పర్యాటకంలో భారీ పెట్టుబడులకు వీలు

1 Jul, 2016 01:23 IST|Sakshi
పర్యాటకంలో భారీ పెట్టుబడులకు వీలు

- రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే సదుపాయాలు కల్పిస్తాం
- గిజో-ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం
 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఐదు రోజుల చైనా పర్యటన ముగిసింది. గురువారం రాత్రి 11.20 గంటలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబుకు కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్, ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు స్వాగతం పలికారు. చంద్రబాబు శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమవనున్నారు.

కేంద్రమంత్రి ఉమాభారతిని కూడా సీఎం కలవనున్నారు. కాగా చైనా పర్యటన చివరిరోజైన గురువారం సీఎం చంద్రబాబు.. గిజో-ఏపీ ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో ప్రసంగించారు. ఏపీ పర్యాటక రంగంలో ప్రస్తుతం 5.2 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశాలున్నాయని చెప్పారు. ఏపీలో పరిశ్రమలు స్థాపిస్తే సదుపాయాలు కల్పిస్తామన్నారు. చైనా పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈవోలు ఏపీలో పర్యటించాలని కోరారు.  ఏపీలో పెట్టుబడులకు అవకాశమున్న రంగాలు, రాష్ట్ర సానుకూలతలు, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.

 చైనాతో ఆరు ఒప్పందాలు
 చైనా పర్యటనలో భాగంగా అక్కడి ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలతో రాష్ట్రప్రభుత్వం ఆరు ఒప్పందాలు చేసుకుంది. పవ ర్ చైనా గిజో ఇంజనీరింగ్ కార్పొరేషన్‌తో జరిగిన ఒప్పందం ఇందులో ఒకటి. ఏపీలో రానున్న పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, విద్యుదుత్పత్తి, ప్రసారం, పారిశ్రామికాభివృద్ధి రంగాల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెడుతుంది. కాగా రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి సహకారమందించడంపై చైనా స్టేట్ కన్‌స్ట్రక్షన్ ఫోర్త్ ఇంజనీరింగ్ డివిజన్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం జరిగింది.

రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి సహకారంపై సౌత్ హ్యూటన్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. మరోవైపు రాష్ర్టంలో నిర్మించనున్న బిల్డింగ్ మెటీరియల్ మాన్యుఫాక్చర్ పార్క్ నిర్మాణంలో ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టేందుకు గిజో చాంగ్ తైయువాన్ ఎనర్జీ సేవింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీ లిమిటెడ్ ముందుకొచ్చింది. భవన నిర్మాణరంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానమందించేలా ఎసెడ్రిల్స్ రాక్ టూల్స్ కంపెనీ లిమిటెడ్‌తో, రాష్ట్రంలో ఏర్పాటయ్యే  పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడులు పెట్టేలా గిజో మారిటైమ్ సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్  ఇన్‌వెస్టిమెంట్ కార్పొరేషన్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

 నేడు అరుణ్‌జైట్లీతో సీఎం భేటీ
 ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో జరిపే సమావేశంలో రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, రెవెన్యూ లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు నిధుల విడుదల అంశాలపై చర్చించనున్నారు. సీఎం సమావేశం సందర్భంగా రెవెన్యూలోటు భర్తీ కింద మరో రూ.500 కోట్లు విడుదల చేయనున్నట్లు జైట్లీ ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి అదనంగా మంత్రి పదవుల కేటాయింపుల అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రావచ్చని టీడీపీ వర్గాల సమాచారం. అయితే ఈసారికి కేంద్రమంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి అవకాశం దొరకకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు