విరిగిన మనసులు కలవవు: హరీశ్

26 Jul, 2015 02:51 IST|Sakshi
విరిగిన మనసులు కలవవు: హరీశ్

సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రాలో పాలన చేతగాక, తెలంగాణ ప్రభుత్వంతో పోటీ పడలేక చంద్రబాబు తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటున్నడు. హైదరాబాద్‌వాసులు మధ్యాహ్నం వరకు నిద్రలేవరంటూ అవమానకరంగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు ప్రజలు మళ్లీ కలుస్తారని అంటున్నడు. పగిలిన అద్దం, విరిగిన మనసు ఎన్నటికీ కలవవు. ఆంధ్రా నేతలు, వారి పాలనపై ప్రజల మనసు ఎప్పుడో విరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కబంధ హస్తాల నుంచి తెలంగాణ టీడీపీ నేతలు బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు’ అని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మున్సిపల్ చైర్మన్ రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు శారద, పద్మశేఖర్, కృష్ణయ్య, రమేశ్‌నాయక్‌తోపాటు పలువురు టీడీపీ నేతలు శనివారం తెలంగాణ భవన్‌లో డిప్యూటీ సీఎం మహ మూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎస్.నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టొద్దంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశాడు.

వంద మంది బాబులు వచ్చినా పాలమూరు పథకం ఆగదు. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. భూసేకరణకు రూ.300 కోట్లు విడుదల చేశాం’ అని తెలిపారు. ‘పాలమూరు జిల్లాలో తాగడానికి కూడా నీళ్లు లేవు. కానీ పట్టిసీమ లాంటి అక్రమ ప్రాజెక్టులతో నీళ్ల దోపిడీకి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. పాలమూరు అభివృద్ధిని అడ్డుకునే టీడీపీలో నిజమైన తెలంగాణ బిడ్డలు కొనసాగలేరు. ఆత్మగౌరవంతో ఉందాం... పాలమూరు హక్కులను కాపాడుకుందాం’ అంటూ హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
 
సిద్ధంగా ఉండు: జగదీశ్‌రెడ్డి
‘మూడేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తే సీఎం కేసీఆర్ కాళ్లు కడుగుతానని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ మహిళా నేత ఒకరు అన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కాళ్లు కడిగేందుకు సిద్ధంగా ఉండాలి’ అని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు