కోటీశ్వరుడవ్వాలని..

10 Dec, 2015 03:38 IST|Sakshi
కోటీశ్వరుడవ్వాలని..

బొల్లారం: వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు గుర్రపు పందెం ద్వారా కోటీశ్వరుడు కావాలనుకున్నాడు. హైదరాబాద్‌లోని బ్యాచిలర్స్ హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లు చోరీ చేయడంతో పాటు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. సదరు కేటుగాడిని తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసి.. 40 ల్యాప్‌టాప్‌లు, 35 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బేగంపేట ఏసీపీ గణేష్‌రెడ్డి, తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ సత్తయ్యతో కలిసి విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం...

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలుకు చెందిన కమెపల్లి కృష్ణమోహన్ అలియాస్ కార్తీక్ అలియాస్ క్రిష్ (35) బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చదువుకు స్వస్తి చెప్పి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. 2002 వరకు సినీ పరిశ్రమలో సహాయ నిర్మాతగా కొనసాగాడు. నిర్మాతగా ఆశించినంత డబ్బు రాకపోవడం.. వ్యసనాలకు బానిస కావడంతో గుర్రపు పందాలు కాసి త్వరగా కోటీశ్వరు కావాలనుకున్నాడు.


ఇందుకు అవసరమైన డబ్బు కోసం 2003 నుంచి చోరీల బాట పట్టాడు. నగరంలోని బ్యాచిలర్స్ హాస్టళ్లతో పాటు తాళం వేసి ఉన్న ఇళ్లలోనూ చోరీలు చేస్తున్నాడు. చోరీ సొత్తును కర్ణాటకలోని మైసూర్‌లో విక్రయించేవాడు. అక్కడే మకాంపెట్టి వచ్చిన డబ్బుతో గుర్రపు పందాలు ఆడుతూ జల్సాలు చేస్తున్నాడు.
 
ఉన్నత కుటుంబం...
నిందితుడు కృష్ణమోహన్‌ది ఉన్నత కుటుంబం. తల్లి విశ్రాంత ఉపాధ్యాయురాలు కాగా.. సోదరులు ఉన్నత చదువులు చ దివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అయితే, వ్యసనాలకు బానిసైన కృష్ణమోహన్ బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి,  సులభంగా కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఘరానా దొంగగా మారి జైలు పాలుకావడం గమనార్హం.
 
సెంచరీ దాటిన కేసులు...
కృష్ణమోన్ జంటనగరాల్లోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 117 చోరీలకు పాల్పడి పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా మారాడు. ఇతడిపై 15 నాన్‌బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఎస్‌ఆర్‌నగర్ ఠాణా పరిధిలో మొదటసారి చోరీ చేశాడు. మూడు చోరీలు చేసి పోలీసులకు చిక్కాడు. తర్వాత 2009లో మాదాపూర్‌లో 52 చోరీలు చేసిన కృష్ణమోహన్ 2012లో ఎస్సార్‌నగర్‌లో 22, మారేడ్‌పల్లిలో 2, మల్కాజిగిరిలో 6, ఇవే కాకుండా పంజగుట్టతో పాటు జంటనగరాలలో వివిధ ఠాణా పరిధి మొత్తం 117 దొంగతనాలకు పాల్పడ్డాడు.  

పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న ఇతడిని బుధవారం తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిను గుర్రపు పందాలు ఆడి త్వరగా కోటీశ్వరుడు కావాలనే ఉద్దేశంతో చోరీలు చేస్తున్నట్టు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితుడి నుంచి పోలీసులు 40 ల్యాప్‌టాప్‌లు, 35 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు