కొత్త జిల్లాలకు అదనపు ఎస్పీలే పోలీస్ బాస్‌లు!

11 May, 2016 04:12 IST|Sakshi
కొత్త జిల్లాలకు అదనపు ఎస్పీలే పోలీస్ బాస్‌లు!

* పోలీసు శాఖను తీవ్రంగా వేధిస్తున్న ఐపీఎస్‌ల కొరత
* మొత్తం 112 పోస్టులకు అందుబాటులో ఉన్నది 74 మందే
* అదనపు ఐపీఎస్‌ల కేటాయింపుపై చేతులెత్తేసిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదనపు ఎస్పీలే కొత్త జిల్లాలకు పోలీసుబాసులుగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఐపీఎస్ అధికారుల కొరతే దీనికి కారణం. రాష్ట్ర విభజన అనంతరం పోలీసు కేడర్ పోస్టులను పంపిణీ చేసిన కేంద్రం అవసరమైనదానికన్నా తక్కువగా ఐపీఎస్ అధికారులను కేటాయించింది. అసలు మంజూరైన పోస్టులు 112కాగా.. 92 మందినే ఇచ్చింది.

వీరిలోనూ పన్నెండు మంది వరకు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఉన్నారు. మరో ఆరుగురు పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం 74 మంది ఐపీఎస్ అధికారులతోనే తెలంగాణ సర్కారు నెట్టుకొస్తోంది. దీంతో చాలా పోస్టులను ఇన్‌చార్జులతో నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అదనంగా ఐపీఎస్‌లను కేటాయించాలని కేంద్రానికి డీజీపీ అనురాగ్‌శర్మ ఇప్పటికే మూడు సార్లు నివేదించారు. కానీ సానుకూల స్పందనేదీ రాలేదు. దీంతో కొత్త జిల్లాలకు అదనపు ఎస్పీలకు ప్రమోషన్లు కల్పించి ఎస్పీలుగా నియమించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
 
రాష్ట్ర కేడర్ అధికారులే దిక్కు
ఇటీవల సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మలు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి తమకు కేడర్ అధికారులు తక్కువగా ఉన్నారని, ఎక్కువ మొత్తంలో సిబ్బందిని కేటాయించాలని కోరారు. అయితే కేంద్రం మాత్రం అధికారులను కేటాయించకుండా, అదనంగా మరో 15 కేడర్ పోస్టులను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ పోస్టుల సంఖ్య 127కు పెరిగింది. అధికారులు మాత్రం 74 మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలకు రాష్ట్ర కేడర్ అధికారులను వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న 1985, 89 బ్యాచ్‌ల ప్రమోటీలు, 2007, 2010 బ్యాచ్‌లకు చెందిన గ్రూప్ వన్ అధికారులకు పదోన్నతులు కల్పించి కన్ఫర్డ్ ఐపీఎస్ కల్పించాల్సి ఉంటుంది.
 
నాన్చుడు ధోరణితో మరింత ఒత్తిడి
నాన్ కేడర్ అధికారుల సీనియారిటీ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. డీఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీల విభజన కూడా నత్తనడకన సాగుతోంది. ప్రమోటీలు, డెరైక్ట్ రిక్రూటీలు ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ వ్యవహారం తేలితే కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతుల కోసం అర్హులైన అధికారుల జాబితాను కేంద్రానికి పంపే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు