టాప్‌–10లో 11,214 మంది

17 Apr, 2017 02:54 IST|Sakshi

ఫస్టియర్‌లో 9,593 మంది, సెకండియర్‌లో 1,621 మంది

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో 11,214 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు (టాప్‌–10) సాధించారు. ఇందులో ప్రథమ సంవత్సర విభాగంలో 9,593 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరంలో 1,621 మంది ఉన్నారు. ఫస్టియర్‌లో ఎంపీసీ కేటగిరీలో 7,441, బైపీసీలో 1,756, ఎంఈసీలో 304, హెచ్‌ఈసీలో 12, సీఈసీలో 80 మంది విద్యార్థులున్నారు. సెకండియర్‌లో ఎంపీసీ కేటగిరీలో 83, బైపీసీలో 636, ఎంఈసీలో 64, హెచ్‌ఈసీలో 13, సీఈసీలో 25 మంది ఉన్నారు.

టెన్త్‌లో 9.3 జీపీఏ.. ఇంటర్‌లో 991
మంచిర్యాల సిటీ: మంచిర్యాలకు చెందిన పిట్టల లక్ష్మీ భవాని బైపీసీలో 991 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. మంచిర్యాల ఆల్ఫోర్స్‌ కాలేజీలో చదివిన ఈమె.. టెన్త్‌లో 9.3 జీపీఏ సాధించింది. భవానిని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అభినందించారు. ఆమె తల్లిదండ్రులు శ్రీశైల మల్లికార్జున్, శారద ఆనందం వ్యక్తంచేశారు.

ఐఏఎస్‌ కావాలని ఉంది
నిజామాబాద్‌ అర్బన్‌: ఎంపీసీలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నోమన్‌ రజ్వీ 993 మార్కులు సాధించాడు. కాకతీయ కాలేజీలో చదివిన రజ్వీ.. ‘‘నాకు ఐఏఎస్‌ కావాలని ఉంది. అందుకే పకడ్బందీగా చదువుతున్నాను’’ అని చెప్పాడు.

మెరిసిన దర్జీ బిడ్డ..
పరకాల: ఒకటే కరెంట్‌ బల్బు.. ఆ బల్బు కిందే రెక్కల కష్టం.. ఈ కష్టాలన్నీ చూస్తూ పెరిగిన ఓ పేదింటి బిడ్డ ఇంటర్‌ ఫలితాల్లో మెరిసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలకు చెందిన ఎల్దండి వెంకటేశ్వర్లు–అనిత దంపతుల కుమార్తె రాధిక ఫస్టియర్‌ ఎంసీపీలో 466 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండోస్థానం సాధించింది. టైలర్‌ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు.. ఆర్థికభారమైనా తమ కుమార్తెను ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివించాడు. టెన్త్‌లో 9.8 జీపీఏ రావడంతో భీమారంలోని సాయి శివానీ కళాశాల యాజమాన్యం ఇంటర్‌ విద్య ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది.

ఐఏఎస్‌ సాధిస్తా..
ఖమ్మం జెడ్పీసెంటర్‌: ఇంటర్‌ ఫలితాల్లో ఖమ్మం రెజొనెన్స్‌ కాలేజీకి చెందిన కొండా నిఖిత(ఎంపీసీ) 993 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ‘‘ఇది జీవితంలో మరిచిపోలేను. ఐఏఎస్‌ కావాలన్నది నా లక్ష్యం. ఇదే స్ఫూర్తితో కష్టపడి చదువుతా..’’ అని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు