డ్రగ్స్‌కు బానిసై...

5 Sep, 2015 00:39 IST|Sakshi

బంజారాహిల్స్ :   ట్రయల్ పేరుతో షోరూం నిర్వాహకులను బురిడీ కొట్టించి హార్లీ డేవిడ్‌సన్ బైక్‌తో ఉడాయించిన తొర్లపాటి కిరణ్ గత కొంత కాలం నుంచి డ్రగ్స్‌కు అలవాటుపడినట్లు అతని తండ్రి ప్రకాశ్ పోలీసుల విచారణలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఎస్‌ఎస్‌సీ వరకు చదివిన కిరణ్ ఐఐటీలో జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన ఉత్తమ విద్యార్థిగా గుర్తింపు పొందాడని అలాంటి వాడు ఇటీవల డ్రగ్స్‌కు అలవాటుపడి జీతం సరిపోక అడ్డదారులు తొక్కుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

గత కొంత కాలంగా కిరణ్ ప్రవర్తనలో మార్పులు గమనిస్తున్నామని అయితే దొంగతనం చేసే స్థాయిలో ఉంటుందని తాము ఊహించలేకపోయామని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. తమ పరువు ప్రతిష్టలు గంగలో కలిశాయని ముఖం చూపించుకోలేకపోతున్నామని విలపించారు. * 6 లక్షల విలువైన బైక్‌తో ఉడాయించిన కిరణ్‌ను ముంబైలో బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే బైక్‌ను అమ్మే ప్రయత్నం చేస్తుండగానే పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో కిరణ్ పథకం బెడిసికొట్టింది. ఐఐటీ చదివి ముంబైలోని ఓఎన్‌జీసీలో రూ. 1.50 లక్షల జీతంతో పని చేస్తున్న కిరణ్‌కు ప్రతి నెలా మత్తు పదార్థాలకే రూ. 1.50 లక్ష దాకా ఖర్చవుతున్నాయని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ బైక్‌ను అమ్మి ఇందులో పట్టుబడకపోతే వచ్చే నెలలో మరో చోరీకి పథకం వేసినట్లు కూడా పోలీసులు గుర్తిం్చరు. గతంలో కిరణ్ ఇలాంటి దొంగతనాలు చేశాడా అనే విషయం అతను ఇక్కడికి వచ్చాక తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు