సీఎం భార్య.. సాధారణ మహిళలా..!

23 Jul, 2015 00:07 IST|Sakshi
చింతమడక ఎస్‌బీహెచ్ (గతంలో తమ ఇల్లు)ను పరిశీలిస్తున్న కేసీఆర్ సతీమణి శోభ

సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సతీమణి శోభ బుధవారం తమ సొంతూరు మెదక్ జిల్లా చింతమడకలో సాధారణ మహిళలా కలియతిరిగారు. కనిపించిన వారినల్లా ఆత్మీయంగా పలకరించారు. వారితో పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆమె తీరుతో గ్రామస్తులు పులకించిపోయారు. చింతమడక గ్రామానికి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శోభ.. తమ బంధువులతో కలసి గతంలో ఉన్న ఇంటిని, తమకున్న స్థలాలను పరిశీలించారు. గ్రామంలో కేసీఆర్‌కు ఉన్న స్థలాల్లో ఎస్‌బీహెచ్ బ్యాంక్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పశువైద్యశాలలను ఏర్పాటు చేశారు.

కేసీఆర్ ఇంటి స్థలంలో ప్రస్తుతం ఉన్న ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లోకి శోభ వెళ్లగానే అక్కడే గోడకు ఉన్న అత్తమామలైన కల్వకుంట్ల వెంకటమ్మ, రాఘవరావుల చిత్రపటానికి దండం పెట్టారు. బ్యాంక్‌లో ఉన్న గదులు చూస్తూ.. అందులో ఉన్నప్పుడు ఏ గదిలో ఏముండేదో గుర్తు చేసుకుంటూ పక్కనే ఉన్న బంధువులకు చెప్పారు. అదే విధంగా గ్రామంలోని ఆయా స్థలాల్లో ఎవరు ఉంటున్నారని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కేసీఆర్ తల్లిదండ్రుల స్మారకార్థ్ధం నిర్మించిన కేవీఆర్‌ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణను పరిశీలించారు. మధ్యాహ్న భోజన వంటలు చేస్తున్న లక్ష్మిని పేరు పెట్టి పిలిచి బాగున్నారా అని పలకరించారు. ‘మంగమ్మ లేదా?’ అంటూ ఆరా తీశారు.  
 
పాఠశాలలో నీళ్ల వసతి ఉందా?

కేసీఆర్ సతీమణి శోభ కేవీఆర్‌ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోకి వెళ్లి పాఠశాలలో నీళ్ల వసతి ఉందా అని పాఠశాలలో వంట చేసేవారిని అడిగారు. ఈ సందర్భంగా వారు నీళ్లు సరిగ్గా రావడంలేదు.. బయట నుంచి పైపులైన్ ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పారు. పాఠశాల ఆవరణలో నీళ్ల ట్యాంక్ ఉందనగా, దానికి కనెక్షన్ లేదని వారు బదులిచ్చారు. గ్రామంలో కనిపించిన వృద్ధులను, తెలిసిన వారిని పేరు పెట్టి పలకరించడంతో వారంతా సంతోషంలో మునిగారు.
 
దశ దినకర్మలో..
సిద్దిపేట మండలం చింతమడకలో కేసీఆర్ వదిన సుభద్ర మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం దశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శోభ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబీకులతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. దశ దినకర్మ కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు ఆమె సుమారు ఐదు గంటల పాటు గ్రామంలోనే ఉన్నారు.

మరిన్ని వార్తలు