హైదరాబాద్ వచ్చివెళ్లిన ఆసియా అంద్రాబీ

31 Dec, 2015 03:22 IST|Sakshi
హైదరాబాద్ వచ్చివెళ్లిన ఆసియా అంద్రాబీ

సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద కశ్మీర్ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్ మిల్లత్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆసియా అంద్రాబీ గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారా..? అవుననే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి పోలీసు, నిఘా వర్గాలు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కుటుం బాన్ని పరామర్శించి వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

గత శనివారం పట్టుబడిన ‘ఐసిస్ త్రయం’ అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్‌లు సలావుద్దీన్‌కు బంధువులు కావడం, ఆసియాను కలవాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పడంతో ఇప్పుడీ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ ‘అంద్రాబీ వచ్చి వెళ్లినట్లు సమాచారం ఉన్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు. ఐసిస్ యువకుల కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకుని విచారిస్తున్నాం’ అని పేర్కొన్నారు. బుధవారం వార్షిక విలేకరుల సమావేశం నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.

నల్లగొండలో పుట్టి సిమిలో చేరి నుంచి నేషనల్ స్థాయికి ‘ఎదిగి’ ఆ సంస్థ మాజీ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సలార్‌కు జాతీయ స్థాయిలో సంబంధాలు ఉండేవి. అప్పట్లోనే ఇతడికి అంద్రాబీతో పరిచయం ఏర్పడింది. 2011లో అరెస్టు తరువాత.. విడుదలై నగరంలోనే నివసించాడు. గత ఏడాది అక్టోబర్‌లో నల్లగొండ నుంచి కారులో వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అంద్రాబీ హైదరాబాద్‌కు వచ్చి అతడి కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. ఈమె కుమారుడు సైతం నగరంలోని ఓ విద్యాసంస్థలో విద్యనభ్యసించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే 2012లోనూ అంద్రాబీ ఓసారి హైదరాబాద్ వచ్చివెళ్లారని సమాచారం.

సలావుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ‘ఐసిస్ త్రయం’ ఈమెను కలిశారా? లేదా? అనేది నిర్ధారణ కావాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. ఐసిస్ త్రయాన్ని తమ కస్టడీలోకి తీసుకున్న తరవాత ఈ కోణంలోనూ ప్రశ్నిస్తామని ఆయన తెలిపారు. పాక్ అనుకూల వాదిగా ముద్రపడ్డ అంద్రాబీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో కశ్మీర్‌లో పాకిస్థాన్ జెండాలను ప్రదర్శించి వివాదాస్పదమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన శ్రీనగర్ పోలీసులు ఆమెను అరెస్టు కూడా చేశారు. అంద్రాబీ బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ వచ్చి సలావుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించినట్లు అంగీకరించారు. అయితే ఐసిస్ సహా ఏ ఉగ్రవాద సంస్థకూ తాను మద్దతుకాదని, కాశ్మీర్ కోసం పోరాడుతున్న నేపథ్యంలోనే ఇలాంటి పుకార్లు పుడుతున్నాయని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు