‘యూఎల్‌సీ’ లెక్క తేలింది!

15 Dec, 2014 23:30 IST|Sakshi
‘యూఎల్‌సీ’ లెక్క తేలింది!

సర్కారుకు అధికారుల నివేదిక
నేడు అఖిలపక్ష సమావేశం
కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

 
సిటీబ్యూరో: నగరంలో పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్‌సీ) స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఈ వివరాలను అఖిల పక్షం ముందు ఉంచాల్సి రావటంతో సత్వరమే ఇవ్వాలని  ఉన్నతాధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల యం త్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేస్తున్న సర్కారు... యూఎల్‌సీ స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని యోచిస్తోంది. నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో యూఎల్‌సీ స్థలాలు అధికంగా ఉండటంతో స్పష్టమైన సమాచారం కావాలని విపక్షాలు డిమాండ్ చేయటంతో... సర్వే నంబర్ల వారీగా వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. పార్టీలకు కూడా వీటిని అందజేసినట్లు తెలిసింది. యూఎల్‌సీ, ప్రభుత్వ  భూములు, ఇళ్లు, భవనాల క్రమబద్ధీకరణపై మంగళవారం (ఈ నెల 16న) ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
 
కాసుల పంటపై భారీ ఆశలు

హైదరాబాద్ జిల్లాలో యూఎల్‌సీ భూములు 1736 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 1614 ఎకరాలలో 35 వేలకు పైగా భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ శాఖ, వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా రూ. కోట్లలో ఆదాయాన్ని రాబట్టవచ్చునని సూచించినట్లు తెలుస్తోంది. వివాదాలు లేని యూఎల్‌సీ భూమి 72 ఎకరాలు ఉంటుందని అంచనా వేశారు. వీటి అమ్మకాల ద్వారా రూ.కోట్లలో నిధులు రాగలవని తేల్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమి 21.10 ఎకరాలు ఉందని, తద్వారా రూ.1500 కోట్లు రాబట్టుకోవచ్చునని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని 11 పట్టణ మండలాల్లో 3,452.25 ఎకరాల యూఎల్‌సీ భూములు ఉండగా, ఇందులో 1369.19 ఎకరాలపై కోర్టు కేసులు ఉన్నాయి. 1482 ఎకరాల్లోని నిర్మాణాలు క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 601 ఎకరాల్లో భూములను విక్రయించవచ్చునంటున్నారు. వీటిలో శేరిలింగంపల్లిలోని భూములే ఎక్కువని సమాచారం.

ధరపై ఏకాభిప్రాయం కరువు

యూఎల్‌సీ, ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకర ణకు నిర్దేశించాల్సిన ధరపై ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కనీస ధరనే పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తుండగా... అది సరైన యోచన కాదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
 
 

మరిన్ని వార్తలు