‘ఒక్క నెలలో 32 లక్షల మంది ప్రయాణించారు’

29 Dec, 2017 17:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైలు ప్రారంభించిన ఒక్క నెలలోనే 32.25 లక్షల మంది ప్రయాణించారని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రకటన సారాంశం...అనేక సమస్యలు ఎదుర్కొని మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాను ఎన్నో సార్లు మదనపడ్డానని, ఎన్నో విమర్శలు కూడా వచ్చాయని చెప్పారు. తెలంగాణ వస్తే ఎల్ అండ్ టీ వెళ్లిపోతుందనే పుకార్లు కూడా వచ్చాయని అన్నారు. అన్నింటినీ తట్టుకున్నామని వ్యాఖ్యానించారు.  నెల రోజుల కిందట రైలు ప్రారంభం అయిందని, ప్రి మెట్రో, పోస్ట్ మెట్రోకు సంబంధించి ముందే ప్రెజేంటేషన్ ఇచ్చానని వెల్లడించారు.

 రైలు ప్రారంభం అయిన తర్వాత కూడా విమర్శలు వచ్చాయని, సగటున రోజుకు లక్షమంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. 23 స్టేషన్ల వద్ద పార్కింగ్ సౌకర్యం ఉందని, ఒక్క ప్రకాష్ నగర్ స్టేషన్‌ వద్ద మాత్రమే పార్కింగ్‌ సౌకర్యం లేదన్నారు. ప్రజారవాణాను పెంచడం పైనే తమ దృష్టి  ఉందన్నారు. కంప్యూటరైజ్‌డ్‌ స్మార్ట్‌ పార్కింగ్ వ్యవస్థను త్వరంలో ప్రవేశపెడతామని చెప్పారు. కలర్ కోడింగ్‌ను అమలు చేసి పార్కింగ్ ఇబ్బందులు తొలగిస్తామన్నారు. ఫుట్ పాత్ నడకను నగర వాసులకు అలవాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, 220 మీటర్ల ప్రాంతం ప్రతి స్టేషన్‌లో ఫుట్ పాత్‌ కోసం కేటాయిస్లున్నట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకూ 1.5 లక్షల స్మార్ట్‌ కార్డులు అమ్ముడు పోయానని, 22 శాతం ప్రయాణికులు స్మార్ట్‌ కార్డులు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ కొత్తగా రెండు వేల మంది ప్రయాణికులు స్మార్ట్‌కార్డులు తీసుకుంటున్నారని చెప్పారు. నాలుగైదు రోజుల్లో ప్రతి స్టేషన్‌లో మెట్రో టైం టేబుల్‌ ప్రదర్శించేవిధంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే టాయిలెట్ల ఏర్పాటు, మెయింటెనన్స్‌ కోసం వారంలో టెండర్లు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు