ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్

21 Jul, 2013 03:55 IST|Sakshi
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్ ఏ రేంజ్‌లో ఉపయోగపడుతుందో చెపానికి పైవన్నీ చిరు ఉదాహరణలు మాత్రమే. సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఆదరణనే ఆదాయంగా మలచుకుంటూ ఆన్‌లైన్ లో ఆధునిక వ్యాపార సామ్రాజ్యం అంతకంతకూ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటినీ ఇంటర్నెట్టునీ కలిపి ఉపయోగించుకుంటూ కొందరు వ్యాపారం లో రాణిస్తున్నారు. సోషల్ మీడియా ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగమైపోయింది. 
 
ఈ క్రమంలో దానినే వ్యాపారానికి వేదికగా మార్చుకున్న అమ్మాయి విజయగాథ ఇది. ఎలైట్ కస్టమర్స్‌ని చేరుకోవడానికి ఆన్‌లైనే వేదిక. దీని ద్వారా స్టోర్‌ని ఏరాఠ956?టు చేయడం, నిర్వహించడం వంటి ఖర్చులన్నీ ఆదా అవుతాయి’ అంటున్నారు కుష్నీత్ కురేజా. యాక్ససరీస్ లేకుండా దుస్తులు ధరించడమంటే కేక్ లేని పార్టీ లాంటిదే అంటున్న  కుష్నీత్... ఔరా పేరుతో ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ని ఆన్‌లైన్‌లో ప్రారంభించింది. సెయింట్‌ఫ్రాన్సిస్ కాలేజీ నుంచి బయో టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకున్న ఈ హిమాయత్‌నగర్ అమ్మాయి... జంక్ జువెలరీ, యాక్సెసరీస్ అంటే చిన్నప్పటి నుంచీ తనకున్న ఇష్టాన్ని ధరించడం ద్వారా తీర్చుకుంటూనే... వాటి తయారీలోనూ నైపుణ్యాన్ని సాధించింది. 
 
నెక్లెస్‌లు, లాంగ్‌చైన్‌లు, పెండెంట్లు, చెవి దిద్దులు, ఉంగరాలు, జంక్ యాక్సెసరీస్‌ని ఆమె రూపొందిస్తోంది. తన యాక్ససరీస్ తనే స్వయంగా డిజైన్ చేసుకోవడం చూసి స్నేహితులు పంచిన అభినందనలే స్ఫూర్తిగా ఈ బ్రాండ్‌కు రూపకల్పన చేశానంటోంది కుష్మీత్. ప్రారంభించిన ఆర్నెల్లలోనే.. ఫేస్‌బుక్‌లో వచ్చిపడిన వందలాది లైక్స్‌ను కస్టమర్స్‌గా మార్చుకుంది. హృదయాకారంలోనివి, జంతువుల రూపాలతో ఉన్న పెండెంట్స్... వంటివి పూర్తిగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తాను రూపొందిస్తున్న కలెక్షన్... వారి పాకెట్‌మనీని వెచ్చిస్తే సరిపోయే స్థాయిలోనే ఉంటాయని అంటోందీమె. వీటి ధరలు రూ.150 నుంచి రూ.1000 వరకు ఉన్నాయంటున్నారు.
 
ధైర్యాన్నిచ్చింది...
పెట్టుబడి పెద్దగా అవసరం లేకుండా వ్యాపారం ధైర్యంగా ప్రారంభించడానికి, పబ్లిసిటీ లేకుండానే కస్టమర్స్‌ని చేరుకోవడానికి తనకు ఆన్‌లైన్ వీలు కల్పించిందని అంటారు ప్రియ ఆనందంగా. తమ దగ్గరున్న చాక్లెట్ వెరైటీలన్నీ ప్రదర్శించుకోవడానికి ఫేస్‌బుక్ వేదికగా మారిందన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తై వెంటనే పెళ్లి చేసుకుని ఇల్లాలైపోయిన ప్రియా కపాడియా... అప్పుడే తన జీవితం ఇంటికి పరిమితమైపోతోందేమో అనే ఆందోళన చెందే అవసరం లేకుండా ఆన్‌లైన్ ఆదుకుంది. ప్రస్తుతం ఆదర్శనగర్‌లో నివసిస్తున్న ఈమె తన ను తాను నిరూపించుకునే క్ర మంలో చాక్లెట్లపై ప్రేమను కురిపిస్తున్నారు. లవ్ ఫర్ చాక్లెట్స్ పేరిట ఆమె అందిస్తున్న ప్రేమ పూర్వక తీపి రుచులు ఇప్పుడు నెటిజన్లను ఊరిస్తున్నాయి.

తయారీ నుంచి ప్యాకింగ్ వరకు అంతా స్పెషలే అంటున్న ప్రియ... తన హోమ్ మేడ్ చాక్లెట్స్ 100 శాతం వెజిటేరియన్ అని చెప్పారు. హార్డ్ సెంటర్, సాఫ్ట్ సెంటర్, పర్సనలైజ్డ్ ఎస్సెమ్మెస్, ప్రింటెడ్ చాక్లెట్స్, ప్లెయిన్ చాక్లెట్స్... ఇలా 6 రకాలుగా తన మెనూను విభజించిన ప్రియ... రూ.10 నుంచి రూ.70 వరకు తన ధరల పట్టీ ఉందంటున్నారు. అయితే కనీసం 250 గ్రాములు లేనిదే ఆర్డర్ తీసుకోబోనంటున్నారు. పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, దీపావళి... వగైరా శుభ సందర్భాలకు వెరైటీగా చాక్లెట్ లాలిపప్స్ అందిస్తున్నానన్నారు. 
 
కస్టమర్లతో దీర్ఘకాలిక సంబంధాలు...
ఇంటర్నెట్ నాకు చాలా హెల్ప్ చేసింది. నా వ్యాపారాన్ని నగరవ్యాప్తంగా విస్తరింపజేసింది. కేవలం ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను నా కస్టమర్లతో వీలున్నప్పుడల్లా ఇన్‌స్టాంట్‌గా కనెక్ట్ అవడానికి వీలు కల్పించింది’ అంటున్నారు మారేడుపల్లి వాసి మెలానీ గాబ్రియేల్. కొంత కాలంగా గృహిణి గా ఇంటికే పరిమితమైన ఈమె... కుటుంబ సభ్యుల కోసం సరదాగా తయారు చేస్తూ వచ్చిన చాక్లెట్స్‌ను వ్యాపారంగా మలచడానికి ఆన్‌లైన్ ఓ చక్కని మార్గమైంది.

చుట్టుపక్కలవారి సలహా, సహకారాలతో గత మార్చిలో ఆమె చాక్లెట్‌హెవెన్ పేరిట ఆన్‌లైన్ స్టోర్‌ను అంతర్జాలం వేదికగా ఆవిష్కరించారు. ‘చాక్లెట్స్‌లో బాదం, బట్టర్‌స్కాచ్, క్యారామెల్... ఇలాంటి వెరైటీలన్నీ అందిస్తున్నాను. వాలెంటైన్స్‌డే నాడు హృదయాకారంలో, క్రిస్టమస్ రోజున శాంతాక్లాజ్ రూపంలో... ఇలా సందర్భోచితంగా డిజైన్ చేయడం నా ప్రత్యేకత’ అని ఆమె సగర్వంగా చెబుతున్నారు.

ఏదైతేనేం కొన్ని నెలల కాలంలోనే చాక్లెట్‌హెవెన్ చాలా మందికి చేరువైంది. గాబ్రియెల్ అందించే రుచులకు స్థిరమైన వినియోగదారుల జాబితాను ఇంటర్నెట్ అమర్చిపెట్టింది కూడా. ‘నా ఉత్పత్తుల మీద వినియోగదారుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, వారి అభిరుచులను పంచుకోవడానికి, నా నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అన్నింటికీ ఆన్‌లైన్ ఓ మంచి మార్గమైంది’ అంటారు ఆనందంగా గాబ్రియేల్.
మరిన్ని వార్తలు