ప్రభుత్వ గోదాములకే ప్రాధాన్యం

21 Aug, 2016 00:47 IST|Sakshi
ప్రభుత్వ గోదాములకే ప్రాధాన్యం

- ఆ తర్వాతే ప్రైవేట్ గోదాముల్లో నిల్వలు
- మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్ సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ గోదాములు భర్తీ అయిన తర్వాతే ప్రైవేటు గోదాములకు నిల్వలు తరలించాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. రైతులు, వ్యాపారులు, పౌర సరఫరాల శాఖ తమ అవసరాల కోసం ప్రభుత్వ గోదాములకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు లేఖలు రాయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్‌రావు శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ గోదాముల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు పౌర సరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ తదితర అన్ని ప్రభుత్వ సంస్థలు తప్పనిసరిగా వినియోగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసే పక్షంలో మార్కెటింగ్ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలన్నారు. జాతీయ వ్యవసాయ మార్కెట్లతో స్థానిక మార్కెట్లను అనుసంధానించడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో పాటు వ్యాపారులు, రైతులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్‌ను సెప్టెంబర్ 15లోగా అందుబాటులోకి తేవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుల గోదాముల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 17.75 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న 330 గోదాముల నిర్మాణం చేపట్టగా వాటిల్లో 101 గోదాముల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మార్కెటింగ్ శాఖ చేపట్టిన ‘మన కూరగాయలు’ పథకానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, ప్రస్తుతం నడుస్తున్న 21 ఔట్‌లెట్లతోపాటు మరో ఆరు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరక్టర్ డాక్టర్ శరత్, అదనపు డైరక్టర్ లక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు.

 టమాట రైతులకు ప్రోత్సాహక ధర
 టమాట ధరలు తగ్గిన నేపథ్యంలో రైతులకు ప్రోత్సాహక ధర ఇప్పించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. మన కూరగాయలు పథకంలో భాగంగా సేకరణ కేంద్రాల ద్వారా రైతుల నుంచి కిలోకు రూ.5 చొప్పున కొనుగోలు చేస్తారు. రైతుబజార్ల ద్వారా అమ్ముకునే రైతులకు ప్రాధాన్యమిస్తూ వినియోగదారులకు రూ.7కు తగ్గకుండా విక్రయిస్తారు.

మరిన్ని వార్తలు