జర్నలిస్ట్‌పై ‘ఫత్వా’

2 Aug, 2017 03:16 IST|Sakshi
జర్నలిస్ట్‌పై ‘ఫత్వా’
- డార్క్‌నెట్‌పై వార్త రాసిన ఆంగ్ల పత్రిక విలేకరి 
అతడిని అంతం చేసేందుకు బిట్‌కాయిన్ల ఆఫర్‌ ఇచ్చిన డ్రగ్‌ పెడ్లర్‌ 
సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన విలేకరి
 
సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌కు డ్రగ్‌ మాఫియా నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్‌ వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే... మాదకద్రవ్యాల వ్యాపారంపై కథనం రాసిన ఓ విలేకరికి హెచ్చరికలు అందాయి. డార్క్‌నెట్‌లో డ్రగ్స్‌ వ్యాపారంపై ఓ ఆంగ్ల పత్రికలో కథనం రాసినందుకు ఓ డ్రగ్‌ పెడ్లర్‌ ఆన్‌లైన్‌ ‘ఫత్వా’జారీ చేశాడు. సదరు జర్నలిస్ట్, అతడి కుటుంబాన్ని అంతం చేస్తే బిట్‌కాయిన్స్‌ రూపంలో నజరానా ఇస్తానంటూ ఇంటర్‌నెట్‌లో ప్రకటించాడు. దీనిపై ఆ విలేకరి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం కేసు నమోదైంది. 
 
అంతం చేస్తే రూ.7.2 లక్ష ..! 
డ్రగ్‌ కేసు దర్యాప్తు చేపట్టిన ఎక్సైజ్, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనేక మంది మాదకద్రవ్య విక్రేతల్ని అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు ఇంటర్‌నెట్‌లో అథోజగత్తుగా పరిగణించే డార్క్‌ నెట్‌ ద్వారా ఆర్డర్‌ చేసి, విదేశాల నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల పత్రిక విలేకరి డార్క్‌నెట్‌లో డ్రగ్స్‌ దందాపై కథనం రాశారు. అందులోని భారత పెడ్లర్ల కోసం శోధించిన ఆయన... మ్యాడ్లీబూటెడ్‌ ఐడీతో ఉన్న వ్యక్తి భారీగా మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు సాగిస్తున్నాడని గుర్తించారు. దీన్ని పేర్కొంటూ ఆయన రాసిన కథనం సదరు పత్రికలో విలేకరి పేరుతో సహా ప్రచురితమైంది. ఈ కథనాన్ని చూసిన సదరు డ్రగ్‌ పెడ్లర్‌ ఫేస్‌బుక్‌ ద్వారా జర్నలిస్ట్, ఆయన కుటుంబ వివరాలు సేకరించాడు. వీటిని పొందుపరుస్తూ ఇంటర్‌నెట్‌లో ‘ఫత్వా’జారీ చేశాడు. జర్నలిస్ట్‌ను అంతం చేస్తే నాలుగు బిట్‌కాయిన్లు (రూ.7.2 లక్షలు), కుటుంబ సభ్యుల్ని చంపితే ఆరు బిట్‌కాయిన్లు (రూ.10.8 లక్షలు) నజరానాగా ఇస్తానంటూ వారి ఫొటోలతో సహా ఓ పోస్టర్‌ రూపొందించి ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. 
 
ఐపీ అడ్రస్‌ గుర్తించే ప్రయత్నం... 
జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై ఇష్టాగోష్టీ చర్చలు జరిగే రెడిట్‌.కామ్‌ ఫోరమ్‌లో ఈ ‘ఫత్వా’ వివరాలు కనిపిం చాయి. అందులో 10 బిట్‌కాయిన్ల నజరానాపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ విషయం తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్న సదరు జర్నలిస్ట్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా దర్యాప్తు చేపట్టారు. అధికారులు ప్రాథమికంగా సేకరించిన సమా చారం ప్రకారం ఆ డ్రగ్‌ పెడ్లర్‌ మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ప్రత్యేక బ్రౌజర్ల ద్వారా డార్క్‌నెట్‌ వినియోగించే వారి ఐపీ అడ్రస్‌ గుర్తించడం కష్టసాధ్యం. ఆయా వెబ్‌సైట్లు హోస్ట్‌ అయ్యే సర్వర్లు రష్యా, పోలెండ్‌ తదితర దేశాల్లో ఉండమే దీనికి కారణమని అధికారులు చెప్తున్నారు. దీంతో ఆ డ్రగ్‌ పెడ్లర్‌కు చెందిన ఐపీ అడ్రస్‌ తెలపాల్సిందిగా ఆయా సంస్థలకు లేఖలు రాశారు. ఆ వివరాలు అందిన తర్వాత దర్యాప్తు ముమ్మరం చేస్తామని సైబర్‌ క్రైమ్‌ అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తలు