అసెంబ్లీ నిరవధిక వాయిదా

30 Mar, 2018 02:54 IST|Sakshi

13 రోజుల్లో 61 గంటల పాటు సాగిన అసెంబ్లీ కార్యక్రమాలు

48 గంటల 40 నిమిషాల పాటు నడిచిన మండలి..

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ మధుసూదనాచారి ప్రకటించారు. గురువారం పంచాయతీరాజ్, పురపాలక బిల్లులను ఆమోదించిన అనంతరం ఆయన సభను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. 13 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో మొత్తం 11 బిల్లులను సభ ఆమోదించిందని తెలిపారు.

60 గంటల 58 నిమిషాల పాటు సాగిన సభా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అత్యధికంగా 25.45 గంటలు మాట్లాడారు. అయితే, శాసనసభ కార్యదర్శి కార్యాలయంవిడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్‌ సభ్యులు గంటా 21 నిమిషాలు మాట్లాడినట్లు పేర్కొనడం గమనార్హం. గవర్నర్‌ ప్రసంగం రోజున ఏ పార్టీ వారికి మాట్లాడే అవకాశం రాలేదు. మరుసటి రోజున కాంగ్రెస్‌ సభ్యులు మాట్లాడే అవకాశం రాకుండానే సభ నుంచి సస్పెండ్‌ అయ్యారు.  

48 గంటల 40 నిమిషాల పాటు మండలి..
13 రోజుల పాటు నడిచిన శాసనమండలిలో 48 గంటల 40 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు సాగాయని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ చెప్పారు. గురువారం మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాల్లో మంత్రులు రెండు ప్రకటనలు చేశారన్నారు. అలాగే సభ్యులు మొత్తం వంద ప్రసంగాలు ఇచ్చారని వెల్లడించారు. 11 బిల్లులను మండలి ఆమోదించిందని.. ఐదు అంశాలపై లఘు చర్చ జరిగిందని స్వామిగౌడ్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు