పార్థసారథి, శర్మల బెయిల్‌ పిటిషన్లపై ముగిసిన వాదనలు

14 Jun, 2017 01:00 IST|Sakshi
పార్థసారథి, శర్మల బెయిల్‌ పిటిషన్లపై ముగిసిన వాదనలు
- మియాపూర్‌ భూముల కుంభకోణం కేసులో
- నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసిన హైకోర్టు
 
సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూముల కుంభకోణంలో నిందితులు ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పీఎస్‌ పార్థసారథి, సువిశాల పవర్‌ జనరేషన్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పీవీఎస్‌ శర్మ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం ఈ మేరకు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు తన నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పార్థసారథి, శర్మలకు కూకట్‌పల్లి కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో.. వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో ఓ సేల్‌డీడ్‌ తయారు చేశారని, అంతకుమించి ఏమీ జరగలేదని విన్నవించారు. పోలీసులు చెబుతున్నంత తీవ్రమైన కేసు కాదన్నారు. ఇప్పటికే పిటిషనర్ల కస్టడీ కూడా ముగిసిందని, అందువల్ల వారు జైలులో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి జరిగిన నష్టమేమీ లేదని వివరించారు. అయితే ఈ వాదనలను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సి.ప్రతాప్‌రెడ్డి తోసిపుచ్చారు. నేరపూరిత దురుద్దేశాలతో సేల్‌డీడ్‌లు తయారు చేశారని, దీని వల్ల ప్రభుత్వానికి రూ.కోట్ల మేర నష్టం వాటిల్లిందని కోర్టుకు విన్నవించారు.

పెద్ద మొత్తంలో స్టాంప్‌ డ్యూటీ ఎగవేశారని తెలిపారు. ప్రభుత్వ భూములను స్వాహా చేయాలన్న దురుద్దేశంతోనే పిటిషనర్లు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇందులో సబ్‌ రిజిస్ట్రార్ల సాయం తీసుకున్నారని వివరించారు. ఇది చాలా భారీ కుంభకోణమని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, చార్మినార్‌ను అమ్మినంత మాత్రాన దానిపై ఎవరికైనా హక్కులు సంక్రమిస్తాయా అంటూ ప్రశ్నించారు. వ్యక్తి వేరు, ప్రభుత్వం వేరని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి నష్టం కలిగించడమంటే ప్రజలకు నష్టం కలిగించడమేనని వివరించారు.
మరిన్ని వార్తలు