-

రెండో పెళ్లి తప్పింది.. తొలి పెళ్లి అయ్యింది

12 Jun, 2015 20:46 IST|Sakshi
రెండో పెళ్లి తప్పింది.. తొలి పెళ్లి అయ్యింది

తాండూరు (రంగారెడ్డి): భార్య ఉండగానే ఓ ప్రబుద్ధుడు రెండో పెళ్లికి సిద్ధమవటం.. తీరా తాళి కట్టే సమయానికి మొదటి భార్య రావటం.. పెళ్లి ఆగిపోవటం.. ఏం చేయాలో తోచక వేరే వ్యక్తికి వధువునిచ్చి పెళ్లి చేయటం.. చూస్తే ఏదో సినిమా జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తుందిగా.. ఈ పెళ్లి. సరిగ్గా ఓ పెళ్లిలో ఇదే జరిగింది. శుక్రవారం తాండూరు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం..  ఘట్‌కేసర్ మండలం రాంపల్లికి చెందిన మంజులకు 1989లో వినోద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. రెండేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు. తరువాత 2004 సంవత్సరంలో లంగర్‌హౌస్‌కు చెందిన తన మేనమామ కొడుకు గాజర్ల కిరణ్‌వర్మను పెళ్లి చేసుకున్నారు.

తరువాత సేల్స్ రి్రపజెంటేట్‌గా పనిచేసే కిరణ్‌వర్మ, మంజుల ఇద్దరు కొంతకాలం విశాఖపట్నంలో నివసించారు. రెండేళ్ల క్రితం ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చారు. తాజాగా తాండూరు పట్టణానికి చెందిన ఓ అమ్మాయితో తెలిసిన వారి ద్వారా కిరణ్‌వర్మ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. తనకు ఇదివరకే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు మంచి ముహూర్తం ఉందని, అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. వరకట్నం కింద రూ.లక్ష నగదు, నాలుగు తులాల బంగారం ఇతర కానుకలు మాట్లాడుకున్నారు. వధువు తరఫున కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్న సమాచారం తెలుసుకున్న మంజుల గురువారం రాత్రే కీసర పోలీసుస్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలిపింది.

మంజుల తన తండ్రి రాజేశ్వరరావు, సోదరుడు బాల్‌రాజ్‌లతో కలిసి తాండూరుకు రాత్రి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే మంజుల పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, ఆధార్‌కార్డు, ఫొటోలు తదితర ఆధారాలు పోలీసులకు చూపించింది. పోలీసులు వధువు తరఫు వారికి జరిగిన విషయం తెలపడంతో మొదట షాక్ తిన్నారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి, కిరణ్‌వర్మను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వరుడి తరఫున వచ్చిన కొందరు దగ్గర బంధువులు మినహా అందరూ అక్కడి నుంచి ఫలాయనం చిత్తగించారు. ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. అనంతరం రెండో పెళ్లి తప్పిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. కూతురు పెళ్లి ఆగిపోవద్దని భావించి కొన్ని గంటల వ్యవధిలో గతంలో అనుకున్న బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించారు.

మంజులను పెళ్లి చేసుకోలేదు: కిరణ్‌వర్మ
తన భార్యగా చెప్పుకుంటున్న మంజులను నేను పెళ్లి చేసుకోలేదు. ఆమెతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. సేల్స్ రిప్రజంటేటీవ్‌గా పని చేస్తూ విశాఖపట్నంలో ఇద్దరు కలిసి నివసించాం. సుమారు రెండేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాం.

మరిన్ని వార్తలు