నామినేషన్లకు ఇంకా కొన్ని గంటలే...

9 Nov, 2023 11:36 IST|Sakshi

హైదరాబాద్: నామినేషన్ల ఘట్టం ముగియడానికి మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఈ నెల 3వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుంది. దీంతో ఇంతవరకు నామినేషన్లు దాఖలు చేయని అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తిథుల రీత్యానూ గురు, శుక్రవారాలు శుభ దినాలుగా భావిస్తుండటంతో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

టెన్షన్‌.. టెన్షన్‌
ఆయా పార్టీల నుంచి టికెట్లు లభించిన వారు ఏర్పాట్ల హడావుడిలో ఉండగా, అభ్యర్థులను ప్రకటించని నియోజక వర్గాల్లో టిక్కెట్లను ఆశిస్తున్న ఆశావహుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ చార్మినార్‌ సీటును ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు. సీపీఐతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్‌ చార్మినార్‌ సీటును దానికి కేటాయించనుందనే ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఆ సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదని చెబుతున్నారు.

బీజేపీలో జనసేన కిరికిరి
బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో గ్రేటర్‌ పరిధిలోని సీట్లపైనా ఆ ప్రభావం పడుతోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్‌ స్థానాలను అది ఆశించగా కుత్బుల్లాపూర్‌ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌కు ఇచ్చారు. కూకట్‌పల్లిని జనసేనకు కేటాయించడంతో అది తన అభ్యర్థిగా ప్రేమ్‌కుమార్‌ను ప్రకటించింది.

ఇటీవలి కాలం వరకు బీజేపీలో ఉన్న ప్రేమ్‌కుమార్‌ జనసేనలో చేరి వెంటనే టికెట్‌ దక్కించుకున్నారు. శేరిలింగంపల్లిని జనసేనకు కేటాయించకుండా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానంతో జరిపిన సంప్రదింపుల్లో ఆ మేరకు సఫలమైనట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మల్కాజిగిరి, మేడ్చల్‌, నాంపల్లి, కంటోన్మెంట్‌ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పొత్తులో భాగంగా ఆ సీట్లు ఎవరికి దక్కనున్నాయనేది సస్పెన్స్‌గా మారింది.

మరిన్ని వార్తలు