'ఆయన తిన్నది ప్రభుత్వ సొమ్మేగా...'

14 Oct, 2015 14:19 IST|Sakshi

మెరకముడిదాం: ఉపాధి హామీ కూలీల కోసం తెచ్చిన నిధుల్లో రూ.11 లక్షలను ఓ పోస్ట్ మాస్టర్ పక్కదారి పట్టించగా దాన్ని సమర్థిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ‘ పోస్ట్ మాస్టర్ మింగింది ప్రభుత్వ ధనమేగా, ప్రజాధనం కాదుగా’ అంటూ ఆడిట్‌కు వచ్చిన ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు.. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామంలోని సబ్ పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ మాస్టర్‌గా పనిచేసే బొత్స రామారావు రూ.11 లక్షల మేర పక్కదారి పట్టించినట్టు ఆడిట్‌లో వెల్లడైంది.

కూలీలకు ఇవ్వాల్సిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేసి తీసుకెళుతున్న పోస్ట్ మాస్టర్... అదనంగా తీసుకెళుతున్న మొత్తానికి లెక్కలు తేలకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో మూడు రోజులుగా ఆడిట్ నిర్వహించగా అసలు విషయం బయటపడింది. అదనంగా తీసుకొచ్చిన మొత్తాన్ని అతడు జేబులో వేసుకుంటున్నట్టు తేలింది. దీనిపై ఆడిట్‌కు వచ్చిన ఓ ఇన్‌స్పెక్టర్‌ను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ అడగగా పోస్ట్ మాస్టర్ తిన్నది ప్రభుత్వ ధనమేగా, ప్రజాధనం కాదుగా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు