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు రోజుకు ఒక్కొక్కరికి రూ.35 చొప్పున ఖర్చు అవుతుందని, ఈ విధంగా ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,050 చొప్పున వ్యయం అవుతుందని పేర్కొన్నారు.
 
ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రీ మెట్రిక్ హాస్టళ్లలోని విద్యార్థులకు సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6.30 గంటలకు రాగిమాల్ట్ (పాలతో), అల్పాహారంగా ఒక్కోరోజు ఉప్మా,కిచిడీ, పులిహోర, ఇడ్లీని ఏదైనా ఒక పండుతో పాటు ఇవ్వాలి. స్కూళ్లలోనే మధ్యాహ్నభోజనం అందుబాటులో ఉన్నందున ఆదివారం మాత్రం హాస్టళ్లలో రైతాతో పాటు ఎగ్ బిరియానీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాస్టల్‌లోనే మధ్యాహ్నభోజనం అమలు చేయాలి. సాయంత్రం పల్లీ లడ్డు, శెనగగుగ్గిళ్లు, బిస్కెట్లు, 30 గ్రాముల బొబ్బర్లు, ఉలవలు పెట్టాలి. రాత్రి  అన్నం,సాంబారు, ఒకకూర,పెరుగుతో పాటు శనివారం మినహా అన్ని రోజులు కోడిగుడ్డు పెట్టాలి.
 
పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో ..
అన్ని జిల్లాల్లోని పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లలో సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 6.30 గంటలకు తేనీరు, టిఫిన్‌గా ఉప్మా చెట్నీ,కిచిడి చెట్నీ, పులిహోర, టమా ట రైస్, పులగం వంటివి ఇవ్వాలి. మధ్యాహ్నభోజనం కింద అన్నం,సాంబారు, ఆకుకూరలు, ఆదివారాలు పెరుగుపచ్చడితో పా టు ఎగ్ బిరియానీ పెట్టాలి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు హాస్టల్‌లోనే మధ్యాహ్నభోజనం పెట్టాలి. రాత్రి భోజనంలో  సోమవారం నుంచి ఆదివారం వరకు అన్నం, ఆకుకూర, రసం,పెరుగు, ఆదివా రం మినహా కోడిగుడ్డు పెట్టాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు